పైరుకు ప్రాణం | water supplied for crops | Sakshi
Sakshi News home page

పైరుకు ప్రాణం

Published Wed, Jul 30 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

పైరుకు ప్రాణం

పైరుకు ప్రాణం

గద్వాల/ధరూరు: జూరాల ఆయకట్టులోని పంటలు ఇక కళకళలాడనున్నాయి. ఎగువప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో మంగళవారం కుడి, ఎడమ ప్రధానకాల్వల ద్వారా ఖరీఫ్ పంటలకు నీటిని వదిలారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులను దాటి కృష్ణానది పరవళ్లు రాష్ర్టంలోకి అడుగుపెట్టాయి. బుధవారం సాయంత్రం జూరాల రిజర్వాయర్‌కు భారీ స్థాయిలో ఇన్‌ఫ్లో చేరనుంది. కాగా, ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరడంతో 15 క్రస్టుగేట్లను ఒక మీటరు ఎత్తి దిగువనదిలోకి 72,298 క్యూసెక్కుల ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు.
 
 దీంతో దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుక ఇన్‌ఫ్లో 68,252 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దీంతో నారాయణపూర్ ప్రాజెక్టులో నీటినిల్వ గరిష్టస్థాయికి చేరడంతో 25 క్రస్టుగేట్లను ఎత్తి దిగువనదిలోకి 36,478 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ నుంచి విడుదలైన భారీ వరద ప్రవాహం బుధవారం జూరాల ప్రాజెక్టుకు చేరనుంది. జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ఉన్న 234 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ఆరు టర్బయిన్ల ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు జెన్‌కో అధికారులు  ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ జరిగితే కృష్ణమ్మ పరవళ్లు గురువారం నుంచి శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్‌కు చేరడం ప్రారంభం కానుందని అధికారులు చెప్పారు.
 
 సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం:
 జెడ్పీచైర్మన్ భాస్కర్  
 రాష్ట్రప్రభుత్వం రైతుల ప్రయోజనాలు, సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిస్తుందని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన జూరాల ప్రధానకాల్వల ద్వారా ఖరీఫ్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తూ కొత్తగా నిర్మితమైన ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
 
 కృష్ణా, తుంగభద్ర, భీమా ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించే పనులను పూర్తిచేయడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు. కొత్త ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేసి లక్షలాది ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటిని అందించడంతో పా టు జిల్లాలో భూగర్భజలాల అభివృద్ధి, తాగునీ టి సమస్యను తీర్చేందుకు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుభాన్, శాంతి, జెడ్పీటీసీ సభ్యుడు పద్మా వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షులు సీసల వెంకట్‌రెడ్డి,   బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
 
 ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలి
 ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించే సమయం లో ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలన్న ప్రొటోకాల్ తెలియదా? అని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ జూరాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూరాల ప్రధానకాల్వకు నీటి విడుదలను ఎమ్మెల్యే అరుణ ప్రారంభించారు. ఆమెతో పాటు అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్  ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కాదని, ప్రజలకు సేవలందించడం ద్వారానే గుర్తింపు వస్తుందన్న వాస్తవాన్ని గమనించాలన్నారు. రైతులకు సేవలందించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల సాధనలో తాము ముందున్నామన్నారు.  
 
 పోటాపోటీగా..!
 జూరాల ప్రాజెక్టు జాతికి అంకితమైన 18ఏళ్ల తరువాత మొదటిసారి ప్రధానకాల్వ ద్వారా ఆయకట్టుకు నీటి విడుదలను ఒకేరోజు వేర్వేరు సమయాల్లో ఇద్దరునేతలు ప్రారంభించారు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మంగళవారం మధ్యాహ్నం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రారంభోత్సవానికి వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులకు సమాచారమిచ్చారు. మధ్యాహ్నం 3గంటలకు జెడ్పీచైర్మన్ జూరాల ప్రాజెక్టుకు చేరుకొని కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేసే గేట్లకు పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో పాటు అక్కడికి సాయంత్రం 4గ ంటలకు చేరుకున్నారు. కనీసం ప్రోటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వకుండానే ప్రారంభించడంపై అక్కడున్న అధికారులపై ఎమ్మెల్యే అరుణ మండిపడ్డారు. ప్రారంభించిన కాల్వగేట్లకు మరోసారి పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. స్థానికులు ఇదేమిటని చర్చించుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement