వైట్‌ టాప్‌.. రోడ్లన్నీ టిప్‌టాప్‌ | White top roads to be implemented in hydearabad | Sakshi
Sakshi News home page

వైట్‌ టాప్‌.. రోడ్లన్నీ టిప్‌టాప్‌

Published Sun, Apr 9 2017 2:18 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

వైట్‌ టాప్‌.. రోడ్లన్నీ టిప్‌టాప్‌ - Sakshi

వైట్‌ టాప్‌.. రోడ్లన్నీ టిప్‌టాప్‌

రూ.2,593 కోట్లతో నగర రహదారులకు మెరుగులు
- రూ.1,275 కోట్లతో వైట్‌ టాపింగ్‌ రోడ్లు
- మరో రూ.1,318 కోట్లతో మోడల్‌ బీటీ రోడ్లు
- రోడ్లతోపాటే వివిధ సదుపాయాలకు డక్టింగ్, వరదకాలువలు
- బెంగళూరు తరహాలో పనులు
- ఇప్పటికే జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఆమోదం
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. అనుమతిరాగానే పనులు


సాక్షి, హైదరాబాద్‌: వేసవి కాలమైనప్పటికీ గడచిన రెండు మూడు రోజులుగా హైదరాబాద్‌ నగరంలో వానజల్లులు పడుతున్నాయి. అదే తరుణంలో ట్రాఫిక్‌ సమస్యలు తప్పడం లేవు. అక్కడక్కడా అప్పుడే నీటి ముంపు సమస్య కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే వర్షాకాలం నరకమే. గత ఏడాది భారీ వర్షాల సందర్భంగా ఎదురైన చేదు అనుభ వాలతో నగర రహదారుల్ని.. ముఖ్యంగా ఎక్కువమంది ప్రయాణించే ప్రధాన రహ దారుల్లో వాన నీరు నిలువకుండా చేసేందుకు రోడ్లను అభివృద్ధి చేయాలన్న మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా రాబోయే వర్షాకాలానికి ప్రధాన రహదారుల్ని రెండు రకాలుగా మెరుగుపరచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగం గా 47 ప్రధాన రహదారుల మార్గాలను వైట్‌ టాపింగ్‌ రోడ్లుగా మార్చేందుకు, మరో 31 రహదారులను నీరు నిలువకుండా సరిచేయడం.. తదితర పనులతో మోడల్‌ బీటీ రోడ్లుగా అభివృద్ధి పరచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ఇందుకుగాను వైట్‌ టాపింగ్‌ రోడ్లకు రూ.1,275 కోట్లు.. మోడల్‌ బీటీ రోడ్లకు రూ.1,318 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. వీటికి ఇప్పటికే జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఆమోదం పొందారు. అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించేందుకు త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం ముందు అంచనాలను ఉంచనున్నారు. ప్రభుత్వం ఈ నిధులను ఇవ్వని పక్షంలో యాన్యుటీ విధానంలోనైనా, లేదా ఆర్థిక సంస్థల నుంచి రుణాలతోనైనా చేపట్టాలని భావిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు లభించగానే పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోడ్లు నిర్మించాక తిరిగి తవ్వకుండా ఉండేందుకు జలమండలి, విద్యుత్‌ విభాగాలకు సంబంధించిన పనులేవైనా ఉంటే.. నిర్మాణానికి ముందే పూర్తిచేయాల్సిందిగా వారికి సూచించారు.

వివిధ అవసరాలకు డక్టింగ్‌..
కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించాక తిరిగి తవ్వకుండా ఉండేందుకు ఆయా విభాగాల పనులను ముందే పూర్తిచేసుకోవాల్సిందిగా సూచించడంతో పాటు విద్యుత్, కేబుల్‌ లైన్ల భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా డక్టింగ్‌ (పైప్‌లైన్‌ తరహా నిర్మాణం) ఏర్పాటు చేయనున్నారు.

