సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నెల 15 నుండి 19వ తేదీ వరకు నిర్వహించే ఈ మహాసభలకు రాష్టపతి, ఉప రాష్ట్రపతితోపాటు ఇతర ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారితో కలసి సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చే సాహితీ ప్రముఖులకు బస, భోజనం, రవాణా తదితర సౌకర్యాల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, ప్రత్యేక వలంటీర్లను నియమించుకోవాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, హెచ్‌వోడీలు, యూనివర్సిటీ వీసీలకు ప్రారంభ, ముగింపు వేడుకల్లో పాల్గొనేలా సర్క్యులర్ రూపొందించాలని ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హాకు సూచించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, ముఖ్యకార్యదర్శులు సునీల్ శర్మ, రజత్ కుమార్, సీవీ ఆనంద్, కార్యదర్శులు బి.వెంకటేశం, సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, వాటర్‌బోర్డు ఎండీ దానకిషోర్, పీసీబీ సభ్యకార్యదర్శి సత్యనారాయణరెడ్డి, టూరిజం కార్పొరేషన్ ఎం.డి. క్రిస్టినాచౌంగ్త్, సాట్స్ ఎం.డి. దినకర్ బాబు, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, హైదరాబాద్ కలెక్టర్ యోగితారాణా, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్, హైదరాబాద్ సీపీ శ్రీనివాసరావు, సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, తెలుగు యూనివర్సిటీ వీసీ సత్యనారాయణ, గ్రంధాలయ సంస్థల చైర్మన్ శ్రీధర్, ఆధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీ స్టేడియంలో లేజర్ షో
తెలుగు మహాసభలకు ప్రముఖ క్రీడాకారులను ఆహ్వానించాలని ఎస్పీ సింగ్ ఆదేశించారు. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడి యంలో ప్రముఖ నిపుణులతో లేజర్ షో నిర్వహించాలని, నగరంలో 100 స్వాగత ద్వారాలతోపాటు ఎయిర్‌పోర్టు, బస్, రైల్వే స్టేషన్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిం చారు. టెలివిజన్ చానళ్లల్లో అడ్వర్టయిజ్ మెంట్, సెల్ ఫోన్ల ద్వారా వాయిస్ మేసేజ్ ప్రచారం నిర్వహించాలన్నారు. పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. వేడుకల సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక బుక్ స్టాల్స్ , ఫుడ్ కోర్ట్, హస్తకళల స్టాల్స్ ఏర్పాటుతోపాటు మంచినీటి సరఫరా కోసం చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment