సాక్షి, హైదరాబాద్ : దేశ అణు విద్యుత్తు ఇంధన అవసరాలను తీర్చే దిశగా న్యూక్లియర్ ఫ్యుయెల్ కాంప్లెక్స్ (ఎన్‌ఎఫ్‌సీ) విస్తరణ కార్యకలాపాలు చేపట్టిందని సంస్థ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ దినేశ్ శ్రీవాత్సవ తెలిపారు. ఇంధన బండిల్ తయారై ఏడాది పూర్తయిన సందర్భంగా ఎన్‌ఎఫ్‌సీలో శుక్రవారం నిర్వహించిన వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2030 నాటికల్లా దేశంలోని అన్ని అణువిద్యుత్తు రియాక్టర్లకు యేటా మూడు వేల టన్నుల ఇంధనం అవసరమవుతుందన్నారు. హైదరాబాద్ కేంద్రంలో గత ఏడాది రికార్డు స్థాయిలో 1,200 టన్నులకు పైగా ఇంధన బండిళ్లను తయారు చేశామని.. రాజస్తాన్‌లోని కోటాలో ఏర్పాటవుతున్న కొత్త కేంద్రం ద్వారా వెయ్యి నుంచి రెండు వేల టన్నుల ఇంధనం ఉత్పత్తి కావచ్చునని వివరించారు. ఎన్‌ఎఫ్‌సీ 2017–18 నుండి పూర్తి స్వదేశీ సాంకేతికతతో ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి ఇంధన కడ్డీలను తయారు చేస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment