
'సిద్ధయ్యకు ఎంత ఖరీదైన వైద్యమైనా చేయిస్తాం'
హైదరాబాద్: ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆత్మకూరు (ఎం) ఎస్ఐ సిద్ధయ్యకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సిద్ధయ్యకు ఎంత ఖరీదైనా వైద్యమైనా చేయిస్తామని స్పష్టం చేశారు. సోమవారం సిద్ధయ్యను పరామర్శించడానికి కామినేని ఆస్పత్రికి వచ్చిన నాయిని మీడియాతో మాట్లాడారు. అపస్మారక స్థితిలో ఉన్న సిద్ధయ్యకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
ఉగ్రవాదులు చేతిలో మరణించిన పోలీసుల కుటుంబాలను ఆదుకుంటామని నాయిని తెలిపారు. ఎన్ఐఏ, మధ్యప్రదేశ్ పోలీసులు చెప్పినట్లు ఆ దుండగులు ఉగ్రవాదులేనన్నారు. మిగిలిన వాళ్ల కోసం తమ రాష్ట్ర పోలీసులతో పాటు, మరో రెండు రాష్ట్రాల్లో పోలీసులు గాలిస్తున్నారన్నారు.