♦ టీమ్ ఇండియాలో భాగస్వాములమవుతాం: సీఎం కేసీఆర్
♦ తెలంగాణకు గడ్కరీ 1,800 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఇచ్చారు
♦ ఆయన్ను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు
♦ గడ్కరీతో కలసి గోదావరిపై నిర్మించిన ముల్లకట్ట వంతెనకు ప్రారంభం
♦ ఆలేరు-వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన
♦ నేడు, రేపు వరంగల్ పర్యటనలోనే సీఎం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఈ రాష్ట్రం ఎందుకు ఏర్పడిందో గణాంకాలే చెబుతున్నాయి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు కావాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన టీం ఇండియాలో భాగస్వాములమవుతాం. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా మడికొండలో సీఎం కేసీఆర్, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కలిసి ఆలేరు-వరంగల్ జాతీయ రహదారి(163) విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం ముల్లకట్ట-ఖమ్మం జిల్లా పూసురు మధ్య గోదావరి నదిపై నిర్మించిన నూతన వంతెనను కూడా మడికొండలోనే ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడారు.
‘‘జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ పరిస్థితి దయనీయంగా ఉంది. దక్షిణ భారత దేశంలో జాతీయ రహదారులు సగటుతో పోలిస్తే తెలంగాణలో చాలా తక్కువగా 2.25 శాతమే ఉన్నాయి. ఢిల్లీ వెళ్లినప్పుడు గడ్కరీకి దీనిపై వివరాలు ఇచ్చాను. ఇది అన్యాయం... ఇలా ఉండకూడదని కేంద్ర మంత్రి అన్నారు. గతంలో కోరినదాని కన్నా 110 కిలోమీటర్లు ఎక్కువగా జాతీయ రహదారులు కావాలని అడిగాను. 1,800 కిలో మీటర్లు మేరకు జాతీయ రహదారులు ఇచ్చారు. అందుకు గడ్కరీకి కృతజ్ఞతలు. గడ్కరీని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. ఈ విషయంతో ఆయన చరిత్రలో నిలిచిపోతారు’’ అని సీఎం అన్నారు.
హైదరాబాద్‌లో సీసీఐ తెరిపించండి
రూ.340 కోట్లతో గోదావరిపై బ్రిడ్జిని ప్రారంభించామని, 99 కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశామని సీఎం చెప్పారు. ఇవి త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు. ‘‘ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ హైవేను పూర్తి చేసిన అనుభవం గడ్కరీకి ఉంది. ఈ అనుభవంతోనే దేశంలోని రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. దేశంలో 350 రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)లను మంజూరు చేస్తే వాటిలో 12 తెలంగాణలో ఉన్నాయి. మరికొన్ని బ్రిడ్జిలు మంజూరు చేయాలని కోరుతున్నా.
ఎక్కడెక్కడ మంజూరు చేయాలనే విషయంపై వినతులు ఇస్తాం. గోదావరిలో జల రవాణా కోసం రాష్ట్రం తరఫున త్వరలోనే ప్రతిపాదనలు పంపిస్తాం. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) హైదరాబాద్‌లో ఉంది. దీన్ని తెరిపించేందుకు కృషి చేయాలని గడ్కరీకి విజ్ఞప్తి చేస్తున్నా. మహారాష్ట్రలో వెస్టర్స్ కోల్డ్ ఫీల్డ్‌లో కోల్ గ్యాసిఫికేషన్ సాంకేతికతతో యూరియా తయారు చేస్తున్నారు. మా దగ్గర ఇలా చేసేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని, అనుమతులను ఇవ్వాలని కోరుతున్నా’’ అని అన్నారు.
వరంగల్‌లో గిరిజన వర్సిటీ
‘‘హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరం. ఇక్కడ ఇప్పటికే ఆరోగ్య వర్సిటీ, సైనిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉన్నాయి. త్వరలో గిరిజన వర్సిటీ రాబోతోంది. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో వరంగల్ అభివృద్ధి చెందుతుంది’’ అని సీఎం వివరించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జి.పద్మ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలు ఎవరి తిండి తింటారో వారి పేరు
తల్చుకుంటారు. అట్లనే తమతో పెట్టుకున్న వారిపై పోరాడతారు. (తెలంగాణ కే జనతా జిస్‌కా కాతా హై ఉస్ కా గాతా హై.
జో హమారే సే లడ్తా హై జిస్ సే దిలో జహా సే లడ్తా హై..)
- వరంగల్ జిల్లా మడికొండ బహిరంగ సభలో సీఎం కేసీఆర్
రెండ్రోజులు వరంగల్‌లోనే..
ముఖ్యమంత్రి సోమవారం రాత్రి మాజీ మంత్రి కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేశారు. మంగళవారం కూడా వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలంలో చెల్పూరులో కాకతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(కేటీపీపీ) రెండో దశ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం హన్మకొండకు చేరుకుంటారు. బుధవారం వరంగల్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు.
కేంద్రంతో కలసి పనిచేస్తాం
Published Tue, Jan 5 2016 4:12 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement