కొల్లాపూర్: ముస్లింల సంక్షేమానికి టీఆర్‌ఎస్ కట్టుబడి ఉందని.. వారి అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లోని జామా మజీద్‌లో ముస్లింలకు టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం, మంత్రి జూపల్లిని జామా మజీద్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముస్లిం, మైనార్టీల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
షాదీ ముబారక్ పేరుతో ఐదేళ్ల కాలంలో లక్ష వివాహాలకు ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఇప్పటివరకు షాదీ ముబారక్ ద్వారా 16వేల మంది వివాహాలకు ఆర్థిక సహాయం అందజేశామన్నారు. రూ.1105 కోట్ల వ్యయంతో ముస్లిం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొం దిస్తుందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ లౌకిక విధానాలను కొనసాగిస్తుందని అన్నా రు. అన్ని మతాలు, సంప్రదాయాలను గౌరవించే పార్టీ టీఆర్‌ఎస్ అని అన్నారు. భవిష్యత్‌లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల సంక్షేమానికి ఇదే పంథాను కొనసాగిస్తారని వివరించారు. ముస్లింలు చదువులో రాణించాలని, ప్రతి పిల్లాడిని చదివించాలని డిప్యూటీ సీఎం సూచించారు. విద్యారంగంలో రాణించడం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదల సాధించవచ్చన్నారు.
ప్రజారంజక పాలనను ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో ఆఫీసాహెబ్, ఆరీఫ్ సుతారీ, ఎంపీపీ నిరంజన్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు హన్మంతునాయక్, టీఆర్‌ఎస్ నాయకులు జూపల్లి రామారావు, నర్సింహా రావు, బాలస్వామి, మేకల రాముడుయాదవ్, వెంకటస్వామిగౌడ్, రహీంపాష, హసన్ తదితరులు పాల్గొన్నారు.
ఖాదర్‌బాషా దర్గా సందర్శన
కొల్లాపూర్ పట్టణం సమీపంలోని ఖాదర్‌బాషా దర్గాను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సందర్శించారు. దర్గా వద్ద ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరుతూ మజీద్ కమిటీ నాయకులు డిప్యూటీ సీఎంకు వినతిపత్రం అందించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే దర్గా అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.
టెలీహెల్త్ సెంటర్ ప్రారంభం
కొల్లాపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన టెలీహెల్త్ సెంటర్‌ను మహిమూద్ అలీ ప్రారంభించారు. టెలీహెల్త్ సెంటర్‌లో రోగులను నిపుణులైన వైద్యులు టెలిఫోన్ ద్వారా వైద్య సేవలందిస్తారని.. అవసరమైన మందులను, చికిత్సల వివరాలను సూచిస్తారని వివరించారు.
ముస్లింల సంక్షేమానికి పెద్దపీట
Published Fri, Jul 3 2015 11:50 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement