
వాటర్‌గ్రిడ్‌పై విస్తృతంగా ప్రచారం
ప్రాజెక్టు సమీక్షలో అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం
హైదరాబాద్: ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుైపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖామంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లోనూ, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనూ ఆ జిల్లా పరిధిలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలను, మ్యాపులను ప్రదర్శించాలని సూచించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉన్నతాధికారులతో ఆయన మంగళవారం సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు ప్రయోజనాలను, లక్ష్యాలను ప్రజలకు తెలియజేస్తే, త్వరలోనే వారికి సురక్షిత మంచినీరు అందుతుందన్న నమ్మకం కలుగుతుందన్నారు. ప్రాజెక్టుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్ల్లాలోని రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, అటవీ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే ముఖ్యమంత్రి సమీక్షించనున్నందున అవసరమైన సమాచారాన్ని సేకరించాలని, జరిగిన పనులకు సంబంధించిన నివేదికలను కూడా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
వేగంగా ఇంటేక్‌వెల్స్ పనులు..
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంటేక్‌వెల్స్ నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వేసవిలోగా సాధ్యమైన మేర పనులను పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టు రూపకల్పనకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చేసిన కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు, మంత్రులు ప్రాజెక్టులోని అంశాల పట్ల ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయ్యేవరకు ఇదేస్ఫూర్తిని కొనసాగించాలని మంత్రి అధికారులను కోరారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి తదితరులున్నారు.