విలేకరులతో మాట్లాడుతున్న రామాగౌడ్ కూతురు వసుధ
పార్టీ మారనందుకే
‘‘మా నాన్నను తెలుగుదేశం పార్టీ విడిచి టీఆర్‌ఎస్‌లో చేరాలని ఒత్తిడి తెచ్చారు. ఊల్లె సర్పంచ్ భర్త, ఇతరులు ఎన్నో రకాలుగా వేధించారు. అయినా నాన్న పార్టీ మారలేదు. భూములను కబ్జా చేస్తున్నారని బయటపెట్టిండు. దీంతో వాళ్లు కక్ష పెంచుకొని అట్రాసిటీ కేసు పెట్టిండ్రు. దీంతో మా నాన్న చనిపోయిండు. ఇది రాజకీయ హత్య. దీనికి కారణం సర్పంచ్ భర్త, ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నాయకులే. వాళ్లపై కూడా కేసు పెట్టాలి’’ అని రామాగౌడ్ కూతురు వసుధ, భార్య సరస్వతి రోదిస్తూ విలేకరులకు తెలిపారు.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ మంచిర్యాలసిటీ : అధికార పార్టీ నాయకులను ఎదిరించి... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరుక్కొని తనువు చాలించిన రామాగౌడ్ ఉదంతంలో అధికార యంత్రాంగం కుప్పిగంతులు వేస్తోంది. నెన్నెల మండలంలో పల్ల మహేష్ అనే వ్యక్తికి ఎస్టీ ధ్రువీకరణ పత్రం జారీ చేసిన రెవెన్యూ శాఖతో పాటు రాజకీయ కుట్రను అట్రాసిటీ కింద నిర్ధారించి రామాగౌడ్‌పై కేసు నమోదు చేసిన పోలీస్‌శాఖ ఇప్పుడు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో మునిగిపోయాయి. ప్రజా ఫిర్యాదుల విభాగంలో పిటిషన్ ఇచ్చిన 20 రోజులకు సైతం న్యాయం చేయని జిల్లా కలెక్టర్ కార్యాలయం ‘సాయంత్రం లోగా తహసీల్దార్ నుంచి నివేదిక వస్తుందని చెప్పినా... రామాగౌడ్ తొందరపడి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని’ ఓ ప్రకటన విడుదల చేసి తప్పించుకొంది. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు చేసిన తప్పిదం ఓ నిండు ప్రాణం పోవడానికి కారణం కాగా... బాధ్యులపై చర్యలు తీసుకునే విషయంలో రెండు శాఖలు ఆచితూచి వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్ జరిగిన సంఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాల్సిందిగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ పీఎస్.రాహుల్‌రాజ్‌ను నియమించారు.
ఎస్టీ కుల ధ్రువీకరణ అంత ఈజీనా..?
నెన్నెలలో పెద్దచెరువు శిఖం భూమిలో శెనగ పంట వేసిన పల్ల మహేష్ అనే వ్యక్తికి సర్పంచి అస్మా, ఆమె భర్త మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం అండదండలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ మండల అధ్యక్షుడైన రామాగౌడ్ సర్పంచ్ దంపతులను టార్గెట్ చేస్తూ పత్రికలకెక్కాడు. దీన్ని జీర్ణించుకోలేని నాయకులు పల్ల మహేష్‌ను అస్త్రంగా వాడుకున్నారనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో పల్ల మహేష్ రామాగౌడ్‌పై డిసెంబర్ 13న అట్రాసిటీ కింద కేసు పెట్టాడు. తండ్రి బీసీ, తల్లి ఎస్టీ అయిన వ్యకి ఎస్టీ అట్రాసిటీ కింద ఫిర్యాదు చేయగానే పోలీసులు కేసు నమోదు చేయడం వెనుక కారణాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. వీఆర్‌వో విచారణ నివేదిక గానీ, అఫిడవిట్ గానీ లేకుండా ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం ఎలా మంజూరవుతుందనేది ప్రశ్న. ఈ వ్యవహారంలో తహసీల్దార్ రాజకీయ ఒత్తిళ్లతోనే కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేసినట్లు స్పష్టమవుతోంది. అలాగే తహసీల్దార్ ఇచ్చిన ఎస్టీ సర్టిఫికేట్‌తో రామాగౌడ్ అనే వ్యక్తి మహేష్‌ను కులం పేరుతో దూషించిన ఆరోపణను ధ్రువీకరించుకోకుండా కేసు నమోదు చేసిన సీఐ, విచారణ జరిపిన ఏసీపీలు కూడా రాజకీయ ఒత్తిళ్లకే లొం గారని రూఢీ అవుతోంది. ఈనెల 2న గౌడజన హక్కుల పోరాట సమితి నాయకులు కలెక్టర్‌ను కలిసి ఈ అంశాలను వివరిస్తూ ఫిర్యాదు చేయడమే కాకుండా మహేష్ చెల్లెలుకు ఇచ్చిన బీసీ కుల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను కూడా అందజేశారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కొంచెం నిజాయితీగా వ్యవహరించినా నిండు ప్రాణం బలయ్యేది కాదనేది సత్యం.
నేడు బంద్‌కు పిలుపు
రామాగౌడ్ ఆత్మహత్యకు కారణమైన అధికారులు, నాయకులపై చర్యలు తీసుకోవాలని, రామాగౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా బంద్‌కు బుధవారం అఖిలపక్షం పిలుపునిచ్చింది. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో సాగుతున్న దురాగతాలకు చరమగీతం పాడేందుకు ఈ నియోజకవర్గంలో జనజీవనాన్ని స్తంభింపజేయాలని పిలుపునిచ్చినట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శరత్‌బాబు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలన్నీ ఈ బంద్‌లో పాల్గొంటాయని తెలిపారు.
కనిపించని అధికార పార్టీ నేతలు
రామాగౌడ్ ఆత్మహత్య జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాలను కదిలించింది. టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పక్షాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో రామాగౌడ్ మృతదేహానికి పోస్టుమాస్టం నిర్వహించిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదే సమయంలో బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి తాండూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల ముఖ్య నాయకులను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ స్వయంగా నెన్నెలకు చేరుకొని శవయాత్రలో పాల్గొన్నారు. ఇంత జరుగుతున్నా టీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులెవరూ దరిదాపుల్లో కనిపించలేదు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ నాయకులు రామాగౌడ్ కుటం బాన్ని ఆదుకోవాలని, తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన అ«ధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం మంచిర్యాల డీఆర్‌ఓ ప్రియాంకతో పాటు రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్‌కు వినతిపత్రం అందజేశారు.
నష్టపరిహారం ఇప్పిస్తాం
రామాగౌడ్ కుటుంబసభ్యులకు నష్టపరిహారం మంజూరు చేయడానికి కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నాం. పరిహారంతో పాటు కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి కూడా ప్రతిపాదనలు పంపుతున్నాం. బాధిత కుటుంబాన్న ?అన్ని విధాలుగా ఆదుకుంటాం. – ఆర్డీఓ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment