
'కేసీఆర్ బేరాలాడిన రికార్డులున్నాయి'
వరంగల్(పాలకుర్తి) : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ఫోన్ చేసి రూ. 20 కోట్ల వరకు ఆఫర్ చేసిన రికార్డులు తమ దగ్గరున్నాయని టీడీపీ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మాట్లాడిన రికార్డులను నేరుగా కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామన్నారు. టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనకు కేసీఆర్ డబ్బులిస్తే వెళ్లానని.. నేరుగా చెప్పారన్నారు.
రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మాట్లాడినట్లుగా ఆధారాలున్నాయని చెప్పడం వెనుకున్న కుట్ర ప్రజలకు అర్థమౌతోందన్నారు. 63 మంది ఎమ్మెల్యేలున్న టీఆర్‌ఎస్ పార్టీ 5గురు ఎమ్మెల్సీలను ఎలా గెలువగలిగిందన్నారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి ఓట్లేయించకున్నారన్నారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్తున్నామని చెప్పారు.