
యువతిని అభినందిస్తున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: ‘కసి, తపన, లక్ష్యం నిరుద్యోగ యువతలో తప్పనిసరిగా ఉండాలి. ఈ జాబ్‌మేళా ప్రారంభం మాత్రమే.. నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశం కల్పించి జీవితంలో స్థిరపడే వరకు వదిలిపెట్టం. జాబ్‌మేళాలో ప్రతిభను చూపి ఉద్యోగాన్ని సాధించుకున్న వారు ఉద్యోగం చేస్తూ కూడా చదువుకోవచ్చు. జాబ్‌మేళాలో ఉద్యోగం రానివారి భవిష్యత్‌కు ప్రణాళికను రూపొందించి ముందుకు సాగుతాం. మీరు చేయాల్సిందల్లా మా ప్రతీ సందేశానికి స్పందిస్తే చాలు’ అంటూ ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు నిరుద్యోగ యువతకు దిశానిర్దేశం చేశారు. సోమవారం సిద్దిపేటలోని కొండ మల్లయ్య ఫంక్షన్ హాల్‌లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళాను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
మెగాజాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగ యువతీయువకులు
ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత లక్ష్యసాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడి పని చేస్తే ఎంతటి కష్టతరమైన పనికూడా విజయవంతం అవుతుందన్నారు. ఆ దిశగా ఉద్యోగం విషయంలో కూడా యువతీయువకులు సీరియస్‌గా ముందుకు సాగాలన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలనే కసి, తపన, లక్ష్యం ఉండాలని ఉద్యోగం చిన్నదా, పెద్దదా , ప్రభుత్వమా, ప్రైవేట్‌దా అనే ఆలోచన కంటే ముందు జీవితంలో స్థిరపడాలనే లక్ష్యం ఉండాలన్నారు. కొంత కాలం కష్టపడితే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. చదువుకుని ఇంటికే పరిమితమై ఉంటే ఉద్యోగాలు రావని, తల్లిదండ్రులకు భారం కాకుడదన్నారు. సమాజాన్ని తెలుసుకునేందుకు ఒక అడుగు బయటపెట్టి బాహ్యప్రపంచాన్ని చూస్తే ఎన్నో అవకాశాలు లభిస్తాయన్నారు. ఇంజనీరింగ్ చదివిన వారికంటే ప్లంబర్ మేస్త్రీలకు ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ప్రపంచం మారిందని, మనం మారుదామని ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే ఉద్యోగం కాదన్నారు. ప్రైవేటు రంగంలో కూడా ఎన్నో అద్భుతాలు సృష్టించడంతో పాటు ఎంతో ఎత్తుకు ఎదిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగికి ఒకే వేతనం స్థిరీకరణ చెంది ఉంటుందని, ప్రైవేటు ఉద్యోగికి ఎన్నో అవకాశాలు వస్తాయన్నారు.
ఉద్యోగిలో ప్రతిభ శక్తి సామర్థ్యాలు ఉంటే సొంతంగా కంపెనీ యజమాని కూడా అయ్యే అవకాశం ఉందన్నారు. ఆడపిల్లలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో సమాన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని అదే తరహాలో ఉద్యోగాన్ని సాధించడం కోసం కూడా జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొందరి సక్సెస్ స్టోరీలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ జాబ్‌మేళాలో జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, జిల్లా మెప్మా పీడీ శ్రీనివాస్‌రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్, కౌన్సిలర్‌లు గ్యాదరి రవి, సాకిఆనంద్, నర్సయ్య, మోయిజ్, దీప్తినాగరాజు, లక్ష్మీసత్యనారాయణ, పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ పాల సాయిరాం. టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు మహేష్, తదితరులు పాల్గొన్నారు.