ఒక్క ఓటుకు రూ. 5 కోట్లా? ఇంత డబ్బు ఎక్కడిది?
‘పట్టిసీమ’ ముడుపులా?
విద్యుత్తు కంపెనీలతో ఒప్పందాల సొమ్మా?
మద్యం డిస్టిలరీల డబ్బా?
పారిశ్రామిక రాయితీల పేరుతో చేతులు మారిన నిధులా?
ఇసుక విధానం పేరుతో లూటీ చేసినవా?
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఓటు కోసం ఏకంగా ఐదు కోట్ల రూపాయలు ఆశచూపిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించగా.. తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబునాయుడు పక్క రాష్ట్రమైన తెలంగాణలో అదికూడా బలంలేని చోట ఓట్ల కొనుగోలుకు ఇంత పెద్దమొత్తంలో డబ్బు ఎరగా చూపడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారన్న అంశంపైకి మళ్లింది. తెలంగాణలో ఒక్క ఎమ్మెల్సీ గెలిచినా గెలవకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వానికి ఒరిగేదేమీ లేదు. అయినప్పటికీ ఆ రకంగా డబ్బు వెదజల్లడానికి సిద్ధపడటమంటే.. డబ్బు విచ్చలవిడిగా దొరుకుతుండటమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిలో ప్రధానమైనది పట్టిసీమ ప్రాజెక్టు. నాలుగేళ్లలో పోలవరం పూర్తిచేస్తామని చెబుతూ మధ్యలో పట్టిసీమ ప్రాజెక్టును తెరమీదకు తేగా వందల కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై అసెంబ్లీలోనూ తీవ్రమైన చర్చ జరిగింది. అలాగే కాంట్రాక్టర్లకు డబ్బు విడుదల చేసే విషయంలో పలురకాలుగా వెసులుబాటు కల్పిస్తూ జారీచేసిన (జీవో 22) ఆదేశాల విషయంలోనూ పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి.
మరోవైపు ఏపీలో కావలసినంత విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇష్టారాజ్యంగా ప్రైవేటు విద్యుత్ కంపెనీలతో కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న వ్యవహారంలో వేలకోట్ల రూపాయల కుంభకోణం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒకవైపు రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నియంత్రిస్తానని ప్రకటించి తనకు అనుకూలమైన కొన్ని డిస్టిలరీలకు మద్యం ఉత్పత్తి పెంచుకోవడానికి అనుమతివ్వడం వెనుక మతలబు ఉందన్న విమర్శలొచ్చాయి. ఉగాది పండుగకు ఇచ్చిన చంద్రన్న కానుక.. అమలులో రూ.75 కోట్ల మేర గోల్‌మాల్ జరిగిందని, పెద్దఎత్తున ముడుపులు ముట్టాయని అప్పట్లోనే నెత్తీనోరు మొత్తుకున్నారు. ఇకపోతే రాష్ట్రం ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతోందని, రైతులకు రుణమాఫీకి డబ్బులు లేవని, రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్‌లో ఉందని ప్రకటించిన ప్రభుత్వం.. 2008 నుంచి ఉన్న బకాయిల ఫైలు దుమ్ము దులిపి ఏడాది చివరలో ఏకంగా రూ.2,062 కోట్లను పారిశ్రామిక రాయితీల పేరుతో విడుదల చేయడం వెనుక 30 శాతం సొమ్ము చేతులు మారినట్టు ఆరోపణలు వినిపించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధర భారీగా పడిపోయినప్పటికీ ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన వైనంపైనా విమర్శలున్నాయి.
డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేయకపోగా ఆ సంఘాలకే ఇసుక రీచ్‌లను అప్పగిస్తున్నట్టు ఆర్భాటంగా ప్రకటించి ఆ సంఘాల మాటున పెద్ద ఎత్తున ఇసుక దందా సాగించడం ద్వారా ఇప్పటికే రూ.600 కోట్ల మేరకు చేతులు మారినట్టు ఆరోపణలు రావడమే కాకుండా పలు ఘటనల్లో విజిలెన్స్ సైతం నిగ్గు తేల్చింది. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న అనేక నిర్ణయాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో.. తెలంగాణలోనే ఏం ఖర్మ ఏ రాష్ట్రంలోనైనా డబ్బు వెదజల్లడానికి సిద్ధపడుతారని విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. విచ్చలవిడిగా డబ్బు సమకూరుతున్న దశలో ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎక్కడి నుంచి మళ్లిస్తున్నారు? వంటి అంశాలపై తల బాదుకోవలసిన అవసరం లేదని రాజకీయ విమర్శకులంటున్నారు. పక్క రాష్ట్రం అయినందున అంతమేరకు ఎర చూపించారని, అదే సొంత రాష్ట్రంలో ఇలాంటి వ్యవహారాలపై మరింత ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
అడ్డంగా దొరికిన వైనంపై..
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును అయిదు కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి రేవంత్‌రెడ్డిని సాధనంగా వాడుకున్న వైనంపై ఏపీకి చెందిన టీడీపీ నేతలు పెదవి విప్పడం లేదు. సోమవారం సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం కూడా ఎంతో గంభీర వాతావరణంలో సాగింది. గతంలో ఉదయం నుంచి రాత్రి దాదాపు పది, పన్నెండు గంటల వరకు కేబినెట్ సమావేశాలు కొనసాగించిన చంద్రబాబు.. సోమవారం మాత్రం మధ్యాహ్నానికే, నాలుగు గంటల్లోనే ముగించారు. రేవంత్‌రెడ్డి అనుభవలేమితో దుందుడుకుగా వ్యవహరించి పార్టీకి ఇబ్బంది తెచ్చారని కొందరు మంత్రులు సమావేశంలో ప్రస్తావించగా, ఈ అంశానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వొద్దని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.