రక్తశుద్ధికి.. నీటి కొరత!  | Water Problems In Nalgonda General Hospital | Sakshi
Sakshi News home page

రక్తశుద్ధికి.. నీటి కొరత! 

Published Sun, Dec 23 2018 11:26 AM | Last Updated on Sun, Dec 23 2018 11:29 AM

Water Problems In Nalgonda General Hospital - Sakshi

జిల్లాకేంద్రాస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్న రోగులు, డయాలసిస్‌ మిషన్‌

నల్లగొండ టౌన్‌ : కిడ్నీ వ్యాధి్ర గస్తుల కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్తశుద్ధి కేంద్రం (డయాలసిస్‌) ఆశించిన స్థాయిలో సేవలను అందించలేక పోతోంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు గతంలో హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే వారు.  ప్రతి వారం హైదరాబాద్‌కు వెళ్లి డయాలసిస్‌ చేయించుకోవాలంటే నిరుపేదలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది.

వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు నెలల కిందట డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పది మిషన్‌లతో పది మంది  రోగులకు డయాలసిస్‌ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేసింది. దీని నిర్వాహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. కానీ కేంద్రం నిర్వహణ కోసం అవసరమైన విద్యుత్, నీటి సౌకార్యాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి బాధ్యులు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి ఉన్న ఒక్క నీటి మోటార్‌ ఆస్పత్రితోపాటు డయాలసిస్‌ కేంద్రానికి వినియోగిస్తున్నారు. ఒక్క మోటార్‌ నీరు ఆస్పత్రి అవసరాలకు మాత్రమే సరిపోతుండడంతో డయాలసిస్‌ కేంద్రానికి నీటికొరత ఏర్పడింది.

రోజూ 13వేల లీటర్లు నీరు అవసరం
ప్రతి షిఫ్టులో పది మంది చొప్పున రోజూ 40 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్‌ చేయొచ్చు. ఇందుకు రోజూ 13 వేల లీటర్ల నీరు అవసరం ఉంటుంది. అయితే ఒకే ఒక్క మోటార్‌ ఉండడం వల్ల సరిపడా నీరు సరఫరా చేయకపోవడంతో కేవలం మూడు షిçఫ్టులుగా డయాలసిస్‌ చేస్తున్నారు. ఫలితంగా రోజూ పది మంది రోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సకాలంలో డయాలసిస్‌ జరగక పోవడంతో రోగులు మరింతగా ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ డయాలసిస్‌ కేంద్రంలో 92 మంది కిడ్నీ రోగులు తమ పేర్లను నమోదు చేయించుకుని డయాలసిస్‌  చేయించుకుంటున్నారు.

ప్రతి కిడ్నీ రోగి మూడు రోజులకు ఒకసారి డయాలసిస్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. నీటి వసతి సక్రమంగా లేకపోవడం వల్ల కొత్త రోగుల పేర్లను నమోదు చేసుకోవడం లేదు. దీంతో పాటు ఇప్పటికే నమోదు చేసుకున్న బాధితులకు కూడా సరైన డయాలసిస్‌ను సకాలంలో అందించలేక పోతున్నారు. అంతే కాకుండా, కిడ్నీ రోగులకు వాడాల్సిన ఎరిత్రోపొయిటిన్‌ ఇంజక్షన్ల కొరత తీవ్రంగా ఉందని సమాచారం. ఆస్పత్రి వీటిని సరఫరా చేయకపోవడంతో, రోగులే ప్రైవేటు మందుల దుకాణాల్లో కొనుగోలు చేసుకుంటున్నారు.

ఒక్కటే మోటార్‌తో ఇబ్బందులు
జిల్లా కేంద్రంలోని డయాలసిస్‌ కేంద్రంలో పూర్తి స్థాయిలో కిడ్నీ రోగులకు డయాలసిస్‌ సేవలను అందించాలంటే కేంద్రానికి అవసరమైన నీటిని అందించడానికి ప్రత్యేకంగా బోరు, మోటార్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రానికి సరిపడా నీటిని అందించడానికి ఆస్పత్రి అధికారులు ఎందుకు చొరవచూపడం లేదో అర్థంకాని స్థితి. ఇప్పటికైన ఆస్పత్రి బాధ్యులు ప్రత్యేక బోరు, మోటార్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కిడ్నీ రోగులకు డయాలసిస్‌ సేవలు అందకుండా పోయే ముప్పు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మందుల సరఫరా లేదు
కేంద్రంలో డయాలసిస్‌ చేయించుకున్న వారికి అవసరమైన మందుల సరఫరా లేకపోవడంతో రోగులు బయట డబ్బులను వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆస్పత్రులలో డయాలసిస్‌ చేయించుకున్న వారికి అక్కడే ఉచితంగా మందులను అందిస్తారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఉచితంగా మందులను అందజేయాలని కిడ్నీ బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రత్యేక బోరును ఏర్పాటు చేయాలి
డయాలసిస్‌ కేంద్రానికి ప్రత్యేక బోరు మోటార్‌ను ఏర్పాటు చేయాలి. సరైన నీటి వసతి లేకపోవడంతో డయాలసిస్‌కు చాలా ఆలస్యమవుతుంది. ఒక్కోసారి రెండు సార్లు వెళ్లాల్సి వస్తుంది. బోరు, మోటార్‌తో పాటుకేంద్రం క్లీనింగ్‌కు ఆయాలను ఏర్పాటు చేయాలి. మందులకు కూడా ఇబ్బందులు పడుతున్నాం. – వెంకటరమణ, పేషంట్‌
నీరు సరిపోవడం లేదు

జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు డయాలసిస్‌ కేంద్రానికి ఒకే ఒక్క బోరు మోటా ర్‌ ఉన్నందున నీరు సరిపోవడం లేదు. త్వరలో కొత్తగా బోరు వేయించేందుకు కృషి చేస్తాం. డయాలసిస్‌ రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – డాక్టర్‌ టి.నర్సింగరావు,ఆస్పత్రి సూపరింటెండెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement