- ఆ దిశగానే ప్రభుత్వం కృషి చేస్తోంది
- వీలైనంత త్వరగా, ఒకేసారి రుణమాఫీ
- పాత విధానంలోనే ఆత్మహత్యల నిర్ధారణ
- త్వరలో కరువు మండలాల ప్రకటన
- నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కృషి
సాక్షి, హైదరాబాద్: రైతుల సంక్షేమమే లక్ష్యం గా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, కరువు, రుణమాఫీ, కొత్త రుణాలకు వడ్డీ మాఫీ తదితరాలన్నింట్లోనూ మేలు చేసేలానే నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రైతు ఆత్మహత్యలు, రుణమాఫీకి సంబంధించి అసెంబ్లీలో రెండు రోజులు జరిగిన చర్చకు మంత్రి బుధవారం రాత్రి సమాధానమిచ్చారు. వ్యవసాయం సంక్షోభంలో పడి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. 2014 జూన్ 2 తరువాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుం బాలన్నింటికీ ప్రభుత్వం రూ.6 లక్షల పరి హారం అందిస్తుందన్నారు. రైతు ఆత్మహత్యల నిర్ధారణకు గత ప్రభుత్వాలు అమలు చేసిన విధానాన్నే అనుసరిస్తామన్నారు.
‘‘వర్షాధార ప్రాంతాలు, బోర్లు ఎండిన చోటే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయి. గోదావరి, కృష్ణా జలాల్లో మన వాటా పూర్తిస్థాయిలో వచ్చినప్పుడే ఆత్మహత్యలను శాశ్వతంగా నివారించవచ్చు’’ అని చెప్పారు. రుణమాఫీ రెండో విడత సొమ్మును వీలైనంత త్వరగా ఒకేసారి చెల్లించేందుకు సర్కారు కృషి చేస్తుందన్నారు. ‘‘రుణమాఫీలో ఇప్పటికే 50% రుణాలు చెల్లించాం. మిగతా 50 శాతాన్ని ప్రభుత్వమే బ్యాంకులకు కడుతుంది. ఆ రుణంతో రైతులకు ఏ సంబంధమూ ఉండదు. ఈ మేరకు రుణవిముక్తి పత్రాలను కూడా జారీ చేశాం. ఖరీఫ్‌లో రైతులకు అప్పులిచ్చేలా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశాం. రూ.లక్ష మేర అప్పు తీసుకొని 12 నెలల్లో చెల్లించినట్లయితే వడ్డీ చెల్లించక్కర్లేదు.ఆపైన తీసుకొన్న వారు పావలా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం. ఏ బ్యాంకైనా రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తే దాన్ని తిరిగి వారి ఖాతాల్లోకి జమ చేయాల్సిందిగా చెప్పాం’’ అని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు గొడవకు దిగడంతో రుణమాఫీ, కొత్త రుణాలకు సంబంధించి పోచారం వివరణ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.642 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలో కరువు మండలాలను ప్రకటిస్తామన్నారు. ‘‘నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతులకు చెల్లించాల్సిన రూ. 26 కోట్ల బకాయిలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. విత్తన పంటలకు సంబంధించి ఈనెల 5న సీడ్ ఫ్యాక్టరీలతో భేటీ కానున్నాం. గోడౌన్లను నిర్మించనున్నాం. పాడి పరిశ్రమాభివృద్ధికి, డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రత్యేక రాయితీలిస్తున్నాం. పాలీహౌస్‌ను సొంతంగా నిర్మించుకునే రైతులకు ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ సొమ్ము చెల్లిస్తుంది. ఇందుకు సీఎం అంగీకరించారు. వచ్చే మార్చి నుంచి పగటి పూటే వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించినందున సోలార్ విద్యుత్ ఆలోచనను విరమించుకున్నాం’’ అని ప్రకటించారు.
రైతుల సంక్షేమమే లక్ష్యం: పోచారం
Published Thu, Oct 1 2015 3:51 AM | Last Updated on Mon, Sep 17 2018 8:21 PM
Advertisement
Advertisement