వరద కాలువలు కూడా..
వర్షం కురిశాక నీరు రోడ్లపై నిలువ ఉండకుండా సాఫీగా ప్రయాణించేందుకు సన్నని వరదకాలువల్ని రోడ్డుకు రెండు వైపులా నిర్మించనున్నారు. రోడ్లను సరైన కేంబర్‌(వాలుతో)తో నిర్మిస్తారు. తద్వారా రోడ్లపై నీరు నిల్వ ఉండదు. వైట్‌ టాపింగ్‌ రోడ్లతోపాటు మోడల్‌ బీటీ రోడ్లకు సైతం వీటిని అమలు చేయనున్నారు.

బెంగళూరులో అధ్యయనంతో..
బెంగళూరులోని వైట్‌ టాపింగ్, మోడల్‌ బీటీ రోడ్లను మేయర్‌ బొంతు రామ్మోహన్, అధికారులు పరిశీలించారు. వర్షపు నీరు రోడ్లపై నిలువకుండా అక్కడ రోడ్ల నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలు మంచి ఫలితాలిస్తుండటంతో అదే మాదిరిగా ఇక్కడ కూడా పనులు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

కాంట్రాక్టర్లకే 5 ఏళ్ల నిర్వహణ..
ఒకసారి ఈ రోడ్లు వేశాక ఐదేళ్ల వరకు మరమ్మతుల బాధ్యత కూడా సంబంధిత కాంట్రాక్టర్లకే అప్పగించనున్నారు. వేసిన మూణ్నాళ్లకే రోడ్లు దెబ్బతింటుండంతో ఈ రోడ్ల నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టు సంస్థలకే అప్పగించనున్నారు. తొలి రెండేళ్లు డిఫెక్ట్‌ లయబిలిటీ కింద ఈ బాధ్యతలను వారే నిర్వహిస్తారు. అనంతరం మరో మూడేళ్లకు నామమాత్రపు వ్యయంతో నిర్వహణ బాధ్యతలు చూడాల్సి ఉంటుంది.

వైట్‌ టాపింగ్‌కు ప్రతిపాదించిన మార్గాలు..
1. లిబర్టీ (అంబేడ్కర్‌ విగ్రహం)– బషీర్‌బాగ్, 2. లక్‌డీకాపూల్‌– మెహదీపట్నం, 3. దుర్గంచెరువు – జేఎన్‌టీయూ, 4. ఆర్‌పీ రోడ్, 5.చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి – కాచిగూడ, 6. కాచిగూడ – రెజిమెంటల్‌ రోడ్, 7. సీతాఫల్‌ మండి రోడ్, 8. విద్యానగర్‌ జంక్షన్‌–ఓయూ క్యాంపస్‌ రోడ్‌ , 9. ఇందిరా పార్కు రోడ్, 10. ఐమాక్స్‌ – సెక్రటేరియట్‌. 11. లిబర్టీ – ఫీవర్‌ హాస్పిటల్, 12. కార్వాన్‌ – నానల్‌నగర్, 13. లంగర్‌హౌస్‌ క్రాస్‌ రోడ్‌ – పురానాపూల్, 14. చార్మినార్‌ – ఫలక్‌ నుమా డిపో (చాంద్రాయణగుట్ట ఫ్లైౖ ఓవర్‌)15. కొత్తపేట – సరూర్‌నగర్, 16.కొత్తపేట క్రాస్‌రోడ్‌ – నాగోల్, 17. వనస్థలిపురం – బీఎన్‌రెడ్డి నగర్, 18. మూసారంబాగ్‌ రోడ్, 19. జిందాతిలిస్మాత్‌ రోడ్, 20. మినిస్టర్‌ రోడ్, 21. ఎలిఫెంటా హౌస్‌ రోడ్, అమీర్‌పేట, 22. వసంతనగర్‌ రోడ్‌ (ఫేజ్‌ 9), 23. కేపీహెచ్‌బీ – ఫేజ్‌1 రోడ్, 24. కిషన్‌బాగ్‌ క్రాస్‌రోడ్స్‌ – పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే పిల్లర్‌ నంబర్‌ 202, 25. దుర్గానగర్‌ క్రాస్‌రోడ్స్‌ – కర్నూల్‌ రోడ్, 26. కోఠి ఆంధ్రాబ్యాంక్‌ – కోఠి ఉమెన్స్‌ కాలేజ్, 27. హైదర్‌గూడ క్రాస్‌రోడ్స్‌(పిల్లర్‌ నంబర్‌ 143 పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే) – కిషన్‌బాగ్‌ క్రాస్‌రోడ్, 28. ఆయకార్‌భవన్‌ రోడ్‌ – హైదర్‌గూడ రోడ్, 29.బాగ్‌లింగంపల్లి వైఎంసీఏ – బర్కత్‌పురా, 30. అషూర్‌ఖానా జంక్షన్‌ – చార్మినార్‌ బస్టేషన్‌ , 31. చంచల్‌గూడ – డబీర్‌పురా దర్వాజ, 32. ఎల్‌బీనగర్‌ – సైదాబాద్, 33. మెడ్‌ప్లస్‌ – సాహెబ్‌నగర్‌ కాలనీ రోడ్, 34. శివం రోడ్, 35. వీఎస్‌టీ – రాంనగర్, 36. బాగ్‌ లింగంపల్లి – వీఎస్‌టీ, 37. ఆడిక్‌మెట్‌ రోడ్, 38. ఎస్‌డీ రోడ్, 39. శ్రీనగర్‌కాలనీ రోడ్, 40. బొటానికల్‌ గార్డెన్‌ రోడ్‌ – కొత్తగూడ, 41. అంజయ్య నగర్‌ – కేపీహెచ్‌బీ, 42. శాలిబండ క్రాస్‌రోడ్‌ – సిటీ కాలేజ్, 43. రెడ్‌హిల్స్, 44. మాసాబ్‌ట్యాంక్‌ – మల్లేపల్లి, 45. మెహదీపట్నం – తాళ్లగడ్డ, 46. సరూర్‌నగర్‌ – దిల్‌సుఖ్‌నగర్, 47. ఆడిక్‌మెట్‌ రోడ్‌ – రాంనగర్‌.

పై 47 మార్గాల్లో 119.22 కి.మీ.ల మేర వైట్‌ టాపింగ్‌ నిర్మాణానికి రూ. 552.92 కోట్లు ఖర్చు కానుండగా, డక్టింగ్, వరద కాలువల నిర్మాణంతో కలిపి మొత్తం రూ. 1275 కోట్లు ఖర్చు కానుందని అధికారులు అంచనా వేశారు.

- బీటీ రోడ్ల కంటే వైట్‌ ట్యాపింగ్‌ రోడ్ల పైన మందం తక్కువగా ఉంటుంది.
- పనులు త్వరగా పూర్తవుతాయి.
- నిర్వహణ వ్యయం తక్కువ. నీటి నిల్వ ఉండదు
- రాత్రి వేళల్లో  తక్కువ విద్యుత్‌ కాంతి సరిపోతుంది.
- ఈ రోడ్డు పర్యావరణహితం.
- నగరంలోని ట్రాఫిక్‌ రద్దీకి ఈ రోడ్లు ఎంతో అనుకూలమైనవి.  

మేలైన వైట్‌ టాపింగ్‌..
నగరంలో ఇప్పటికే రెండు ప్రాంతాల్లో నిర్మించిన వైట్‌ టాపింగ్‌ రోడ్లపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో వైట్‌ టాపింగ్‌కు ప్రాధాన్యత నిచ్చారు. సిమెంటు ఉత్పత్తిదారుల సమాఖ్య బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌ 10లో వైట్‌టాపింగ్‌ రోడ్‌ నిర్మించగా, జీహెచ్‌ఎంసీ ప్రయోగాత్మకంగా పెండర్‌ఘాస్ట్‌ రోడ్‌లో నిర్మించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement