అవినీతి తిమింగలం
ఏకకాలంలో వరంగల్, హైదరాబాద్‌లో ఏడు గంటలు సోదాలు ఇళ్లు, స్థలాల గుర్తింపు
14 మద్యం బాటిళ్లు, రూ.67 వేల నగదు స్వాధీనం
రూ.3 కోట్లకుపైగా అక్రమ ఆస్తులున్నట్లు గుర్తింపు
ఏసీబీ డీఎస్పీ సాయిబాబా వెల్లడి
ఏసీబీకి చిక్కిన జనగామ డీఎస్పీ కూర సురేందర్
వివాదాలకు, అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన జనగామ డీఎస్పీ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ కూర సురేందర్‌ను అక్రమాలకు కేంద్రంగా చేస్తూ దాడులు కొనసాగాయి. వరంగల్, హైదరాబాద్‌లలో ఏకకాలంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకదాటిగా ఏడు గంటలపాటు దాడులు జరిగాయి. - సాక్షి, హన్మకొండ
హన్మకొండ : అప్పుడే తెల్లవారుతోంది.. బుధవారం ఉదయం 5.30 గంటలు అవుతోంది. రెండు వాహనాల్లో ఏసీబీ అధికారులు రయ్‌మని వచ్చి జనగామలో ఉన్న డీఎస్పీ కూర సురేందర్ కార్యాలయూనికి అనుబంధంగా ఉన్న డీఎస్పీ నివాస గృహానికి చేరుకున్నారు. విధుల్లో ఉన్న పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయం 5.30 గంటల నుంచి మ ద్యాహ్నం 1.00 గంట వరకు సోదాలు నిర్వహిం చారు. జనగామ డీఎస్పీ కార్యాలయంతోపాటు వరంగల్, హైదరాబాద్‌లలోని డీఎస్పీ కూర సురేం దర్‌కు చెందిన ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిగా యి. మూడేళ్ల క్రితం జనగామకు డీఎస్పీగా వచ్చిన కూర సురేందర్, రేపోమాపో బదిలీ కావచ్చనే ప్రచా రం జరుగుతోంది. ఇంతలోనే ఆయన ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు.
అక్రమలతో ఆస్తులు
వరంగల్, హైదరాబాద్‌లతోపాటు ఇతర ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో ఆదాయానికి మించి రూ.3 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాయిబాబా, ప్రభాకర్ జనగామలో మీడియాకు తెలిపారు. జిల్లాలోని బాలసముద్రంలో ఒక ఇళ్లు, హైదరాబాద్ అంబర్‌పేట, తిలక్‌నగర్ (గోల్‌నాక)లలో రెండు ఇళ్లు, వరంగల్ నక్షత్ర రెసిడెన్సియల్‌లో ఒక అపార్టుమెంట్, హైదరాబాద్‌లోని ఉప్పల్ వెంకటేశ్వర అపార్టుమెంట్‌లో రెండు ప్లాట్లు, హైదరాబాద్ జనచైతన్య అపార్టు మెంట్‌లో ఒకటి మొత్తం మూడు ఇళ్లు, నాలుగు ప్లాట్లు ఉన్నాయన్నారు. వీటితోపాటు హెదరాబాద్, వరంగల్‌లలో వేర్వేరు చోట్ల మరో ఐదు స్థలాలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చామని వెల్లడించారు. ఇప్పటివరకు తాము గుర్తించిన ప్రదేశాల్లో అక్రమంగా రూ.3 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ దాడిలో దొరికిన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాత అక్రమాస్తుల వివరాలు వెల్లడిస్తామన్నారు.
విదేశీ మద్యం
జనగామలోని డీఎస్పీ కార్యాలయంలో 13 విదేశీ మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. వీటిలో మూడు డబుల్ బ్లాక్ జానీవాకర్, 12 ఇయర్స్ శివాజీ లేబుల్, 8 ఇయర్స్ శివాజీ లేబుల్, రెడ్‌లేబుల్, దాల్‌విన్, 4.5 లీటర్ల రెడ్ లేబుల్, ఒక లీటరు రెడ్ లేబుల్‌లు ఉన్నాయి. వీటితోపాటు స్థానికంగా లభించే వ్యాట్ 69 మద్యం సీసాలతోపాటు రూ.67 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాడుల్లో లభ్యమైన మద్యం బాటిళ్లను జనగామ ఎక్సైజ్ సీఐ జగన్నాథరావు సీజ్ చేశారు.
ఆ కేసుతో మొదలు
ఇటీవల లింగాలఘణపురం మండలం నెల్లుట్ల శివారులో ఓ దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్న యువకుడిని ఈ కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సదరు యువకుడి తండ్రి పలుకుబడి కలిగిన కాంట్రాక్టరు కావడంతో పోలీసులు సదరు యువకుడిని కాపాడారని, ఇందులో డీఎస్పీ కీలక పాత్ర పోషించారంటూ దళిత మహిళా సంఘాలతోపాటు అన్ని వర్గాల వారు బహిరంగ ఆరోపణలు చేశారు. కేసు నుంచి తప్పించిన నాలుగో వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయినా పోలీసుల నుంచి స్పందన రాలేదు. దీనితో కాంట్రాక్టరు కుమారుడిని తప్పించేందుకు డీఎస్పీ కార్యాలయం వేదికగా పెద్ద ఎత్తున నోట్ల కట్టలు చేతులు మారాయంటూ, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బుధవారం ఏసీబీ దాడులు జరగాయనే ప్రచారం జరుగుతోంది. ఏసీబీ దాడుల నేపథ్యంలో అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ పోలీసు అధికారుల్లో ఆందోళన మొదలైయింది. ఏకంగా డీఎస్పీ స్థాయి అధికారిపై ఏసీబీ దాడులు జరగడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి వరకు డీఎస్పీ ఆదాయానికి సంబంధించిన డాక్యుమెంట్‌ల పరిశీలన జరుగుతూనే ఉంది.