‘అంత్యోదయ’మే మోదీ నినాదం | We Will Form Govt In Telangana Says BJP | Sakshi
Sakshi News home page

‘అంత్యోదయ’మే మోదీ నినాదం

Published Mon, Oct 29 2018 2:19 AM | Last Updated on Mon, Oct 29 2018 3:12 AM

We Will Form Govt In Telangana Says BJP - Sakshi

ప్రసంగిస్తున్న రాం మాధవ్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో చిట్టచివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలన్న ఏకైక లక్ష్యంతోనే మోదీ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. అంత్యోదయ నినాదంతో పనిచేస్తున్నందున.. 2019 ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి తీసుకురావాలని బీజేవైఎం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో బీజేవైఎం ‘విజయ్‌లక్ష్య 2019 యువ మహాధివేశన్‌’లో ఆదివారం ప్రసంగించారు. పేదరికాన్ని అనుభవించిన మోదీకి ప్రజలకు ఎదురయ్యే కష్టాలేంటో తెలుసన్నారు. అందుకే బడుగు, బలహీన, పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమల్లోకి తెచ్చారన్నారు. ఆర్థిక స్వావలంబనతో విశ్వశిఖరంపై భారత జెండా ఎగురవేసిన ఘనత మోదీదేనన్నారు. యువమోర్చా ప్రతినిధులలే.. రేపటి భావి నేతలని, సేవే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ‘బూత్‌ స్థాయిలో గెలిస్తేనే పార్టీ గెలుస్తుంది. బూత్‌ స్థాయినుంచే పార్టీని బలోపేతం చేయాలి. అమిత్‌ షా, పూనమ్‌ మహాజన్‌ ఆధ్వర్యంలో యువమోర్చా ప్రతినిధులంతా కొత్త ఉత్సాహంతో పనిచేయాలి’అని గోయల్‌ కోరారు. కేంద్రం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

ఇక తెలంగాణ వంతు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ మాట్లాడుతూ.. బీజేపీ 20 రాష్ట్రాల్లో గెలిచిందని, ఇప్పుడు తెలంగాణలోనూ గెలవాలన్నారు. అందుకు యువమోర్చా రెట్టించిన ఉత్సాంతో పని చేయాలన్నారు. ప్రధాని మోదీకి సియోల్‌ శాంతి బహుమతి వచ్చిందని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ప్రధానికి అద్భుతమైన మర్యాద, స్వాగతం లభిస్తున్నాయన్నారు. భారత గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత గొప్పగా చేసిన ఘనత ప్రధానిదేనని రాంమాధవ్‌ ప్రశంసించారు. వివిధ దేశాధి నేతలు కలిస్తే.. ప్రపంచం దృష్టంతా మోదీపైనే ఉంటుందన్నారు. యెమెన్‌ అంతర్యుద్ధం సమయంలో.. అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు సైన్యాన్ని రంగంలోకి దించామని ఆయన గుర్తుచేశారు. ఇదే సమయంలో అక్కడున్న చిక్కున్న తమవారినీ కాపాడాలంటూ 30 దేశాలు భారత్‌ సాయాన్ని అర్థించాయన్నారు.

దేశవ్యాప్తగా బీజేపీ జోరును అడ్డుకునేందుకు ఎవరెన్ని కుట్రలు పన్నినా పెద్ద ప్రభావం ఉండదన్నారు. తెలంగాణలో బీజేపీ విజయానికి.. ఈ సదస్సు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. ‘19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. 20వ రాష్ట్రంగా తెలంగాణ కూడా బీజేపీ ఖాతాలోకి రాబోతోంది’ఇందులో సందేహమేమీ లేదు. అని రాంమాదవ్‌ పేర్కొన్నారు. బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్‌ మహజన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనం లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు మురళీధర్‌రావు, రాంలాల్‌ తదితరులు పాల్గొన్నారు.  

తెలంగాణలో కమలోదయం...
డిసెంబర్‌ 11న తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్‌ జోస్యం చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ద్వారా 2019లో మోదీ విజయం సంపూర్ణం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ‘విజయలక్ష్యం 2019 యువ మహాధివేశన్‌’పేరుతో యువ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తెలుగులో కూడా ప్రసంగించారు. నరేంద్ర మోదీ వంటి ప్రధాని దొరకడం మన అదృష్టమన్నారు. పతంగి పట్టుకుని కారు నడుపుతున్న వారి మధ్యలోకి అమిత్‌ షా లాంటి సింహం రావడంతో భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ బిడ్డనని, ఆంధ్రా కోడలినని తెలిపారు. పప్పూ వెంట కొంత మంది మూర్ఖులు ఉన్నారని పరోక్షంగా రాహుల్‌ గాంధీ గురించి ప్రస్తావించారు. 2019లో విజయమే మన సంకల్పమని, మోదీ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలన్నారు. ఈ సందర్భంగా ఆమె అమిత్‌ షాను సత్కరించి, వివేకానంద పుస్తకం బహూకరించారు.

అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ: లక్ష్మణ్‌
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీతో పాటు పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే లక్షా 10 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీఇచ్చి కేవలం 15 వేల ఉద్యోగాలను మాత్రమే కేసీఆర్‌ భర్తీ చేశారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్, అధికారంలోకి వచ్చిన అనంతరం ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. డీఎస్సీ కోసం యువత ఎదురు చూసి విసిగిపోయారన్నారు. అమిత్‌ షా నేతృత్వంలో మరొకసారి మోదీ ప్రధాని కావడం తథ్యమన్నారు. తెలంగాణ యువకులు కమల వికాసానికి కంకణబద్ధులై ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement