దళితులకు దన్ను
సాక్షి, హైదరాబాద్: నిరుపేద దళితుల కోసం భూ పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15 నుంచి లాంఛనంగా ప్రారంభించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. భూమి లేని దళితులకు ప్రాధాన్యమిస్తూ ప్రతీ మండలంలోని ఒక్కో గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ ప్రత్యేకంగా దళితుల సంక్షేమంపై దృష్టి సారించారు. జిల్లాల్లో దళితుల స్థితిగతులపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రాష్ర్టంలో దళితుల అభివృద్ధిని ఓ సవాల్‌గా తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దళిత వాడల నుంచి దారిద్య్రాన్ని పారదోలేందుకు యుద్ధం చేయాల్సిన అవసరముందని, దీనికి కలెక్టర్లే సారథులుగా వ్యహరించాలని పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు భూ పంపిణీ కార్యక్రమంపై కేసీఆర్ స్పష్టతనిచ్చారు. భూమి లేని దళితులకు మూడెకరాలు, ఒకటో రెండో ఎకరాలున్న వారికి మిగిలిన భూమిని ఇస్తామని పేర్కొన్నారు. వాటిని కూడా మహిళల పేరు మీదే ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆగస్టు 15న రాష్ర్టవ్యాప్తంగా ప్రారంభించే ఈ కార్యక్రమంలో మంత్రులు ఎక్కడికక్కడ జిల్లాల్లో విధిగా పాల్గొనాలని కూడా సూచించారు. తాను కరీంనగర్ జిల్లాలో పాల్గొంటానని చెప్పారు. దళితుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు గత ప్రభుత్వాలు చెప్పుకొన్నా.. వారి పరిస్థితి ఏమాత్రం మెరుగుపడ లేదని ఆయన వ్యాఖ్యానించారు. దళితుల అభివృద్ధి పేరిట పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ.. వారి బతుకుల్లో మార్పు రాలేదన్నారు. అలాంటప్పుడు ఆ నిధులన్నీ ఏమయ్యాయని అధికారులను ఆయన ప్రశ్నించారు.
జీవన స్థితిగతుల్లో మార్పు రావాలి
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న దళితుల జీవన స్థితిగతుల్లో వచ్చే ఐదేళ్లలో పూర్తి మార్పు తీసుకురావాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. బడ్జెట్‌లో 15.4 శాతం నిధులను పూర్తిగా దళితుల అభివృద్ధి కోసమే ఖర్చు చే యాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖను ఇకపై దళితుల అభివృద్ధి శాఖ(ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్)గా మార్పు చేయాలని కూడా ఆయన పేర్కొన్నారు. గతంలో ఎస్సీ జనాభా లెక్కల ప్రకా రం నిధులు కేటాయించినా.. అవి ఖర్చు కాలేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేక నిధులు వస్తాయని, ప్రతీ జిల్లాకు ఏడాదికి సగటున రూ. 600 కోట్లు అందుతాయని కేసీఆర్ వివరించారు. వచ్చే ఐదేళ్లలో ప్రతీ జిల్లాకు రూ. 4 వేల కోట్ల నిధులను దళితుల కోసం వ్యయం చేస్తామన్నారు. దళితుల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, పథకాల విషయంలో కలెక్టర్లు చొరవ చూపించాలన్నారు. ప్రభుత్వం నుంచి సాధారణ మార్గదర్శకాలు మాత్రమే ఇస్తామని, కలెక్టర్లు స్థానిక పరిస్థితులను బట్టి వేర్వేరుగా కార్యక్రమాలు రూపొం దించి అమలు చేయాలని సూచించారు. దళితుల అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని సీఎం నిర్దేశించారు.
ప్రతీ మండలంలో ఎస్సీల కోసం ప్రత్యే క అధికారిని నియమించాలని, దళిత వాడల్లో కలెక్టర్లు స్వయంగా పర్యటించాలని, విద్యావంతులైన దళితులతో బస్తీ కమిటీలు ఏర్పాటు చేసి కార్యక్రమా ల అమలులో వారిని భాగస్వాములను చేయాలని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, దళిత మేధావుల సమన్వయంతో కార్యక్రమాలు అమలు చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దళితుల స్థితిగతులపై వాస్తవిక నివేదికను రూపొందించాలని కూడా ఆదేశించారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు రామలక్ష్మణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రాధ, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్‌తోపాటు పది జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక ఆహ్వానితులుగా మల్లేపల్లి లక్ష్మయ్య, ఘంటా చక్రపాణి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైతు రుణాల మాఫీ, ఎన్నికల సమయలో టీఆర్‌ఎస్ ఇచ్చిన ఇతర హామీల అమలు, అందుకయ్యే వ్యయం, అమలులో తలెత్తే ఇబ్బందులు తదితర అంశాలపై కూడా కలెక్టర్లతో కేసీఆర్ సుధీర్ఘంగా సమీక్షించారు.