‘పాలమూరు’ను పూర్తి చేస్తాం
- ఎలా పూర్తి చేసుకోవాలోమాకు తెలుసు
- చంద్రబాబు తీరుపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ఈ పథకం ఎలా పూర్తి చేసుకోవాలో మాకు తెలుసు. చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులను ఆపే హక్కు ఎవరికీ లేదు’ అని మంత్రి టి. హరీశ్‌రావు స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో గురువారం చెరువులు, కుంటల పునరుద్దరణ పథకం ‘మిషన్ కాకతీయ’పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
కళకళలాడే చెరువులు, రోడ్ల అభివృద్ధి, వాటర్ గ్రిడ్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చెరువులు, కుంటలను పునరుద్ధరిస్తే రాష్ట్రంలో 265 టీఎంసీల నీటితో 26 లక్షల ఎకరాలకు సాగు నీరందించవచ్చని తెలిపారు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, రామ్మోహన్‌రెడ్డి, అంజయ్య, గువ్వల బాలరాజు, సంపత్ కుమార్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ ప్రియదర్శిని పాల్గొన్నారు.
కాగా రాష్ట్రంలో గిడ్డంగుల సమస్యలను తీర్చేందుకు రూ.వెయ్యి కోట్లతో వీటి నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గిడ్డంగులను నిర్మిస్తామని చెప్పారు.