కల్యాణ వైభోగమే! | Wedding registrations growing in the state | Sakshi
Sakshi News home page

కల్యాణ వైభోగమే!

Published Fri, Nov 17 2017 3:15 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

Wedding registrations growing in the state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివాహాలు చేసుకుంటున్న జంటలు తమ పెళ్లిని చట్టప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంలో ఆసక్తి చూపుతున్నాయి. ప్రతి పెళ్లికి చట్టబద్ధత ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రస్తుత పరిస్థితి మారుతోంది. దాంతో ఏటా జరుగుతున్న వివాహాల్లో ఎక్కువ శాతం చట్ట ప్రకారం నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఏటా సగటున మూడు లక్షల జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతున్నట్లు అంచనా. అధికారిక అంచనాల ప్రకారం గత మూడేళ్లలో 9.75 లక్షలకుపైగా పెళ్లిళ్లు జరగగా.. 3.10 లక్షల పెళ్లిళ్లు రిజిస్టర్‌ అయ్యాయి. ఇది దేశంలోనే టాప్‌ అని అధికారవర్గాలు చెబుతున్నాయి.

క్రమంగా పెరుగుతున్న శ్రద్ధ
బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు వివాహ బంధానికి చట్టపర రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వివాహాల నమోదు చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది అమల్లోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. వివాహాల నమోదు పెద్దగా కనిపించలేదు. గతంలో వివాహాల రిజిస్ట్రేషన్‌ కేవలం సబ్‌రిజిస్ట్రార్, తహసీల్దార్‌ కార్యాలయాల్లో చేసేవారు. అనంతరం గ్రామ పంచాయతీ స్థాయిలో ధ్రువీకరణ చేస్తే సరిపోతుందని ప్రభుత్వం నిబంధనలు సడలించింది. దాంతో పరిస్థితి కొద్దిగా మెరుగుపడినా పెద్దగా పురోగతి లేదు. అయితే రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి పథకాలను చేపట్టిన నేపథ్యంలో.. వివాహాల నమోదు బాగా పెరిగింది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేందుకు జంటలు వివాహాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నాయి.

సర్కారు ‘కానుక’తో..
తెలంగాణ ఏర్పాటయ్యాక టీఆర్‌ఎస్‌ సర్కారు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను అమల్లోకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో ఈ పథకాలకు బాగా డిమాండ్‌ పెరిగింది. తొలి రెండేళ్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే పరిమితం చేసిన ఈ పథకాలను.. అనంతరం బీసీ, ఈబీసీ వర్గాలకూ వర్తింపజేశారు. 2014–15, 2015–16, 2016–17 సంవత్సరాల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.51,116 నగదును కానుకగా అందించగా.. 2017–18 ఏడాది నుంచి రూ.75,116కు పెంచింది. దీంతో అన్ని వర్గాల నుంచి దరఖాస్తులు పెరిగాయి. ఈ రెండు పథకాల కింద అక్టోబర్‌ నాటికి 2.75 లక్షల దరఖాస్తులు రాగా.. 2.46 లక్షల జంటలు ‘కానుక’అందుకున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్‌ తెలిపారు.

ఎన్నారై పెళ్లిళ్లపై అవగాహన
ఇటీవల ఎన్నారై వివాహాల సంఖ్య పెరుగుతోంది. విదేశాల్లో స్థిరపడిన వరుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేసేందుకు ఇక్కడి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలాంటి ఎన్నారై పెళ్లిళ్లు బెడిసికొడుతున్న సందర్భాలు చాలా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నారై సంబంధాల విషయంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం, మహిళా అవగాహన కల్పిస్తున్నాయి. అలాంటి వివాహాలన్నింటినీ రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. గత మూడేళ్లలో రాష్ట్రంలో 26 వేల ఎన్నారై వివాహాలు జరిగినట్లు హైదరాబాద్‌కు చెందిన మ్యారేజ్‌ బ్యూరో నిర్వాహకులు ఒకరు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement