
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: గోదావరి, ప్రాణహిత నదుల్లో ప్రవాహాలు పెరుగుతుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని మేడిగడ్డ ద్వారా గరిష్ట నీటిని ఎత్తిపోసే ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే మేడిగడ్డ పంప్‌హౌజ్ పరిధిలో మూడు మోటార్లకు ట్రయల్‌రన్ పూర్తవగా, రెండు పంపులను నిరంతరాయంగా నడుపుతున్నారు. మూడు రోజులుగా వెట్‌రన్‌లు పూర్తి చేస్తుకున్న 1వ, 6వ మోటార్ల ద్వారా పంపుహౌస్ నుంచి డెలివరీ సిస్టర్న్‌లో నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ ప్రయత్నం ద్వారా 1.5 టీఎంసీల నీరు అన్నారం బ్యారేజీలో కలిసినట్లు ఇంజనీర్లు పేర్కొంటున్నారు. అలాగే మూడు మోటార్లు నడిస్తే మరింత నీరు అన్నారం బ్యారేజీలో నిల్వ చేయడానికి వీలుగా ఉంటుంది. అక్కడి నుంచి సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్‌మానేరుకు తరలించనున్నారు. మూడో నంబర్ మోటార్‌కు రాత్రి వరకు వెట్‌రన్ నిర్వహించి ఎత్తిపోయనున్నారు. తెలంగాణలో ఆశించినమేర వర్షాలు లేనప్పటికీ మహారాష్ట్రలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో.. గడ్చిరోలి జిల్లా మాలేగావ్ నుంచి భారీగా వరద ప్రాణహిత నదిగుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తోంది. ఆదివారం కాళేశ్వరం, కన్నెపల్లి ప్రాంతాల్లో 96 వేల క్యూసెక్కులు, మేడిగడ్డ బ్యారేజీ వద్ద లక్ష క్యూసెక్కుల వరద కిందికి పోతోంది. సోమవారం తెల్లవారుజాము వరకు ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది. దీంతో 4,600 క్యూసెక్కుల నీరు అన్నారం బ్యారేజీ వైపు పరుగులు తీస్తోంది. ఆదివారం అర్ధరాత్రినుంచి లేక సోమవారం నుంచి మూడు మోటార్లను నడిపేలా అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. మరో వారంలో 6 మోటార్లను నడుపుతూ ఒక టీఎంసీకి పైగా నీటిని.. ప్రతిరోజూ, వరద కొనసాగే అన్ని దినాలు నడిపేలా రంగం సిద్ధం చేస్తున్నారు.
వచ్చిన వరద వచ్చినట్లుగా..
గోదావరిలో జూన్‌లో ఎక్కడా నీటి ప్రవాహాలు లేకున్నా ప్రస్తుతం క్రమంగా అవి పుంజుకుంటున్నాయి. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదిలో ప్రవాహాలు పుంజుకున్నాయి. రెండ్రోజుల కిందట మేడిగడ్డ వద్ద గోదావరి ప్రవాహం 8వేల క్యూసెక్కులుండగా, అది శనివారం 14వేల క్యూసెక్కులకు పెరిగింది. అది మరింత పుంజుకొని ఆదివారం మధ్యాహ్నానికి 26వేల క్యూసెక్కులకు చేరింది. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఉండగా.. ఆదివారం సాయంత్రం వరకు 52 గేట్లను కిందికి దించినట్లు ఇంజినీర్లు తెలిపారు. మిగితా గేట్లను సైతం మరో రెండు రోజుల్లో దించి ఉంచనున్నారు. దీంతో వరద ప్రవాహం నిలిచి నీటి నిల్వ పెరుగుతుంది. ఆ నీటిని కన్నెపల్లి వద్ద మోటార్లతో ఎత్తిపోయనున్నారు. మేడిగడ్డ పంప్‌హౌస్ (కన్నెపల్లి) వద్ద ప్రస్తుతం నీటి మట్టం 96.6 మీటర్లలో ఉంది. మోటార్లు నడిపేంత నీటి మట్టాలు ఉండటంతో ఇక్కడ రెండు మోటార్లను ప్రారంభించారు. మేడిగడ్డ పంపుహౌస్‌లో 40 మెగావాట్ల సామర్థ్యముండే 11 పంపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 9 పంపుల బిగింపు పూర్తయింది. మరో రెండో పురోగతిలో ఉన్నాయి. ఇందులో రెండు మోటార్ల ద్వారా ప్రస్తుతం 4,600 క్యూసెక్కుల నీటిని గ్రావిటీ కాల్వ ద్వారా అన్నారం బ్యారేజీకి వదులుతున్నారు. మరో మోటార్‌ను ఆరంభించే అవకాశం ఉంది. ఈ మూడు పంపులు ఒకేమారు నడిస్తే సుమారు అర టీఎంసీ మేర నీరు అన్నారంలోకి చేరుతుంది.
సీసీటీవీలతో సీఎం సమీక్ష
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో నీటిని ఎత్తిపోస్తున్న దృశ్యాలను క్యాంపు కార్యాలయం నుంచి సీఎం కేసీఆర్ ప్రతిగంటకూ వీక్షిస్తున్నట్లు ఇంజనీర్లు వెల్లడించారు. వరద ఉధృతి, ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి? ఇప్పటి వరకు ఎన్ని టీఎంసీల నీరు గోదావరి గుండా పోయింది? ఎన్ని టీఎంసీలు ఎత్తిపోశారనే వివరాలను తెలుసుకుంటున్నారు. అన్నారం బ్యారేజీ వద్ద గల అండల్ టన్నెల్‌లో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని సీఎం కార్యాలయం నుంచి సూచించినట్లు తెలిసింది.
ఆరు మోటార్ల ద్వారా..
ఇక గోదావరిలో ప్రవాహాలు మరింత పెరిగే అవకాశాల నేపథ్యంలో ఈ వారంలోనే మరో మోటార్‌కు ట్రయల్‌రన్ నిర్వహించి నీటిని ఎత్తిపోసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, మేఘ ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు అక్కడే ఉండి ట్రయల్‌రన్ పనులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఆరు రోజులుగా పంపుహౌస్ వద్దే మకాం వేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోని పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ 6 మోటార్ల ద్వారా 1.2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. నీటి మట్టం 100 మీటర్లకు పైన చేరితే.. జులై చివరి నుంచి అన్ని మోటార్లను నడిపించనున్నారు. పంపుహౌస్‌లో 11 మోటార్లకు గానూ 6 మోటార్లు డెలివరీ సిస్టంలో ఎత్తిపోసే వరకు ఇక్కడే ఉంటానని ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇక గ్రావిటీ కెనాల్ నుంచి నీరంతా అన్నారం బ్యారేజీకి చేరడంతో అక్కడ నీటి మట్టం పెరుగుతోంది. 11 టీఎంసీల సామర్థ్యమున్న అన్నారం బ్యారేజీలో 4.50 టీఎంసీల మేర నిల్వలు చేరితే అన్నారం పంప్‌హౌజ్‌లోని మోటార్లను నడపించే వీలుంది. అన్నారం పంపుహౌస్‌లో 8 మోటార్లకుగాను 7 పంపులు, మోటార్ల బిగింపు పూర్తవగా, మరొకటి పురోగతిలో ఉంది. వచ్చే నెల మొదటి వారం నుంచి ఇక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీకి నీటి ఎత్తిపోతలు ఆరంభమయ్యే వకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అనుకున్నట్లుగా వరద కొనసాగి మోటార్లన్నీ నడిస్తే వచ్చే నెల 15 నాటికి ఎల్లంపల్లి నింపే అవకాశం ఉంది. ఆగస్టు చివరికి ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంటుందని నీటి పారుదల వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment