జెడ్పీపై గులాబీ జెండాఎగరేస్తాం
సిద్దిపేటటౌన్, న్యూస్‌లైన్: జెడ్పీపై గులాబీ జెండాను ఎగరేస్తామని టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు చేరడంతో టీఆర్‌ఎస్ బలం 24కు పెరిగిందన్నారు.మరి కొందరు జెడ్పీటీసీ సభ్యులు త్వరలో పార్టీలో చేరుతారన్నారు. మెదక్, గజ్వేల్ మున్సిపాలిటీలను సైతం కైవసం చేసుకుంటామని చెప్పారు. మరో రెండు ఎంపీపీలపై గులాబీ జెండా ఎగురువేస్తామన్నారు.
జిల్లాలోని మెజార్టీ ఎంపీపీలను కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఎనిమిది అసెంబ్లీలను గెలుచుకున్నామని, జహీరాబాద్‌లో స్వల్ప మెజార్టీతో సీటు కొల్పోయామని చెప్పారు. నారాయణఖేడ్‌లో అన్నదమ్ముల పోటీ వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లను కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, టీఆర్‌ఎస్ నాయకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.