సమస్యలను ఆలకిస్తున్న కలెక్టర్ రాహుల్‌రాజ్
ఆదిలాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణికి ఈ వారం వినతులు వెల్లువెత్తాయి. తమ ఆవేదనను ఉన్నతాధికారులకు నివేదించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదనపు కలెక్టర్లు శ్యామాలాదేవి, ఖుష్బూగుప్తాతో కలిసి కలెక్టర్ రాహుల్‌రాజ్ అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల అర్జీ లను సంబంధిత శాఖ అధికారులకు అందజేస్తూ పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.
పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. అలాగే గ్రీవెన్స్‌కు జిల్లాస్థాయి అధికారులంతా తప్పనిసరిగా హాజరువాలన్నారు. కాగా అర్జీల స్వీకరణ సమయంలో కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించడంతో బాఽధితులు గంటన్నర పాటు బయటే ఇబ్బందులు పడుతూ నిరీక్షించాల్సి వచ్చింది. అర్జీల స్వీకరణ సమయంలో సమావేశాల నిర్వహణ ఏంటంటూ పలువురు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వారం అందిన అర్జీల్లో అత్యధికంగా ఆసరా పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, స్వయం ఉపాధి కల్పన, రుణాల మంజూరు వంటివి ఉన్నాయి. బాధితుల్లో కొందరి నివేదన వారి మాటల్లోనే..
రెండేళ్లుగా వేతనాల్లేవ్..
మేమంతా జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 15 ఏళ్లుగా ఏఎన్‌ఎంలుగా పనిచేస్తున్నాం. వేతనాలు తక్కువే అయినా మా పిల్లలనే ఉద్దేశంతో బాధ్యతగా సేవలందిస్తున్నాం. అలాంటి మా కు రెండేళ్లుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించట్లేదు. ఏఎన్‌ఎం పోస్టుల భర్తీ కోసం ఇటీవల చేపట్టిన నియామక ప్రక్రియలోఎంపికయ్యాం. కానీ కొంతమంది కోర్టుకు వెళ్లడంతో మమ్మల్ని విధులకు రావద్దని అధికారులు చెబు తున్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించకపోగా ఉపాధి దూరం చేసే పరిస్థితి నెలకొంది. మమ్ముల్ని యథావిధిగా కొనసాగిస్తూ వేతనాలు చెల్లించాలి. – ఆశ్రమ పాఠశాలల ఏఎన్‌ఎంలు
బోర్లకు అడ్డుపడుతున్నరు
మేమంతా ఆదివాసీ గిరిజన రైతులం. గిరి వికాసం పథకం కింద మా వ్యవసాయ భూములకు బోరుబావి,త్రీఫేజ్ విద్యుత్ మంజూరైంది. కరెంట్ సౌకర్యం కల్పించగా.. బోరుబావులు వేసుకుందామంటే అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నరు. గ్రామంలోకి మిషన్లను రాకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నరు. బోరు బావుల తవ్వకానికి అనుమతిచ్చి యాసంగి పంటల సాగుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం. – గిరిజై గ్రామస్తులు, బజార్‌హత్నూర్
పట్టా చేయడం లేదు
నా భర్త గుండెన ఎల్లన్న పేరిట ఆ దిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్‌లో గల సర్వేనంబర్ 47/2/9లో 1.12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన చనిపోవడంతో ఆ భూమిని నా పేరిట పట్టా చేసి ఇవ్వాలని తహసీల్దార్‌కు దరఖాస్తు పెట్టిన. ఐదేళ్లుగా ఆఫీస్ చుట్టూ నా నలుగురు బిడ్డలతో కలిసి తిరుగుతూనే ఉన్నా. అయినా అధికారులెవరు కనికరించట్లేదు. దయచేసి విచారణ జరిపించి నా పేరిట పట్టా చేసి ఆదుకోవాలని కోరుతున్నా.– గుండెన రాంబాయి, ఆదిలాబాద్
షెడ్లు కేటాయించాలి
మేమంతా చిరు వ్యాపారులం. పట్టణంలోని రోడ్లపై వివిధ వ్యాపారాలతో కుటుంబాలను పోషించుకుంటున్నాం. పట్టణంలోని డైట్ కళాశాల వద్ద గల షెడ్లను మేము ఏర్పాటు చేసుకుంటే మున్సిపల్ అధికారులు ఇటీవల తొలగించారు. దీంతో ఉపాధికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. బల్దియా నిర్మించే షెడ్లను కేటాయించి ఆదుకోవాలని కలెక్టర్‌కు విన్నవించాం. – చిరు వ్యాపారులు, ఆదిలాబాద్
అనుమతి లేదని కూల్చేశారు
సర్వేనంబర్ 170లోని ప్లాట్ నంబర్ 428లో రేకుల ఇల్లు నిర్మించుకున్న. గ్రామ పంచాయతీలో ట్యాక్స్ కూడా కట్టిన. కానీ ఇంటికి బల్దియా నుంచి అనుమతి లేదనే కారణంతో మున్సిపల్ అధికారులు నా ఇంటిని కూల్చివేశారు. ఎన్నో ఇళ్లు అనుమతి లేకుండా నిర్మించినవి ఉన్నప్పటికి కేవలం నా ఒక్క ఇంటిని మాత్రమే కూల్చివేసి నష్టం చేశారు. దీనిపై విచారించి నాకు న్యాయం చేయాలి. – బత్తుల రాములు, మావల.
Comments
Please login to add a commentAdd a comment