హాస్టల్ విద్యార్థుల కష్టాలు తీరుస్తాం
‘సంక్షేమం’పై చర్చలో మంత్రి ఈటెల సమాధానం
ఉడికీఉడకని అన్నం, నీళ్ల చారుకు ఫుల్‌స్టాప్ పెడతాం
సాక్షి, హైదరాబాద్: ‘‘హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు కష్టాలు ఏమిటో నాకు తెలుసు. నేను సైదాబాద్‌లోని తాడిచెట్ల హాస్టల్ ఉండి చదుకున్న వాన్నే. అవన్నీ అనుభవించిన వాన్నే. సదుపాయాల కోసం ప్లేట్స్, గ్లాసులతో ఆందోళనలు చేశా. అందుకే హాస్టళ్లలో దొడ్డు బియ్యంతో వండే ఉడికి ఉడకని అన్నం, నీళ్ల చారుకు పుల్‌స్టాప్ పెడతాం. హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో (బీపీటీ) భోజనం అందిస్తాం. ఇందుకు ఎన్ని వేల కోట్లు అయినా వెచ్చిస్తాం’’ అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో మంగళవారం సంక్షేమ శాఖల పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
విద్యార్థులు నిర్వహించుకునే కాలేజీ హాస్టళ ్లలో కూడా స్టూడెంట్లకు భోజన సదుపాయం అందించే ప్రయత్నం చేస్తామన్నారు. కార్పొరేషన్ల విభజన పూర్తయ్యాక.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా కమిషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. చర్చలో భాగంగా ప్రతిపక్ష నాయకుడు కె.జానారెడ్డి మాట్లాడుతూ... గతంలో 33 లక్షల ఎకరాల భూమిని బలహీనవర్గాలకు పంపిణీ చేశారని, వాటి వివరాలను తెప్పించి, వాటిలో ఎన్ని అన్యాక్రాంతమయ్యాయి, ఎవరి పేరు మీద ఉన్నాయో చెప్పాలన్నారు. దానిపై అధికార పక్షం నుంచి స్పందన లేకపోవడంతో కాసేపటికి.. జానారెడ్డి కొంత సమాచారాన్ని తీసుకొచ్చి, దాన్ని ప్రభుత్వానికి అందజేయాలంటూ స్పీకర్‌కు పంపించారు.
సంక్షేమ కార్యక్రమాల అమలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, బడ్జెట్ కేటాయింపులు, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై కాంగ్రెస్ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, టీడీపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఆర్.కృష్ణయ్య, కాంగ్రెస్ సభ్యుడు ఆర్‌ఎస్ సంపత్‌కుమార్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు మాట్లాడారు. అనంతరం విధానపరమైన నిర్ణయాల గురించి తనకు తానుగా నిర్ణయం తీసుకోలేనని, సీఎం సభలో ఉండి ఉంటే వెంటనే స్పందించే వారని పేర్కొంటూ ఈటెల సమాధానాన్ని కొనసాగించారు.
కేసీఆర్ చేతిలోనే రాష్ట్రాభివృద్ధి
ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో చదివేందుకు ఇంతవరకు ఉన్న రూ.10 లక్షల రుణపరిమితిని పెంచే విషయాన్ని సీఎం సమీక్షించనున్నట్లు మంత్రి ఈటెల చెప్పారు. దళిత పారిశ్రామికవేత్తలు ఎదిగేలా ప్రణాళికలను సీఎం ఆవిష్కరించబోతున్నారన్నారు. శాస్త్రీయ దృ క్పథంతో హాస్టళ్లల్లో అన్ని వసతులు కల్పిస్తామని, ఎస్సీ పిల్లల నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘గిరిజనులకు మూడెకరాల భూమి ఇవ్వాలనే డిమాండ్‌పై ప్రభుత్వం ఆలోచిస్తోంది. 1/70 చట్టాన్ని తూచ తప్పకుండా అమలుచేస్తాం. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న వారిని డిస్టర్బ్ చేయం. గిరిజన సంక్షేమ స్కూళ్లలో టీచర్ల నియామకంపై ఆలోచనలు చేస్తున్నాం’’ అని మంత్రి చెప్పారు. ‘‘గృహ నిర్మాణం కోసం రూ.884.34 కోట్లు కేటాయించాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలపై సీఐడీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం. ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ... బడ్జెట్ రాజావారి గానకచేరి మాదిరిగా ఉందంటూ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. ఎవరైనా విమర్శలు చేస్తే గుండెకు గుచ్చుకుంటాయని అంటుంటారు. కానీ మా సీఎంకు అవి మెదడుకు గుచ్చుకుంటాయి. విమర్శలు, పత్రికల్లో పిచ్చి రాతలు, టీవీల్లో విమర్శలు చేసినా కేసీఆర్ చేతిలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం మాతోపాటు ప్రజల్లో ఉంది’’ అని ఈటెల అన్నారు.
టీడీపీ, బీజేపీ వాకౌట్
సంక్షేమ పథకాలపై జరిగిన చర్చకు ఈటెల ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ టీడీపీ, బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంలో సవరణలు చేసి ఒక గొడుగు కిందకు తీసుకురావాలని కోరినా.. అది తన పరిధిలో లేదని మంత్రి చెప్పడం శోచనీయమని బీజేపీసభ్యుడు కె.లక్ష్మణ్ విమర్శిం చారు. బీసీ సబ్‌ప్లాన్‌పైనా స్పష్టత లేదన్నా రు. టీడీపీ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు సబ్‌ప్లాన్, అంగన్‌వాడీలకు జీతాల పెంపుపై స్పష్టత ఇవ్వనందున తాము వాకౌట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ సభ్యులు వాకౌట్ చేసి బయటకు పోతున్న సందర్భంలో అధికార సభ్యులు లేచి ‘షేమ్ షేమ్’ అని నినదించారు. అనంతరం పారి శ్రామిక ప్రాజెక్టు, స్వీయ ధ్రువీకరణ చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు.