ఆరుగాలం శ్రమించి పెట్టుబడులు పెట్టారు. నాసిరకం విత్తనాలు.. ప్రకృతి విపత్తులతో దిగుబడి నామమాత్రంగానే వచ్చింది.. చేసిన అప్పుల వడ్డీ పెరిగిపోవడం.. మరో వైపు ఆర్థిక పరిస్థితులు దిగజారిపోవడంతో తట్టుకోలేకపోయారు.. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చందంపేట, మండలాల పరిధిలో విషాదం నెలకొంది.
చందంపేట (దేవరకొండ): మండలంలోని గాగిళ్లాపురం గ్రామానికి చెందిన సిగ పద్మ(34) భర్త ఇద్దయ్యలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమకున్న మూడు ఎకరాలతో పాటు మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగు చేస్తున్నారు. సాగు పెట్టుబడుల నిమిత్తం తెలిసిన వారి వద్ద రూ. లక్ష అప్పులు చేశారు. పంటదిగుబడి రాకపోవడంతో తీసుకున్న రుణం చెల్లించాలని రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగింది. ఇదే విషయంపై దంపతుల మధ్య గురువారం వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పద్మ శుక్రవారం వ్యవసాయ భూమివద్ద పురుగుల మందు తాగింది. మధ్యాహ్న సమయంలో గుర్తించిన రైతులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందింది. మృతురాలికి భర్త, 14 ఏళ్లలోపు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీఆర్వో రాజవర్దన్‌రెడ్డి ఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆలేరులో మరో రైతు..
ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన కాల జైపాల్ (37) తనకున్న 2 ఎకరాలతో పాటు మరో 7 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిని సాగుచేశాడు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఇటు అప్పులభారం, పత్తి దిగుబడి లేకపోవడంతో మనస్తాపానికి గురై ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతు డి భార్య 12 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఇతడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై నర్సింహులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment