
ఈ హెడ్‌మాస్టర్ మాకొద్దు...
చండూరు: అదనంగా ఉపాధ్యాయులను నియమించేందుకు తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడమేకాకుండా, విద్యార్థులను చేర్చుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు తమకు వద్దంటూ నల్లగొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తిలోని మంచికంటి గోపమ్మ మెమోరియల్ ట్రస్ట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు శనివారం రోడ్డెక్కారు. పాఠశాల గేట్‌కు తాళం వేసి రెండుగంటలకు పైగా రోడ్డుపైనే బైఠాయించారు. హెచ్‌ఎంను తొలగించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ అదనంగా ఉపాధ్యాయులను నియమించాలని చెప్పి ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.50 వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
తమ పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు వస్తే ఎంట్రెన్స్ టెస్ట్ పేరుతో 15 రోజులుగా తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హెచ్‌ఎం తన కూతురుకు ఎలాంటి టెస్ట్ పెట్టకుండానే ఇదే స్కూల్‌లో పదోతరగతిలో చేర్పించారన్నారు. ట్రిపుల్‌ఐటీలో సీటుకోసమే తన కూతురును చేర్పించారని ఆరోపించారు. ఒక వేళ నిజాయితీగానే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అనుకుంటే తను నివాసముండే నల్లగొండ జిల్లా కేంద్రంలోనే చేర్పించ వచ్చుగా అని వారన్నారు. హెచ్‌ఎంను తొలగించే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కక్ష సాధించడానికే:
హెచ్‌ఎం వివరణ ప్రభుత్వ పాఠశాలలో తన కూతురును చేర్పించి ఆదర్శంగా నిలిచానని హెచ్‌ఎం రాములు తెలిపారు. కావాలనే కొంత మంది తనపై కక్ష సాధిస్తున్నారన్నారు. అదనంగా ఉపాధ్యాయులను నియమించడం కోసం విద్యార్థులనుంచి కొంత నగదు వసూలు చేసిన మాట వాస్తవమేనని అన్నారు.