
పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు అయిలయ్య, భాగ్య
జీవితాంతం తోడూనీడగా ఉంటానని ప్రమాణం చేసి తాళి కట్టించుకుంది.. అతడితో జీవితం పంచుకుని నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. క్షణిక సుఖం కోసం మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం కాస్తా భర్తకు తెలియడంతో తాగుబోతు అంటూ నింద వేసి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.అక్కడ యథేచ్ఛగా తన ప్రియుడితో సఖ్యతగా మెలిగింది. గతాన్ని మరిచిపోయి కలిసి జీవిద్దామని వెళ్లిన భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా అంతమొందించింది. ఇదీ.. ఇటీవల రాజాపేట మండలం దూదివెంకటాపురంలో వెలుగుచూసిన నరేష్ హత్యోదంతం వెనుక ఉన్న కారణాలు.
భువనగిరిఅర్బన్ : ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి శనివారం తన కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన కొల్లూరు నరేష్(35)కు రాజపేట మండలం దుదివెంకటాపురం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల భాగ్యతో పదిహేడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా వీరికి నలుగురు సంతానం. వీరు 13 సంవత్సరాలు కలిసి జీవించారు.
ఈ సమయంలో భాగ్యతో మోటకొండూరు గ్రామాని చెందిన వంగపల్లి అయిలయ్యతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం నరేష్‌కు తెలియడంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి తరచూ గొడవలకు దారితీసిందర్థా క్రమంలో నరేష్ మద్యానికి బానిసగా మారాడు. దీంతో భాగ్య భర్త తాగుబోతు అంటే నింద వేసి నాలుగేళ్ల క్రితం మోటకొండూరు నుంచి తన తల్లిగారి గ్రామమైన దుదివెంకటపురానికి పిల్లలతో కలిసి వచ్చి ఉంటోంది. వంగపల్లి అయిలయ్యతో వివాహేతర సంబంధం అలానే కొనసాగిస్తోంది.
పిల్లలను చూసేందుకు వెళ్లగా..
నరేష్ తన పిల్లలను చూడటానికి ఈ నెల 9వ తేదీన దుదివెంకటాపురం గ్రామానికి వెళ్లాడు. గతాన్ని మరిచిపోయి కలిసి జీవిద్దామని భార్యను కోరాడు. అందుకు భాగ్య ఒప్పుకోకపోవడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. తదనంతరం రాత్రి సమయంలో ఎక్కవగా మద్యం సేవించిన నరేష్ తన అత్తవారి ఇంటిముందున్న మంచంపై నిద్రపోయాడు.
పథకం ప్రకారం..
తన సఖ్యతకు అడ్డొస్తున్నాడనే నెపంతో భాగ్య భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం వెంటనే విషయాన్ని ప్రియుడు అయిలయ్యకు ఫోన్ చేసి తెలిపింది. భర్త మద్యం మత్తులో నిద్రపోయిన విషయాన్ని తెలిపి దూదివెంకటాపురం రావాలని కోరింది. అయిలయ్య గ్రామానికి చేరుకోవడంతో ఇద్దరు కలిసి ఆదమరచి నిద్రపోయిన నరేష్ ముఖంపై భాగ్య దిండుపెట్టి ఊపిరి ఆడకుండా చేయగా అయిలయ్య కాళ్లు, చేతులు పట్టుకున్నాడు. కాసేపటికి నరేష్ ఊపిరాడక ప్రాణాలు విడిచాడు. తదనంతరం అతడి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించారు.
మృతుడి తల్లి ఫిర్యాదుతో..
కొల్లూరి నరేష్‌ను హత్య చేసిన వెంటనే భాగ్య అయిలయ్య ఇద్దరు కలిసి అక్కడి నుంచి పారి పోయారు. మృతుడు నరేష్ తల్లి కొల్లూరి ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే శనివారం భువనగిరి పట్టణ శివారులో ఉన్న బొమ్మాయిపల్లిలో భాగ్యలక్ష్మి, అయిలయ్య ఇద్దరు ఉన్నట్లు సమాచారం తెలిసింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. తామే నరేష్‌ను హత్య చేసినట్టు అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు డీసీపీ వివరించారు. సమావేశంలో ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, రూరల్ సీఐ అంజనేయులు, ఎస్‌ఐ శివకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment