'లక్షలోపు రుణమాఫీ చేస్తాం'
ఢిల్లీ: రైతు రుణాల్లో భాగంగా ఏ బ్యాంకుల్లో లక్షలోపు రుణం తీసుకున్నా మాఫీ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రుణమాఫీపై మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీకి కట్టుబడి ఉందన్నారు. లక్షలోపు రైతు రుణమాఫీ వల్ల 35లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారన్నారు. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్ లో రూ.15 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో వెటర్నరీ డాక్టర్ల పోస్టుల భర్తీ చేపడతామన్నారు. కూరగాయల ఉత్పత్తిని పెంచేందుకు గ్రీన్ హౌజ్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని పోచారం తెలిపారు.
దీనికి గాను 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. కొన్ని రోజుల క్రితం తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, రుణమాఫీని వందశాతం అమలు చేసి తీరుతామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం తెలిపిన సంగతి తెలిసిందే.