రాష్ట్రంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడ ప్రాంతం మెదక్ జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్న పట్టణం. భిన్న సంస్కృతులకు నిలయం. వలస జీవుల ఆవాసం. మినీ భారత్‌ను తలపించే నియోజకవర్గ కేంద్రం. జనాభాకు తగ్గట్టుగానే ఇక్కడి సమస్యలూ ఎక్కువే. అందుకే ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించే వారికి క్షణం తీరిక ఉండదు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ తలమునకలై ఉంటారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన మహిపాల్‌రెడ్డిది కూడా అదే పరిస్థితి. కానీ ఆదివారం ఆయన ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కొత్త అవతారం ఎత్తారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారి స్థానిక మార్కెట్ సమస్యలు తెలుసుకున్నారు. ఇటు వ్యాపారులు, అటు వినియోగదారుల ఇబ్బందులను వారి ద్వారానే తెలుసుకున్నారు. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి: ఏమయ్యా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి.
వ్యాపారి అల్తాఫ్ : సార్ నమస్కారం (లేచి నిలబడేందుకు ప్రయత్నించగా, ఎమ్మెల్యే వారించి కూర్చోబెట్టారు) సార్ ధరలు మండి పోతున్నాయి. ఏమాత్రం తగ్గడం లేదు.
ఎమ్మెల్యే: తెలంగాణ రాష్ట్రం వచ్చిన త ర్వాతకూడ ధరలు తగ్గలేదా? (నవ్వుతూ)
అల్తాఫ్: అలా అని కాదు సార్.. కాలం సరిగ్గా లేక కూరగాయల ధరలు పెరిగాయి.
ఎమ్మెల్యే: పటాన్‌చెరుకు కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.
అల్తాఫ్: సిటీ నుంచి సార్. అలాగే శంకర్‌పల్లి, పటాన్‌చెరు మండలం
నుంచి కూడా వస్తున్నాయ్.
ఎమ్మెల్యే: కూరగాయల మార్కెట్‌లో ఉన్న సమస్యలేంటి ?
అశోక్ (స్థానికుడు): చాలా సమస్యలున్నాయి సార్. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా
ఈ మార్కెట్‌ను పట్టించుకో లేదు. మీరైనా దయతో దీన్ని బాగు చేయండి. పారిశ్రామిక వాడ పెద్దగా ఉన్నా, మార్కెట్ ప్రత్యేక ప్రదేశం లేదు. దీంతో రోడ్డుపైనే మార్కెట్ జరుగుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఎమ్మెల్యే : మున్సిపాలిటీ వాళ్లు రోజు మార్కెట్‌ను శుభ్రం చేస్తున్నారా?
అర్షాద్ (స్థానికుడు): లేదు సార్... మార్కెట్‌లో కంపువాసన వస్తోంది. మురిగిపోయిన కూరగాయలను ఇక్కడి నుంచి తొలగించడం లేదు. వర్షాకాలంలో అమ్మేటోళ్లు, కొనేటోళ్లు శాన ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటోళ్లు సరిగ్గా పట్టించుకుంట లేరు. మార్కెట్‌ను షిఫ్టు చేయాలి. రోడ్డు మీద కూరగాయలు అమ్మకుండా సూడాలి.
(సమస్యలన్నీ సావదానంగా విన్న మహిపాల్‌రెడ్డి స్పందిస్తూ)
ఎమ్మెల్యే: పట్టణంలోని తిమేసియా ఫ్యాక్టరీ ఆవరణలో 12 ఎకరాల జాగా ఉంది. అక్కడికి మార్కెట్‌ను తరలిస్తాం. అన్ని రకాల వసతులు కల్పిస్తాం. ఇదే విషయమై సీఎం కేసీఆర్‌తో మాట్లాడాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఒక్కటిన్నర నెలలో కూరగాయల మార్కెట్‌ను అక్కడికి తరలిస్తాం. దశాబ్దాల మార్కెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.
(ఒక్కొక్కొ దుకాణాన్ని చూస్తూ ముందుకు సాగిన మహిపాల్‌రెడ్డి మహిళా వ్యాపారి వద్ద ఆగారు)
ఎమ్మెల్యే : ఏమమ్మా మార్కెట్ యార్డును తిమేసియా ఫ్యాక్టరీ దగ్గరలోని స్థలంలోకి బదిలీ చేస్తే బాగుంటదా?
వ్యాపారి నర్సమ్మ : ఇక్కడైతే ఏం బాగాలేదు పటేలా. మార్కెట్‌ను మంచి జాగలో పెటుండ్రి. ఇప్పుడైతే సానా కష్టాలు పడుతున్నాం. ఏండ్ల నుంచి ఈడనే అమ్ముతున్నాం. కొనేటోళ్లకు, మాకు శాన ఇబ్బంది ఐతాంది.
ఎమ్మెల్యే: ఇక ఈ సమస్యలన్నీ పోతయి తల్లీ.. త్వరలోనే మార్కెట్ కమిటీని కూడా ఏర్పాటు చేయిస్తా.
(మార్కెట్‌కు వచ్చిన ప్రజలతో మాట్లాడిన మహిపాల్‌రెడ్డి సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు)
ఎమ్మెల్యే: పింఛన్లు అందరికి వస్తున్నాయా?
లక్ష్మమ్మ: సారూ...మాకు పింఛన్లు రావడం లేదు. ఎవరికి అడిగినా సమాధానం లేదు.
ఎమ్మెల్యే: ఏం బాధపడొద్దమ్మా...పింఛనే కాదు..అన్ని సంక్షేమ పథకాలను అర్హులందరికీ దక్కేలా చూస్తా. పింఛన్ పోయిందని ఆందోళనొద్దు. నీను నేనేం జెప్తున్నా తప్పకుండా నీకు పింఛన్ వస్తుంది.
(పక్కనే ఉన్న శ్రీనివాస్ అనే స్థానికుడు కల్పించుకుని..)
శ్రీనివాస్: వృద్ధులు, వికలాంగులు పింఛన్ కోసం ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఇచ్చే రూ. 200లే అందరికీ ఇస్తే బాగుండేది.
ఎమ్మెల్యే: అర్హులందరికీ రూ. వెయ్యి పింఛన్లు వస్తాయి. గతంలో రూ. 200 ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. అర్హులై ఉండీ ఇంతవరకూ పింఛన్లు రాని వారంతా మళ్లీ దరఖాస్తు చేసుకోండి. తప్పకుండా వస్తుంది.
ఎమ్మెల్యే: సర్కార్ భూముల్లో నివాసముంటున్న పేదోళ్లకు ఉచితంగానే పట్టాలిస్తున్నారు తెలుసా?
(అక్కడున్న వాళ్లంతా అనుమానంగా మొహాలు చూసుకున్నారు..వారి అనుమానం అర్థం చేసుకున్న మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ..)
ఎమ్మెల్యే: అవునయ్యా..సర్కార్ స్థలంలో ఉన్న పేదోళ్లందరికీ సర్కార్ పట్టాలిస్తుంది. అయితే నివాసముంటున్న భూమి 125 గజాల్లోపు ఉండాలి. అర్హులంతా 18వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకుంటే ప్రభుత్వం ఉచితంగానే పట్టాలిస్తుంది.
‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు
వీఐపీ రిపోర్టర్‌ను చేయడంతో పాటు ప్రజల వద్దకు తీసుకువచ్చి వారి సమస్యలను స్వయంగా తెలుసుకునే చేసిన ‘సాక్షి’ ప్రత్యేక కృతజ్ఞతలు. విలేకరిగా మారి జనం సమస్యలను రిపోర్ట్ చేయడం మంచి అనుభూతిని మిగిల్చింది. స్వాతంత్య్రం రాక ముందునుంచీ పట్టణంలో కూరగాయల సంత ఇక్కడే జరిగేది. జనాభా పెరిగినా సౌకర్యాలు ఆమేరకు పెరగలేదు. తెలంగాణ సర్కార్ దశాబ్ధాల మార్కెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది.
-మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే, పటాన్‌చెరు
వెతలు తీరుస్తా..
Published Mon, Jan 12 2015 9:04 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement