Rahul raj
-
ని‘వేదనలు..’ ప్రజావాణికి వినతుల వెల్లువ*
ఆదిలాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణికి ఈ వారం వినతులు వెల్లువెత్తాయి. తమ ఆవేదనను ఉన్నతాధికారులకు నివేదించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదనపు కలెక్టర్లు శ్యామాలాదేవి, ఖుష్బూగుప్తాతో కలిసి కలెక్టర్ రాహుల్‌రాజ్ అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల అర్జీ లను సంబంధిత శాఖ అధికారులకు అందజేస్తూ పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. అలాగే గ్రీవెన్స్‌కు జిల్లాస్థాయి అధికారులంతా తప్పనిసరిగా హాజరువాలన్నారు. కాగా అర్జీల స్వీకరణ సమయంలో కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించడంతో బాఽధితులు గంటన్నర పాటు బయటే ఇబ్బందులు పడుతూ నిరీక్షించాల్సి వచ్చింది. అర్జీల స్వీకరణ సమయంలో సమావేశాల నిర్వహణ ఏంటంటూ పలువురు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వారం అందిన అర్జీల్లో అత్యధికంగా ఆసరా పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, స్వయం ఉపాధి కల్పన, రుణాల మంజూరు వంటివి ఉన్నాయి. బాధితుల్లో కొందరి నివేదన వారి మాటల్లోనే.. రెండేళ్లుగా వేతనాల్లేవ్.. మేమంతా జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 15 ఏళ్లుగా ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నాం. వేతనాలు తక్కువే అయినా మా పిల్లలనే ఉద్దేశంతో బాధ్యతగా సేవలందిస్తున్నాం. అలాంటి మా కు రెండేళ్లుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించట్లేదు. ఏఎన్ఎం పోస్టుల భర్తీ కోసం ఇటీవల చేపట్టిన నియామక ప్రక్రియలోఎంపికయ్యాం. కానీ కొంతమంది కోర్టుకు వెళ్లడంతో మమ్మల్ని విధులకు రావద్దని అధికారులు చెబు తున్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించకపోగా ఉపాధి దూరం చేసే పరిస్థితి నెలకొంది. మమ్ముల్ని యథావిధిగా కొనసాగిస్తూ వేతనాలు చెల్లించాలి. – ఆశ్రమ పాఠశాలల ఏఎన్ఎంలు బోర్లకు అడ్డుపడుతున్నరు మేమంతా ఆదివాసీ గిరిజన రైతులం. గిరి వికాసం పథకం కింద మా వ్యవసాయ భూములకు బోరుబావి,త్రీఫేజ్ విద్యుత్ మంజూరైంది. కరెంట్ సౌకర్యం కల్పించగా.. బోరుబావులు వేసుకుందామంటే అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నరు. గ్రామంలోకి మిషన్లను రాకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నరు. బోరు బావుల తవ్వకానికి అనుమతిచ్చి యాసంగి పంటల సాగుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం. – గిరిజై గ్రామస్తులు, బజార్హత్నూర్ పట్టా చేయడం లేదు నా భర్త గుండెన ఎల్లన్న పేరిట ఆ దిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్‌లో గల సర్వేనంబర్ 47/2/9లో 1.12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన చనిపోవడంతో ఆ భూమిని నా పేరిట పట్టా చేసి ఇవ్వాలని తహసీల్దార్‌కు దరఖాస్తు పెట్టిన. ఐదేళ్లుగా ఆఫీస్ చుట్టూ నా నలుగురు బిడ్డలతో కలిసి తిరుగుతూనే ఉన్నా. అయినా అధికారులెవరు కనికరించట్లేదు. దయచేసి విచారణ జరిపించి నా పేరిట పట్టా చేసి ఆదుకోవాలని కోరుతున్నా.– గుండెన రాంబాయి, ఆదిలాబాద్ షెడ్లు కేటాయించాలి మేమంతా చిరు వ్యాపారులం. పట్టణంలోని రోడ్లపై వివిధ వ్యాపారాలతో కుటుంబాలను పోషించుకుంటున్నాం. పట్టణంలోని డైట్ కళాశాల వద్ద గల షెడ్లను మేము ఏర్పాటు చేసుకుంటే మున్సిపల్ అధికారులు ఇటీవల తొలగించారు. దీంతో ఉపాధికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. బల్దియా నిర్మించే షెడ్లను కేటాయించి ఆదుకోవాలని కలెక్టర్‌కు విన్నవించాం. – చిరు వ్యాపారులు, ఆదిలాబాద్ అనుమతి లేదని కూల్చేశారు సర్వేనంబర్ 170లోని ప్లాట్ నంబర్ 428లో రేకుల ఇల్లు నిర్మించుకున్న. గ్రామ పంచాయతీలో ట్యాక్స్ కూడా కట్టిన. కానీ ఇంటికి బల్దియా నుంచి అనుమతి లేదనే కారణంతో మున్సిపల్ అధికారులు నా ఇంటిని కూల్చివేశారు. ఎన్నో ఇళ్లు అనుమతి లేకుండా నిర్మించినవి ఉన్నప్పటికి కేవలం నా ఒక్క ఇంటిని మాత్రమే కూల్చివేసి నష్టం చేశారు. దీనిపై విచారించి నాకు న్యాయం చేయాలి. – బత్తుల రాములు, మావల. -
ఔను..! నిజంగానే కలెక్టర్‌కు కోపమొచ్చింది!
ఆదిలాబాద్: కలెక్టర్‌కు కోపమొచ్చింది.. ఎప్పుడు శాంతంగా, సరదాగా కన్పించే రాహుల్‌రాజ్ తొలిసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ప్రజావాణి అర్జీలు పెండింగ్‌లో ఉంచిన అధికారులను తీవ్రంగా మందలించిన కలెక్టర్, పది, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. తన అనుమతి లేకుండా అధికారులేవరూ సెలవులో వెళ్లవద్దని ఆదేశించిన కలెక్టర్ ప్రజావాణిని లైట్‌గా తీసుకుంటే సహించబోనని కాస్త గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు. అర్జీదారులు వచ్చిన రాకపోయినా ప్రతి జిల్లా స్థాయి అధికారి ఉదయం 10.30 గంటలకు సోమవారం జరిగే ప్రజావాణికి విధిగా రావాలని లేకుంటే కుదరని తెల్చిచెప్పారు. ఈ నెల 21 న హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్ష ఉన్నందున జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించి ప్రగతి నివేదికలను సంక్షిప్త సమాచారంతో మంగళవారం సాయంత్రంలోగా అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో హాజరు శాతం పెంచడంతో పాటు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం గుండె పోటుతో మరణించిన భీంపూర్ తహసీల్దార్ నారాయణ మృతికి సంతాప సూచకంగా అధికారులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇవి చదవండి: ‘గృహలక్ష్మి’ దరఖాస్తులు పరిశీలించొద్దు! -
కోడ్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు.. : రాహుల్‌రాజ్
సాక్షి, ఆదిలాబాద్: 'జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈవీఎంలు, ఎన్నికల అధికారుల ర్యాండమైజేషన్ను పూర్తి చేసి నియోజకవర్గాల వారీగా కేటాయించాం. పీవోలు, ఏపీవోలకు శిక్షణ కొనసాగుతోంది. గురువారం నుంచి బ్యాలెట్ యూనిట్ల కమిషనింగ్ ప్రక్రియ చేపడుతాం. సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగేలా వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతీ ఓటరు మొబైల్లో సీ–విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రలోభాలకు గురిచేసినట్లు తెలిస్తే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అలాగే ఓటర్లంతా స్వేచ్ఛగా ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పోలింగ్ శాతం పెంపు కోసం ిస్వీప్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈమేరకు బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడించారు.' సాక్షి: జిల్లాలో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య ఎంత..? ఎన్నికల నిర్వహణకు ఎంతమంది సిబ్బందిని నియమించారు? కలెక్టర్: జిల్లాలో 4,48,374 మంది ఓటర్లున్నారు. వీరి కోసం 592 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 290, బోథ్ నియోజకవర్గంలో 302 ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం 4వేల మంది సిబ్బందిని నియమించాం. సాక్షి: ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేపడుతున్నారు..? కలెక్టర్: ఈవీఎంలు, పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ను పూర్తి చేసి నియోజకవర్గాల వారీగా కేటా యించాం. పీవో ఏపీవోలకు రెండు రోజులుగా శిక్షణ ఇస్తున్నాం. ఓపీవోలకు గురువారం నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. రూట్, సెక్టోరల్ అధికారులను నియమించాం. పోలింగ్‌కు అవసరమైన సా మగ్రి అంతా ఇప్పటికే జిల్లాకు చేరుకుంది. దాని డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాన్ని స్థానిక టీటీడీసీలో ఏర్పాటు చేస్తున్నాం. స్ట్రాంగ్ రూంలతో పాటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కూడా అక్కడే చేపడుతాం. సాక్షి: జిల్లాలో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉ న్నారు.బ్యాలెట్యూనిట్ల వినియోగంఎలాఉంది..? కలెక్టర్: 15 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉంటే 2 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 25 మంది అభ్యర్థులు ఉన్నందున రెండు ఏర్పాటు చేస్తున్నాం. బోథ్ నియోజకవర్గంలో 10 మంది అభ్యర్థులున్నారు. వారి గుర్తులు, వీవీ ప్యాట్స్ కమిషనింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆరుగురు ఇంజనీర్లు నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఈ ప్రక్రియను చేపడుతారు. సాక్షి: పోస్టల్ బ్యాలెట్‌కు ఎంత మంది సిబ్బందిని వినియోగించనున్నారు. వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు.? కలెక్టర్: జిల్లాలో 4వేల మంది సిబ్బందిని పోస్టల్ బ్యాలెట్‌కు వినియోగించనున్నాం. ట్రైనింగ్ సెంట ర్లో ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. అక్క డ ఎంత మంది ఓటర్లు ఓటు వేశారనే వివరాలు రావాల్సి ఉన్నాయి. ఎవరైన ఆలస్యంగా వచ్చి ఉంటే ఓటేసేందుకు వీలుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. పోలీసు ఉద్యోగుల కోసం ఇక్కడే ప్రత్యేకంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. సాక్షి: జిల్లా వ్యాప్తంగా ఎన్ని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. వాటిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? కలెక్టర్: జిల్లాలో 301 సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నాం. మరో 78 పోలింగ్ కేంద్రాల్లో బయట సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు వీలుగా ప్రత్యేక బలగాలను మోహరించనున్నాం. సాక్షి: ఓటింగ్ శాతం పెంచడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టారు..? కలెక్టర్: ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా స్విప్ ద్వారా బైక్, ఆటోలతో ప్రచారంతో పాటు కలెక్టరేట్లో సెల్ఫీ పాయింట్ ద్వారా అవగాహన కల్పించాం. వృద్ధులు, యువత, దివ్యాంగులతో ర్యాలీలు చేపట్టాం. యువత కోసం రంగోలి పోటీలు ఏర్పాటు చేశాం. గతంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైన కేంద్రాల్లో ఈ సారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గాను పాఠశాలల విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు ఓటు సంకల్ప పత్రాలను పంపించాం. సాక్షి: ప్రలోభాల కట్టడికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? కలెక్టర్: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి మద్యం, డబ్బు ప్రవాహం జరగకుండా కట్టడి చేస్తున్నాం. జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతున్నాం. ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్ సర్వైలెన్స్ టీమ్, వీడియోగ్రఫీ బృందాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంచాం. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, కోడ్‌ను ఉల్లంఘించినా ప్రజలు నిర్భయంగా సీ–విజిల్ యాప్ ద్వారా ఫి ర్యాదు చేయాలి. ఫిర్యాదు అందిన వంద నిమిషా ల్లోపు వారిపై చర్యలు తీసుకుంటాం. సాక్షి: ఇప్పటివరకు మోడల్ కోడ్ ఉల్లంఘన కేసులేమైనా నమోదయ్యాయా. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? కలెక్టర్: జిల్లాలో 17 మోడల్ కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో 16 కేసుల్లో బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఒక కేసు తప్పని తేలడంతో దాన్ని తిరస్కరించాం. సాక్షి: పోల్ చీటీల పంపిణీ ఎంత వరకు జరిగింది. ఎప్పటివరకు పూర్తవుతుంది..? కలెక్టర్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ఓటరుకు పోల్ చీటీలను అందించేలా గత శుక్రవారం నుంచి పంపిణీని షురూ చేశాం. 95 శాతం వరకు పూర్తయింది. ప్రస్తుతం షిఫ్టెడ్, డెలిటెడ్ వంటి వివరాలను బీఎల్వోల నుంచి సేకరిస్తున్నాం. సాక్షి: పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు..? కలెక్టర్: ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో షామియానాలు, కుర్చీ లు, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నాం. దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్చైర్లతో పాటు ఒక సహాయకుడిని అందుబాటులో ఉంచుతాం. -
TS Election 2023 పోలింగ్‌శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ రాహుల్ రాజ్
ఆదిలాబాద్: రానున్న ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్పరాజ్ అహ్మద్ బుధవారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో తక్కువగా పోలింగ్ శాతం నమోదైన ప్రాంతాలను గుర్తించామన్నారు. అక్కడ పోలింగ్‌శాతం మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. ఓటరు లింగ నిష్పత్తి తక్కువ ఉన్న ప్రాంతాల్లో మహిళా ఓటర్ల నమోదుపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఎన్నిక ల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ, డీవైఎస్వో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు..
ఆదిలాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల తయారీ తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ముందుగా ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా రూపకల్పనపై వారి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర ఓటరు జాబితాను ఈ నెల 21 అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 1,350 కంటే ఎక్కువ ఓటర్లున్న పోలింగ్ కేంద్రం పరిధిలో అదనంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో తొమ్మిది నూతన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాలుగు కేంద్రాలను మరోచోటుకు మార్చినట్లు తెలిపారు. ఓటర్లు వారి పోలింగ్ కేంద్రాన్ని జాబితాలో సరిచూసుకోవాలని సూచించారు. జిల్లాలో 592 పోలింగ్ కేంద్రాలున్నాయని, అందులో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 290, బోథ్ నియోజకవర్గంలో 302 ఉన్నాయని తెలిపారు. బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను అందించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు అన్ని పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ తదితరులు పాల్గొన్నారు. -
దోషులు ఎవరు?
పార్టీ మారనందుకే ‘‘మా నాన్నను తెలుగుదేశం పార్టీ విడిచి టీఆర్ఎస్లో చేరాలని ఒత్తిడి తెచ్చారు. ఊల్లె సర్పంచ్ భర్త, ఇతరులు ఎన్నో రకాలుగా వేధించారు. అయినా నాన్న పార్టీ మారలేదు. భూములను కబ్జా చేస్తున్నారని బయటపెట్టిండు. దీంతో వాళ్లు కక్ష పెంచుకొని అట్రాసిటీ కేసు పెట్టిండ్రు. దీంతో మా నాన్న చనిపోయిండు. ఇది రాజకీయ హత్య. దీనికి కారణం సర్పంచ్ భర్త, ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకులే. వాళ్లపై కూడా కేసు పెట్టాలి’’ అని రామాగౌడ్ కూతురు వసుధ, భార్య సరస్వతి రోదిస్తూ విలేకరులకు తెలిపారు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ మంచిర్యాలసిటీ : అధికార పార్టీ నాయకులను ఎదిరించి... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరుక్కొని తనువు చాలించిన రామాగౌడ్ ఉదంతంలో అధికార యంత్రాంగం కుప్పిగంతులు వేస్తోంది. నెన్నెల మండలంలో పల్ల మహేష్ అనే వ్యక్తికి ఎస్టీ ధ్రువీకరణ పత్రం జారీ చేసిన రెవెన్యూ శాఖతో పాటు రాజకీయ కుట్రను అట్రాసిటీ కింద నిర్ధారించి రామాగౌడ్‌పై కేసు నమోదు చేసిన పోలీస్‌శాఖ ఇప్పుడు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో మునిగిపోయాయి. ప్రజా ఫిర్యాదుల విభాగంలో పిటిషన్ ఇచ్చిన 20 రోజులకు సైతం న్యాయం చేయని జిల్లా కలెక్టర్ కార్యాలయం ‘సాయంత్రం లోగా తహసీల్దార్ నుంచి నివేదిక వస్తుందని చెప్పినా... రామాగౌడ్ తొందరపడి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని’ ఓ ప్రకటన విడుదల చేసి తప్పించుకొంది. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు చేసిన తప్పిదం ఓ నిండు ప్రాణం పోవడానికి కారణం కాగా... బాధ్యులపై చర్యలు తీసుకునే విషయంలో రెండు శాఖలు ఆచితూచి వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ జరిగిన సంఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాల్సిందిగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ పీఎస్.రాహుల్‌రాజ్‌ను నియమించారు. ఎస్టీ కుల ధ్రువీకరణ అంత ఈజీనా..? నెన్నెలలో పెద్దచెరువు శిఖం భూమిలో శెనగ పంట వేసిన పల్ల మహేష్ అనే వ్యక్తికి సర్పంచి అస్మా, ఆమె భర్త మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం అండదండలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ మండల అధ్యక్షుడైన రామాగౌడ్ సర్పంచ్ దంపతులను టార్గెట్ చేస్తూ పత్రికలకెక్కాడు. దీన్ని జీర్ణించుకోలేని నాయకులు పల్ల మహేష్‌ను అస్త్రంగా వాడుకున్నారనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో పల్ల మహేష్ రామాగౌడ్‌పై డిసెంబర్ 13న అట్రాసిటీ కింద కేసు పెట్టాడు. తండ్రి బీసీ, తల్లి ఎస్టీ అయిన వ్యకి ఎస్టీ అట్రాసిటీ కింద ఫిర్యాదు చేయగానే పోలీసులు కేసు నమోదు చేయడం వెనుక కారణాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. వీఆర్వో విచారణ నివేదిక గానీ, అఫిడవిట్ గానీ లేకుండా ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం ఎలా మంజూరవుతుందనేది ప్రశ్న. ఈ వ్యవహారంలో తహసీల్దార్ రాజకీయ ఒత్తిళ్లతోనే కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేసినట్లు స్పష్టమవుతోంది. అలాగే తహసీల్దార్ ఇచ్చిన ఎస్టీ సర్టిఫికేట్‌తో రామాగౌడ్ అనే వ్యక్తి మహేష్‌ను కులం పేరుతో దూషించిన ఆరోపణను ధ్రువీకరించుకోకుండా కేసు నమోదు చేసిన సీఐ, విచారణ జరిపిన ఏసీపీలు కూడా రాజకీయ ఒత్తిళ్లకే లొం గారని రూఢీ అవుతోంది. ఈనెల 2న గౌడజన హక్కుల పోరాట సమితి నాయకులు కలెక్టర్‌ను కలిసి ఈ అంశాలను వివరిస్తూ ఫిర్యాదు చేయడమే కాకుండా మహేష్ చెల్లెలుకు ఇచ్చిన బీసీ కుల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను కూడా అందజేశారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కొంచెం నిజాయితీగా వ్యవహరించినా నిండు ప్రాణం బలయ్యేది కాదనేది సత్యం. నేడు బంద్‌కు పిలుపు రామాగౌడ్ ఆత్మహత్యకు కారణమైన అధికారులు, నాయకులపై చర్యలు తీసుకోవాలని, రామాగౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా బంద్‌కు బుధవారం అఖిలపక్షం పిలుపునిచ్చింది. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో సాగుతున్న దురాగతాలకు చరమగీతం పాడేందుకు ఈ నియోజకవర్గంలో జనజీవనాన్ని స్తంభింపజేయాలని పిలుపునిచ్చినట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శరత్‌బాబు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలన్నీ ఈ బంద్‌లో పాల్గొంటాయని తెలిపారు. కనిపించని అధికార పార్టీ నేతలు రామాగౌడ్ ఆత్మహత్య జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాలను కదిలించింది. టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పక్షాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో రామాగౌడ్ మృతదేహానికి పోస్టుమాస్టం నిర్వహించిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదే సమయంలో బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి తాండూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల ముఖ్య నాయకులను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ స్వయంగా నెన్నెలకు చేరుకొని శవయాత్రలో పాల్గొన్నారు. ఇంత జరుగుతున్నా టీఆర్ఎస్కు చెందిన నాయకులెవరూ దరిదాపుల్లో కనిపించలేదు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ నాయకులు రామాగౌడ్ కుటం బాన్ని ఆదుకోవాలని, తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన అ«ధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం మంచిర్యాల డీఆర్ఓ ప్రియాంకతో పాటు రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్‌కు వినతిపత్రం అందజేశారు. నష్టపరిహారం ఇప్పిస్తాం రామాగౌడ్ కుటుంబసభ్యులకు నష్టపరిహారం మంజూరు చేయడానికి కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నాం. పరిహారంతో పాటు కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి కూడా ప్రతిపాదనలు పంపుతున్నాం. బాధిత కుటుంబాన్న ?అన్ని విధాలుగా ఆదుకుంటాం. – ఆర్డీఓ శ్రీనివాస్ -
దూకి చస్తానన్న నటి బాయ్ ఫ్రెండ్
ముంబయి: ఇటీవల మృతిచెందిన నటి ప్రత్యూష బెనర్జీ బాయ్ ఫ్రెండ్, ఆమె మృతికి పరోక్షంగా కారణమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న రాహుల్ రాజ్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించాడు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చికిత్స పొందుతున్న ఆస్పత్రి భవనం బాత్ రూంలోకి చొరబడి అందులోని కిటికీలో నుంచి దూకి చనిపోతానని బెదిరించాడు. ప్రత్యూష మరణం తర్వాత రాహుల్ పై ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో అతడు ఈ నెల 3 నుంచి శ్రీ సాయి ఆస్పత్రిలో చేరి మానసిక ఒత్తిడికి చికిత్స పొందుతున్నాడు. అయితే, శుక్రవారం అతడిని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి కనీసం రెండు గంటలపాటు విచారించారు. అనంతరం ఆస్పత్రికి వచ్చిన రాహుల్ .. బాత్ రూంలోకి చొరబడి బయటకు వచ్చేందుకు నిరాకరించాడు. తాను కిందికి దూకి చనిపోతానని బెదిరించడంతో చివరకు వైద్యులు అతడితో ఏదో ఒకలా మాట్లాడి బయటకు రప్పించారు. ఆ తర్వాత కొంత కౌన్సెలింగ్ ఇచ్చారు. -
ప్రత్యూష్ బాయ్‌ఫ్రెండ్ ను విచారించిన పోలీసులు
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్సింగ్ను ముంబై పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. శనివారం రాజ్సింగ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 14 గంటల పాటు ప్రశ్నించారు. ప్రత్యూషతో అనుబంధం, ఆమె ఆత్మహత్యకు గల కారణాల గురించి విచారించారు. ఊపిరి ఆడకపోవడం వల్లే ప్రత్యూష మరణించినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. ప్రత్యూష మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి నేరుగా శ్మశానవాటికను తీసుకెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం ముంబైలోని ప్లాట్‌లో ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
హైవే థ్రిల్లర్!
హైవే నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘రహదారి’. రాజ్, సేదు, పూజా ఉమాశంకర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రాన్ని జి. శ్రీనివాస్ అందిస్తున్నారు. రాహుల్‌రాజ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది.. ‘‘ఈ సినిమా ప్రచార చిత్రం చాలా బాగుంది. సినిమా కూడా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అని ‘మల్టీ డైమన్షన్’ వాసు ఆకాంక్షించారు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు చాలా విభిన్నంగా ఉంటాయని దర్శకుడు తెలిపారు. ఈ వేడుకలో నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్, సాయిరాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సస్పెన్స్ థ్రిల్లర్
ఒక్క రోజులో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం కడవుల్ పాది మిరుగం పాది అని దర్శకుడు రాజ్ తెలిపారు. ఇంతకు ముందు అన్వర్, పైసా పైసా తదితర మలయాళ చిత్రాలను నిర్మించి ఈయన తొలిసారిగా తన సినిప్స్ అండ్ రెడ్ కార్పెట్, బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం కడవుల్ పాది మిరుగం పాది. ఈ చిత్రం వివరాలను ఆయన వెల్లడిస్తూ, ఇది ఒక రోడ్డులో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు. చెన్నై-హైదరాబాద్ ఓల్డ్ హైవేలో ఒక రోజు రాత్రి ప్రారంభమై, మరుసటి రోజు రాత్రి ముగిసే సంఘటనల సమాహారమే చిత్ర కథ అని తెలిపారు. ఒక ప్రేమ జంట, పోలీసులు, ఒక విచిత్ర వ్యక్తి మధ్య నడిచే కథే కడవుల్ పాది మిరుగంపాది చిత్రం అని వివరించారు. చిత్రంలో ఆ విచిత్ర వ్యక్తి పాత్రను తానే పోషిస్తున్నానని, ప్రేమ జంటగా అభిషేక్, మిస్ ఇండియా శ్వేతా విజయ్ నటిస్తున్నారని తెలిపారు. రాహుల్ రాజ్ సంగీ తాన్ని కిషోర్ మణి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 90 శాతం పూర్తి అయ్యిందని చెప్పారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక నిర్మాత రాజ్ వెల్లడించారు.