సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీ నియామకం పూర్తయింది. రెండు నెలల ముందుగానే తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీ కాలం జనవరి 31తో ముగుస్తుంది. 2 నెలల ముందుగానే ఎస్పీ సింగ్ తర్వాత సీఎస్ ఎవరవుతారనే చర్చ ఐఏఎస్ వర్గాల్లో ప్రధానంగా జరుగుతోంది. సాధారణంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఐఏఎస్‌లను సీఎస్ పోస్టుకు అర్హులుగా పరిగణిస్తారు.
ప్రస్తుతం ఈ హోదాలో 8 మంది అధికారులు ఉన్నారు. రాజీవ్ ఆర్ ఆచార్య, ఎస్ కే జోషి, బీపీ ఆచార్య, అజయ్ మిశ్రా, రాజేశ్వర్ తివారీ, సురేశ్ చందా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రాష్ట్ర సర్వీసుల్లో ఉన్నారు. వీరు కాకుండా బినయ్ కుమార్ కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. వీరందరూ సీఎస్ రేసులో ఉన్నట్లేనని అర్థమవుతోంది. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఆరు నెలల్లోపు రిటైర్ కానున్నారు. ఎస్పీ సింగ్ కన్నా ముందే బినయ్ కుమార్ ఈ పోస్టును ఆశించారు. కానీ సీఎం కేసీఆర్ బినయ్ కుమార్‌పై ఆసక్తి చూపలేదనే ప్రచారం జరిగింది. దీంతో రంజీవ్ ఆర్ ఆచార్య, బినయ్ కుమార్‌లకు అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ప్రస్తుతమున్న సీఎస్ ఎస్పీ సింగ్ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. దీంతో ఆయన పదవీకాలాన్ని కొంత కాలం పొడిగించే అవకాశాలూ లేకపోలేదని ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment