చివరి భూములకు నీరందించాలి
నాగార్జునసాగర్ : ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) ద్వారా చివరి ఎకరానికి కూడా నీరందేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, సాగర్ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు తమనుంచి పూర్తిసహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సోమవారం ఏఎమ్మా ర్పీ అధికారులతో కలిసి కాల్వలను పరిశీలించారు. అనంతరం నాగార్జునసాగర్ విజయవిహార్ అతిథిగృహంలోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా డిస్ట్రిబ్యూటరీల ద్వారా చివరి వరకు నీరు వెళ్లపోవడానికి కారణాలేమిటీ?.. అసంపూర్తి కాల్వల నిర్మాణానికి భూ సేకరణ సమస్య ఏమైనా ఉందా..? రైతులు వారి భూములనుంచి కాల్వలు తవ్వనివ్వడం లేదా?.. కాంట్రాక్టర్ పనులు చేయడం లేదా అంటూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
కాల్వల్లో నీరు పారడానికి ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి వెంటనే సరిచేయాలన్నారు. 98వ ప్యాకేజీలో పనులు పూర్తికాకుండానే కాంట్రాక్టర్ చివరి బిల్లు పెట్టాడని, దీనికిందనే డిస్ట్రిబ్యూటరీలు 8,9,10,26 ఉన్నాయని ఇంజినీర్లు తెలిపారు. వెంటనే ఆ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జానారెడ్డి అధికారులను ఆదేశించారు. మరోసారి ఉన్నతస్థాయి ఇంజినీర్లతోపాటు కిందిస్థాయి సిబ్బంది ఆయా కాల్వల వెంట తిరిగి చివరి భూములకు నీరు అందకపోవడానికి గల కారణాలను తెలుసుకోవాలని సూచించారు.
భూములనుంచి రైతులు కాల్వలు తవ్వనివ్వకుంటే నచ్చజెప్పడం..వినకుంటే పోలీస్ ఫోర్స్‌ను వినియోగించైనా పనులు జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, జెడ్పీ వైస్‌చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రిక్కల ఇంద్రసేనారెడ్డి, ఏఎమ్మార్పీ సర్కిల్-1 ఎస్‌ఈ, నాగార్జునసాగర్ ఇన్‌చార్జ్ చీఫ్ ఇంజినీర్ పురుషోత్తమరాజు, ఈఈ శంకర్‌రావు, డీఈ కిషోర్, మనోహర్ పాల్గొన్నారు.