భద్రాచలం, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఏడు ముంపు మండలాలను అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దీర్ఘకాలిక ఉద్యమం చేపట్టేందుకు ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక సన్నద్ధమైంది. భద్రాచలంలో బుధవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఉద్యమ కార్యాచరణను పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ నాయకులు గుండు శరత్‌బాబు, వట్టం నారాయణ, ముర్ల రమేష్ ప్రకటించారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణలోనే కొనసాగించాలని కోరుతూ ఈనెల 7న సరిహద్ధులను దిగ్బంధించనున్నట్లు పేర్కొన్నారు. 8న నల్లజెండాలతో నిరసన తెలపాలన్నారు.
భద్రాచలంలో భవిష్యత్ ఉద్యమాల వేదికగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక ఉద్యమానికి ఈ ప్రాంత ప్రజానీకాన్ని సన్నద్ధం చేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ముంపు మండలాలను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించేలా ఆర్డినెన్స్‌ను వెనుక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ఉద్యోగులు ఏ రీతిన ఉద్యమించారో, ఇప్పుడు రెట్టింపు స్థాయిలో ఆందోళనలు చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువుదీరే రోజైన జూన్ 8న ఉద్యోగులు, ఆదివాసీ సంఘాల నాయకులు నల్లజెండాలతో నిరసన తెలిపాలని కోరారు. ముంపు మండలాల్లో భవిష్యత్ కార్యాచరణ కోసం అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు ఎం.బి.నర్సారెడ్డి, కుంచాల రాజారామ్, కృష్ణమూర్తి, కృష్ణ, పడిసిరి శ్రీనివాస్, ఖాసిం, సొందె వీరయ్య, నాగేశ్వరరావు, మడవి నెహ్రూ, దాగం ఆదినారాయణ, అట్టం లక్ష్మణ్‌రావు, గొంది వెంకటేశ్వర్లు, సీతారాములు, జగదీష్, దాసరి శే ఖర్ తదితరులు పాల్గొన్నారు.
‘ముంపు’ ఉద్యమం మరింత ఉధృతం
Published Thu, Jun 5 2014 2:25 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement