
దానంను అరెస్ట్ చేస్తాం
- దాడి ఘటనలో హైకోర్టుకు గోపాలపురం ఏసీపీ నివేదిక
- పిటిషనర్ సహా ఇద్దరిపై దాడి వాస్తవమే
- ఫోరెన్సిక్ నివేదిక ఆలస్యం వల్లే దర్యాప్తు జాప్యం
- పక్షం రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని హామీ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్, ఎన్‌ఎస్‌యూఐకి చెందిన వీర్‌వల్లభ్ 2011లో ఎం.శ్రవణ్‌కుమార్ సహా ఇద్దరిపై దాడి చేశారనే ఆరోపణల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైదరాబాద్‌లోని గోపాలపురం డివిజన్ ఏసీపీ హైకోర్టుకు నివేదించారు. ఈ కేసులో దానం సహా ఇతర నిందితులను త్వరలోనే అరెస్టు చేయాలని చూస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక ఆలస్యం కావడంవల్లే దర్యాప్తు సకాలంలో పూర్తి కాలేదని విన్నవించారు. 15 రోజుల్లో సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తామని హామీ ఇచ్చారు. దానం నాగేందర్‌పై తుకారాం గేట్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో ఇప్పటివరకు పురోగతి లేదని, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తు చేయట్లేదని పేర్కొంటూ న్యాయవాది ఎ.తిరుపతివర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాన్ని ఇటీవల విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు... పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు గోపాలపురం ఏసీపీ, బంజారాహిల్స్ ఎస్సై వేర్వేరుగా నివేదికలను కోర్టు ముందుంచారు. 2011 అక్టోబర్ 16న తాము ఈస్ట్ మారేడ్‌పల్లికి వెళ్తుండగా అక్కడ ఆసుపత్రి ప్రారంభానికి వచ్చిన దానం నాగేందర్‌పై కొందరు కోడిగుడ్లు విసిరారని... అయితే అది తామే చేశామని నాగేందర్, వీర్‌వల్లభ్, మరికొందరు తమను కొట్టి గాయపరిచారంటూ శ్రవణ్‌కుమార్, నర్సింహయాదవ్ ఫిర్యాదు చేశారని గోపాలపురం ఏసీపీ నివేదించారు.
దానం నాగేందర్ పోలీసు నుంచి లాఠీ తీసుకుని కొట్టారా? లేదా? అనేది నిర్ధారణకు వీడియో ఫుటేజీని రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. అయితే అక్కడ తగిన సాంకేతిక పరిజ్ఞానం లేదని చెప్పడంతో గుజరాత్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామన్నారు. ఆ ల్యాబ్ రుసుం చెల్లింపునకు నిధులు విడుదల జాప్యమవడంతో ఆ ప్రభావం కేసు దర్యాప్తుపై పడిందని వివరించారు.
2013లో ఫోరెన్సిక్ నివేదిక వచ్చిందని, మీడియా ఫుటేజీలో ఎటువంటి మార్పులూ చేయలేదని తేలిందని నివేదించారు. దీంతో పాటు సాక్షులను విచారించడంతో పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. దాడి చేశారనడానికి ప్రాథమిక ఆధారాలు లభించాయని... దానం, ఇతర నిందితులను అరెస్టు చేయాలని చూస్తున్నామని ఏసీపీ వివరించారు. కాగా, తమ పోలీస్‌స్టేషన్ పరిధిలో దానం నాగేందర్‌పై మూడు కేసులు ఉన్నాయని బంజారాహిల్స్ ఎస్సై తన నివేదికలో పేర్కొన్నారు.
2012లో నమోదైన కేసులో ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, అది రాగానే తగిన చర్యలు తీసుకుంటామని కోర్టుకు నివేదించారు. 2013లో దాఖలైన మొదటి కేసులో చార్జిషీట్ దాఖలు చేశామని, రెండో కేసులో వైద్య నివేదిక రాగానే సంబంధిత కోర్టులో చార్జిషీట్ వేస్తామని విన్నవించారు. వారం రోజుల్లో ఈ రెండు కేసుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని, ఆ మేర గడువు ఇవ్వాలని కోర్టును కోరారు.