తీర్పు ఎటువైపు?  | Who Will Win The Elections | Sakshi
Sakshi News home page

తీర్పు ఎటువైపు? 

Published Sat, Dec 8 2018 3:30 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Who Will Win The Elections - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: 
అంచనాలకు మించి పెరిగిన ఓటింగ్‌ ఎవరి కొంప ముంచుతుందో తెలియక అభ్యర్థుల్లో కొత్త టెన్షన్‌ మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పది నియోజకవర్గాల్లో కేవలం మంచిర్యాలలోనే 70 శాతం కన్నా తక్కువ ఓటింగ్‌ శాతం నమోదు కాగా, బెల్లంపల్లి, చెన్నూరులలో 70 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. మిగతా ఏడు నియోజకవర్గాల్లో సగటున 80 శాతానికన్నా ఎక్కువే ఓట్లు నమోదు కావడంతో అభ్యర్థులకు సైతం ఓటరు తీర్పు అర్థం కావడం లేదు.
ఆదిలాబాద్‌ జిల్లాలోని బోథ్‌లో అత్యధికంగా 85.38 శాతం, ఆదిలాబాద్‌లో 81.6 శాతం ఓట్లు నమోదు కావడం కొత్త రికార్డు. నిర్మల్‌ జిల్లాలో ఏకంగా 80 శాతం పోలింగ్‌ జరిగింది. పోటెత్తినట్లు ఓటర్లు పోలింగ్‌బూత్‌లకు రావడంతో వారు ఎవరికి అండగా నిలిచారనే దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రభావం ఉన్న అన్ని నియోజకవర్గాలతో పాటు నిర్మల్‌లో సైతం దాదాపు 80 శాతం ఓట్లు పోలవడం ఫలితాలను ప్రభావితం చేస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. 

గిరిజనుల ఓట్లన్నీ పోలరైజేషన్‌
ఏడాదిన్నర క్రితం నుంచే ఆదిలాబాద్‌ ఏజెన్సీలో గిరిజనుల్లోని రెండు వర్గాల మధ్య స్పష్టమైన విభజన ఏర్పడింది. స్వయం పాలన కోసం ఆదివాసీలు ఉద్యమించడమే గాక, తమ హక్కులను లంబాడాలు కైవసం చేసుకున్నారని, వారిని ఎస్టీల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికల్లో గిరిజనుల్లోని రెండు వర్గాలు తమ తమ వర్గాల నేతలకే మద్ధతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమించిన సోయం బాపూరావు, ఆత్రం సక్కు కాంగ్రెస్‌ అభ్యర్థులుగా బోథ్, ఆసిఫాబాద్‌ నుంచి పోటీ చేశారు. ఆదివాసీలు ఈ రెండు నియోజకవర్గాల్లో వీరికే మద్ధతు పలికినట్లు ఓటింగ్‌ సరళిని బట్టి స్పష్టంగా కనిపిస్తోంది.
మిగతా నియోజకవర్గాల్లో కూడా తమ వర్గీయులు పోటీలో ఉన్న చోట పార్టీతో సంబంధం లేకుండా మద్ధతు తెలిపారు. ఖానాపూర్‌లో బీజేపీ అభ్యర్థి సట్ల అశోక్‌కు ఆదివాసీలు అండగా నిలిచారు. ఇక్కడ ప్రధాన పోటీదారులుగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నుంచి లంబాడా వర్గానికే చెందిన రేఖానాయక్, రాథోడ్‌ రమేష్‌ ఉండడంతో లంబాడా ఓట్లతో పాటు గిరిజనేతర ఓట్లు ప్రభావం చూపనున్నాయి. ఓటింగ్‌ సరళిని బట్టి ఇక్కడ రేఖా నాయక్‌కే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జనరల్‌ నియోజకవర్గాలైన ఆదిలాబాద్, ముథోల్, సిర్పూరులలో ఆదివాసీలు ఎక్కువగానే ఉండగా, వీరి ఓట్లు ఎవరికి పోలయ్యాయనేది అంతుబట్టడం లేదు.

మైనారిటీల ప్రాబల్యంతో పెరిగిన బీజేపీ బలం
ముథోల్, నిర్మల్, ఆదిలాబాద్‌ నియోజకవర్గాలలో మైనారిటీల ప్రాబల్యం నేపథ్యంలో బీజేపీ ఓటు బ్యాంకు కూడా పెరిగినట్లు పోలింగ్‌ సరళిని బట్టి అర్థమవుతోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో సైతం 80 శాతం పోలింగ్‌ జరిగింది. మైనారిటీలతో పాటు హిందూ భావజాలం గల యువత, ఇతరులు కూడా భారీగానే ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆదిలాబాద్, భైంసా పట్టణాల్లో ఈ విభజన స్పష్టంగా కనిపించింది. ఆదిలాబాద్‌లో మైనారిటీలు టీఆర్‌ఎస్‌ వెంట ఉండగా, భైంసా, నిర్మల్‌లలో టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌కు కూడా మద్ధతుగా నిలిచినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆయా పట్టణాల్లో హిందూ భావజాలం గలవారు బీజేపీకి ఓటేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడు నియోజకవర్గాల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కాగా ఉమ్మడి జిల్లాలో మైనారిటీ ముస్లింల  మెజారిటీ ఓట్లు కారుకే పడ్డట్టు స్పష్టమవుతోంది.

సింగరేణి కుటుంబాలు ఎటువైపు..?
మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేసే బలమున్న వర్గం సింగరేణీయులది. ఈ నియోజకవర్గాల్లో విధుల్లో ఉన్న కార్మికులతో పాటు రిటైర్డ్‌ ఉద్యోగులు కూడా ఎక్కువే. మంచిర్యాలకు శ్రీరాంపూర్, నస్పూర్, చెన్నూరుకు మందమర్రి, బెల్లంపల్లికి బెల్లంపల్లి, కాసిపేట, ఆసిఫాబాద్‌కు గోలేటి ప్రాంతాల్లో ఉన్న కార్మిక కుటంబాల ఓట్లు కీలకం. సింగరేణి కార్మికులు ఎటువైపు మొగ్గు చూపారనేది కూడా అర్థం కావడం లేదు. ఈ నాలుగు ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌కు మెజారిటీ సింగరేణి మద్ధతిచ్చినట్లు ట్రెండ్స్‌ చెపుతున్నాయి. బెల్లంపల్లిలో చిన్నయ్యకు సింగరేణి కార్మికులే తిరిగి ఊపిరి పోయనున్నట్లు తెలుసోంది. బీఎస్‌పీ నుంచి పోటీ చేసిన గడ్డం వినోద్‌కు సింగరేణి ఓట్లు మైనస్‌ అయినట్లుగా సమాచారం. మంచిర్యాలలో నస్పూరు, శ్రీరాంపూర్‌ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రేంసాగర్‌రావుకు కూడా ఓటింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. 

ఎవరికి వారే ధీమా.. 
పెరిగిన ఓటింగ్‌ శాతంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులతో పాటు టీఆర్‌ఎస్‌ పాలనలో ఇబ్బంది పడ్డ అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి ఓట్లు వేయడం వల్లనే పోలింగ్‌ శాతం పెరిగిందని కాంగ్రెస్‌ నేతలు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రచారానికి ప్రభావితమై ఓట్లేస్తే నష్టమని భావించిన యువత, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఓటింగ్‌ రావడంతోనే 80 శాతం పోలింగ్‌ నమోదైనట్లు టీఆర్‌ఎస్‌ నేతలు చెపుతున్నారు. ఎవరి ధీమాలో వారున్నప్పటికీ... 11వ తేదీన ఫలితాలు వెల్లడయ్యేంత వరకు సస్పెన్స్‌ కొనసాగాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement