♦ ఎన్‌కౌంటర్ తర్వాత నెల పాటు ఓ సంరక్షణశాలలో
♦ ఆ తర్వాత అవి ఎక్కడన్న దానిపై లేని స్పష్టత
♦ గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్ జరిగి ఏడాది పూర్తి
హైదరాబాద్: ఎవరి పైనైనా పగబడితే నిద్రపోయేవాడు కాదు... నడిరోడ్డుపై విరుచుకుపడేవాడు... కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేయించేవాడు.. ఆస్పత్రికి తరలించినా బతికే అవకాశం లేకుండా కత్తికో కండగా నరికించేవాడు... ఒక్కోసారి శరీరాల్ని ఖండఖండాలుగా చేసి పాతిపెట్టించాడు... ఏడాది క్రితం 2016 ఆగస్టు 8న షాద్‌నగర్ శివార్లలోని మిలీనియం టౌన్‌షిప్‌లో ఎన్‌కౌంటర్ అయిన నయీమ్ వ్యవహారశైలి ఇది. ఇంతటి కౄరమైన చరిత్ర ఉన్న కరుడుగట్టిన నేరగాడైన అతడికీ ఓ వీక్‌నెస్ ఉంది. ఇతడికి తన పెంపుడు కుక్కలంటే అమితమైన ప్రేమ. ఇప్పుడు ఇవి ఎక్కడున్నాయన్నది పోలీసులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
రెండింటిని పెంచుకుంటూ...
నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని నెక్నంపూర్ అల్కాపురి టౌన్‌షిప్‌లో ఉన్న ఇంట్లో నయీం రెండు కుక్కలను పెంచాడు. సరిహద్దులో పహారా కోసం భద్రతా బలగాలు వినియోగించే ‘డాల్మటైన్’ జాతికి చెందిన శునకాలను నయీ మ్ తెచ్చుకుని పెంచే వాడు. వీటికి శాండో, కోమి అని పేర్లు కూడా పెట్టాడు.
వాటి తిండికీ‘టైమ్ టేబుల్’..
ఈ రెండు శునకాల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం కోసం ప్రత్యేకంగా ఓ వెటర్నరీ డాక్టర్‌ను ఏర్పా టు చేశాడు కూడా. వైద్యుడి సూచనల మేరకు వీటికి నిత్యం ఇవ్వాల్సిన ఆహారం, టానిక్స్ సంబంధించి ఓ పట్టిక తయారు చేశాడు. తన ఇంటి గ్రౌండ్‌ఫ్లోర్‌లో వీటికోసం ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆహార, సమయ సూచిక’ పేరుతో ఓ బోర్డు సైతం ఏర్పాటు చేయించాడు. ఎన్‌కౌంటర్ తర్వాత నయీం ఇంటిని సీజ్ చేసిన పోలీసులు ఈ రెండు శునకాలనూ సంరక్షణ నిమిత్తం పుప్పాలగూడలోని ఓ కెన్నల్‌కు తరలించారు.
దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉన్నాయి. ఆపై వాటిని పోలీసులే తీసుకువెళ్ళారని కెన్నల్ నిర్వాహకులు, జంతు సంరక్షణ విభాగం అధికారులు తీసుకువెళ్ళారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు అవి ఎక్కడున్నాయన్నది ఎవరూ స్పష్టం చెప్పలేకపోతున్నారు.
నిర్మానుష్యంగా నయీమ్ ఇల్లు...
ఏరియాకో గ్యాంగ్‌ను నిర్వహించిన నయీమ్ గల్లీకో డెన్ ఏర్పాటు చేసుకున్నాడు. నెక్నంపూర్ అల్కాపురి టౌన్‌షిప్‌తో పాటు శంషాబాద్, హస్తినాపురం, వస్థలిపురం, మన్సూరాబాద్, కుంట్లూర్‌ల్లో డెన్స్ నిర్వహించాడు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు గోవా, ఏపీ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోనూ ప్రత్యేక డెన్లు ఏర్పాటు చేసుకున్నాడు.
వీటిని తన భార్య, సోదరితో పా టు ప్రధాన అనుచరుల పేర్లతోనూ రిజిస్టర్ చేయించాడు. స్థలాలు, భూములు వీటికి అద నం. నయీమ్ ఎన్‌కౌంటర్ జరిగిన తొలినాళ్లల్లో స్థిరాస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా... అది కేవలం సీజ్ వరకే సాధ్యమైంది. దీంతో అనేక డెన్స్ ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి.