- పార్లమెంటరీ సెక్రటరీ సీఎంఓ జలగం వెంకటరావు
- కిన్నెరసానిని సందర్శించిన తెలంగాణ టూరిజం బృందం
పాల్వంచ రూరల్: తెలంగాణ రాష్ట్రంలో టూరిజం హాబ్‌గా ఖమ్మం జిల్లాను అభివృద్ది చేయనున్నట్లు పార్లమెంటరీ సెక్రటరీ సీఎంఓ, కొత్తగూడెం శాసన సభ్యుడు జలగం వెంకటరావు చెప్పారు. పాల్వంచ మండల పరిధిలోని యానంబైల్ గ్రామపంచాయతీ పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిని బుధవారం తెలంగాణ టూరిజం బృందం సందర్శించింది. ఈ సందర్భంగా జలదృశ్యం విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో ఉన్న ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకుని టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకులు జిల్లాలో మూడురోజులపాటు గడిపే విధంగా ఖమ్మం జిల్లాలో భద్రాచలం, కిన్నెరసాని ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ కింద నియోజకవర్గానికి రూ.7 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇందులో కిన్నెరసానిని రూ.3.23 కోట్ల వ్యయంతో ఏకో టూరిజం అభివృద్ధి కింద అద్దాలమేడ, కాటేజీల పునరుద్ధరణ, బోట్ షికారు, పర్యాటకులు చేపలను పట్టుకునే విధంగా ఏర్పాట్లు, బస్సు సౌకర్యం, కొత్తగూడెంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా హరిత టూరిజం హోటల్ నిర్మాణం చేయనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మనోహార్, కన్జర్వేటర్ ఆనంద మోహన్, అటవీశాఖ డిఎఫ్‌ఓలు సి.శరవణ్, ఎ.వి. రావు, కేటీపీఎస్ సీఈ సిద్దయ్య, తహసీల్దార్ సమ్మిరెడ్డి, కేటీపీఎస్ ఎస్‌ఈ రాంప్రసాద్, ఈఈ రవీందర్, ఏడీఈ కోటేశ్వరరావు, టూరిజం కార్పొరేషన్ జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు, ఆర్కిటెక్ట్ దివాకర్, పర్యాటక శాఖ జిల్లా అధికారి సుమన్‌చక్రవర్తి, కొత్తగూడెం డీఎస్పీ సురేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ టూరిజం హాబ్‌గా ఖమ్మం..
Published Wed, Apr 8 2015 7:22 PM | Last Updated on Sat, Aug 11 2018 7:56 PM