టీచర్లేరి ? | Where is the teachers | Sakshi
Sakshi News home page

టీచర్లేరి ?

Published Wed, Aug 19 2015 4:41 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

టీచర్లేరి ?

టీచర్లేరి ?

♦ విద్యార్థులను వేధిస్తున్నటీచర్ల కొరత
♦ జిల్లాలో 721 ఏకోపాధ్యాయ, 223టీచర్ లేని స్కూళ్లు
♦ మల్లాపూర్ పాఠశాలలో ఒక్క విద్యార్థికి నలుగురు టీచర్లు       
♦ రేషనలైజేషన్, బదిలీల తర్వాత కూడా అదే పరిస్థితి
 
  మహబూబ్‌నగర్ విద్యావిభాగం : ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు అట కెక్కాయి. సరిపోయినంత మంది టీచర్లను నియమించకుండా ప్రభుత్వాలు విద్యార్థులకు నాణ్యమైన విద్య అంది స్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నాయి. సన్నబియ్యం, దుస్తులు, ఆరోగ్యకార్డులు, ఉపకారవేతనాలు ఇలా కొత్త పథకాలను పాఠశాలల్లో ప్రవేశపెడుతున్న ప్రభుత్వం అధికారులు.. బోధించాల్సిన ఉపాధ్యాయులను మాత్రం నియమించడం లేదు. అనేక పాఠశాలల్లో ఐదు తరగతులకు ఒక్కరే టీచర్ ఉన్నారు. మరికొన్నిం టిలో ఆ ఒక్కరు కూడా లేరు. అయితే, వీటికి విరుద్ధంగా కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకంటే టీచర్లే ఎక్కువగా ఉన్నారు.

ప్రస్తుతం చాలా పాఠశాలల్లో ఏకోపాధ్యాయులు కూడా బదిలీ కావడంతో పాఠశాలల నిర్వహ ణ కష్టంగా మారింది. కొత్తూరు మం డలం మల్లాపూర్ పాఠశాలలో ఒక్క విద్యార్థికి నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో రేషనలైజేషన్, బదిలీల తర్వాతా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. దీనికి తోడు ప్రభుత్వ ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం, విధులకు డుమ్మా కొట్టడం, సొంత వ్యాపారాల్లో మునిగి తేలుతుండడంతో ప్రభుత్వ పాఠశాలల దుస్తితి ధారుణంగా తయారైంది.

అక్షరాస్యతలో వెనకబడిన గట్టులాంటి మండలాల పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులులేక విద్యార్థులు పాఠశాలకు వచ్చి ఖాళీగా కూర్చొని వెళ్తున్న పరిస్థితి ఉంది. చదువుకుంటాం టీచర్లను నియమించండని విద్యార్థులు హైకోర్టుకు రాసిన లేఖ లతో హైకోర్టు స్పందించింది. డుమ్మా లు కొడుతున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని.. జిల్లా విద్యాశాఖాధికారిపై ఎందుకు చర్యలు తీసుకొవద్దంటూ నోటీసులు రావడంతో అధికారుల్లో.. పాఠశాలలకు వెళ్లని ఉపాధ్యాయుల్లోనూ గుబులు మొదలైంది.

 జిల్లాలో 1794 ఖాళీలు..
 జిల్లాలో మొత్తం 2,725 ప్రాథమిక పాఠశాలలు, 578 ప్రాథమికోన్నత పాఠశాలలు, 657 ఉన్నత పాఠశాలలు, 47 ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. వాటిలో మొత్తం 4,59,819 మంది విద్యార్థులున్నారు. వారికి ప్రభుత్వం గతంలో జిల్లాకు అన్ని కేటగిరిలలో కలిపి మొత్తం 17,407 పోస్టులను మంజూరు చేసింది. కానీ ప్రస్తుతం 15,745మంది ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. అంటే ఇంకా 1662మంది ఉపాధ్యా య ఖాళీలున్నాయి. ఇటీవల మరో 132 ఖాళీలు ఏర్పడ్డాయి. మొత్తం 1794 ఖాళీలున్నాయి. వీటిలో 1100కు పైగా ఎస్జీటీ పోస్టులు ఖాళీలున్నాయి. కానీ, విద్యాశాఖమంత్రి మాత్రం ఎస్జీటీ ఖాళీలు లేవని, ఇప్పట్లో డీఎస్సీ లేదని ప్రకటించడం గమనార్హం. రేషనలైజేషన్‌లో ఎన్ని సర్దుబాటు చేశారనేది నెలరోజులు గడుస్తున్నా జిల్లా విద్యాశాఖాధికారులు మాత్రం లెక్క తేల్చలేదు.
 
 విద్యార్థులు తక్కువ... టీచర్లు ఎక్కువ
 హేతుబద్ధీకరణ తర్వాతా కూడా జిల్లాలో చాలా పాఠశాలల్లో అవసరానికి మించి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
► కొత్తూరు మండలం మల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఒక్క విద్యార్థికి నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఆ విద్యార్థి కూడా 18ఏళ్లు నిండిన మానసిక వికలాంగుడు కావడం గమనార్హం.
► కొత్తూరు మండలం యూపీఎస్ కుమ్మరిగూడలో 27మంది విద్యార్థులకు ఏడుగురు టీచర్లు ఉన్నారు.
►ఖిల్లా ఘనపూర్ మండలం మల్కాపూర్ ప్రాథమిక పాఠశాలలో 23మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఒక్కరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులుండాలి. గతంలో 6,7 తరగతులు నిర్వహిస్తుండే వారు. ప్రస్తుతం రెండేళ్లుగా ఆ తరగతుల నిర్వహణ లేదు. కానీ, ఆ పాఠశాలలో ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు, ఇద్దరు లాంగ్వేజ్ పండిట్‌లు, ఇద్దరు ఎస్జీటీలు మొత్తం ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
► నారాయణపేట మండలం నంబూలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement