
సాక్షి, హైదరాబాద్ : చేనేత కార్మికుల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. జాతీయ బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నుంచి 2014 జనవరి 1 నుంచి 2017 మార్చి 31 వరకు తీసుకున్న రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవరిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశామని మంత్రి కేటీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సవరణ ద్వారా 2010 ఏప్రిల్ 1 నుంచి తీసుకున్న రుణాలకు మాఫీ వర్తింపజేశామన్నారు. గత ప్రభుత్వం చివరిసారిగా 2010 మార్చి 31 వరకు చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేసిందని, ఆ తర్వాత తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం జీవో నెం.46 జారీ చేశామన్నా రు.
8,500 మందికి రుణ మాఫీ..
రుణమాఫీ ద్వారా చేనేత కార్మికులకు సాధ్యమైనంత అధిక ప్రయోజనం కలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన చేనేత కార్మికులు నష్టపోకుండా వారు చెల్లించిన మొత్తాలను తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఈ రుణ మాఫీ ద్వారా ‘వృత్తిలో కొనసాగే లబ్ధిదారులు’మాఫీ అయిన రుణాలకు తక్కువ కాకుండా తిరిగి కొత్త రుణాలు పొందేందుకు హామీ పొందుతారని వెల్లడించారు. సుమారు 8,500 మంది చేనేత కార్మికుల రుణాలు మాఫీ అవుతాయని, ఇందుకు రూ.40 కోట్ల ఖర్చు అవుతుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment