ఆదిలాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల తయారీ తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ముందుగా ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా రూపకల్పనపై వారి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర ఓటరు జాబితాను ఈ నెల 21 అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 1,350 కంటే ఎక్కువ ఓటర్లున్న పోలింగ్ కేంద్రం పరిధిలో అదనంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లాలో తొమ్మిది నూతన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాలుగు కేంద్రాలను మరోచోటుకు మార్చినట్లు తెలిపారు. ఓటర్లు వారి పోలింగ్ కేంద్రాన్ని జాబితాలో సరిచూసుకోవాలని సూచించారు. జిల్లాలో 592 పోలింగ్ కేంద్రాలున్నాయని, అందులో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 290, బోథ్ నియోజకవర్గంలో 302 ఉన్నాయని తెలిపారు.
బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను అందించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు అన్ని పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment