మెదక్‌టౌన్ : మంగళ, బుధవారాలు వచ్చాయంటే చాలు...! అధికార పార్టీ కీలకనేత ఒకరు అధికారులను, కాంట్రాక్టర్లను మెదక్ ఖిల్లాపైకి పిలిపించుకొని రహస్య మంతనాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లతో ఆ నేత రహస్య మంతనాలు చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు ఎవరైనా సరే ఆయనకు రావాల్సిన కమీషన్ ఇవ్వాల్సిందే. ఆయన లేనిదే ఆ కాంట్రాక్టు పని ముందుకు సాగదు. ఓ దశలో ఆ నేత ఓ మంత్రి అండదండలు చూసుకొని అధికారులు, కాంట్రాక్టర్లపై కమీషన్ల కోసం బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది.
ప్రభుత్వం చేపడుతున్న ఏ పనికైనా ఆయనకు కమీషన్ ఇవ్వనిదే అధికారులు బిల్లులు చేయరనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇటీవల ‘గుట్టమీద ఏం దుకాణం పెట్టావంటూ’ సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఆ కీలకనేతను మందలించినట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం హెచ్చరికతో కొంతకాలం మంతనాలు తగ్గినా తిరిగి ఇటీవల మొదలైనట్లు తెలుస్తోంది. మరోవైపు అధికార పార్టీ నేతలను సైతం అటువైపు కన్నెత్తి చూడనీయకపోవడం గమనార్హం. ఈ విషయమై అధికార పార్టీ నేతలు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కాంట్రాక్ట్‌కు డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారని, అధికారులతోపాటు అనామకులకు కూడా డబ్బులిస్తూ పోతే తామెట్ల పనులు చేయాలని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఆ నేత అండతో ఓ మహిళా ప్రజాప్రతినిధి ఇసుక మాఫియా
అధికార పార్టీ కీలకనేత తమకు అండగా ఉండగా మాకే ం భయమంటూ మెదక్ మండలానికి చెందిన ఓ మహిళా నేత ఇసుక మాఫియాకు తెరలేపారు. మండలంలోని బొల్లారం మత్తడితోపాటు ఇతర ప్రాంతాలనుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు కొన్నిసార్లు అడ్డుపడగా అధికారి పార్టీ కీలక నేత వారిని మందలించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఆయన అండ చూసుకొని పాపన్నపేటకు చెందిన మరో ముఖ్య నాయకుడు సైతం మంజీరానదిలోంచి ప్రతిరోజు వందలాది ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తూ జోరుగా వ్యాపారం కొనసాగిస్తున్నాడు. రామాయంపేట మండలంలోని అధికార పార్టీ నేత ముఖ్య అనుచరులు ఇదే బాటలో నడుస్తున్నట్లు తెలిసింది. మండలంలోని రాంపూర్ వాగునుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. అధికార పార్టీ కీలకనేత కావడంతో చేసేది లేక పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏం చేయాలో పాలుపోక దిక్కులు చూస్తున్నారు.
విలేకరులకు బెదిరింపులు!
మిషన్ కాకతీయ పనులపై ఇటీవల న్యూస్ కవరేజీకి వెళ్లిన ఓ చానల్ విలేకరిని ఆ రాష్ట్ర నాయకుడి అండచూసుకొని మెదక్ మండలానికి పార్టీ సీనియర్ నాయకుడు ఇటీవల ఫోన్‌లో బెదిరించాడు. సదరు విలేకరి అతని బెదిరింపులను ఫోన్‌లో రికార్డుచేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆ నేతపై మెదక్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఇంతగా దౌర్జన్యానికి పాల్పడుతున్న అధికార పార్టీ నాయకుల తీరుపై సర్వత్రా ప్రజల నుంచి బహిరంగంగానే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఖిల్లాపై ఏం జరుగుతోంది?
Published Mon, Jul 6 2015 2:31 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement