ఇది పరీక్షా కాలం.. మనల్ని మనం రక్షించుకోవాలి
దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేది బీజేపీయే
బీజేపీ శ్రేణులకు తరుణ్ విజయ్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: దేశానికి ఇప్పుడున్నది అసలు సిసలైన పరీక్షాకాలమని, మనల్ని మనం రక్షించుకోవాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ తరుణ్ విజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, ఎన్.రామచంద్రరావు, ప్రేమేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డితో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. తర్వాత నగరంలోని ఓ హోటల్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆధ్వర్యంలో (‘వై బీజేపీ’ పేరిట) జరిగిన మేథావుల సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. బీజేపీ ఒక వ్యక్తి కాదని, ఒక శక్తి అని, మోడీయే ప్రధాని కావాలని ఆకాక్షించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన యువత, బీజేపీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ పరిస్థితి దిగజారనుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు తేదీ అయిన మే 16.. బహుశా కాంగ్రెస్ పాలిట కాళరాత్రి అవుతుందన్నారు. ఆ పార్టీ ఎన్నికల్లో అత్యంత దారుణంగా రెండంకెలకే పరిమితం కాబోతోందని చెప్పారు. నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ అనూహ్య విజయాలు సాధించనుందని, దానికి ఆంధ్రప్రదేశ్ కూడా మినహాయింపు కాదని చెప్పారు. మోడీ ప్రధాని కావాలని పార్టీ కోరుకోలేదని, యువత కోరుకుందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
నితిన్ గడ్కరీ పర్యటన రద్దు: బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ రాష్ట్ర పర్యటన అనివార్య కారణాల వల్ల రద్దయింది. తెలంగాణ అభివృద్ధి- అవకాశాలపై బీజేపీ లీగల్ సెల్ శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన సదస్సుతో పాటు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది.