సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఏటేటా అడవి పందుల సంఖ్య వేలల్లో పెరిగిపోతోంది. సహజ అటవీ సంపద రోజురోజుకూ పలుచబడి అడవి పందులు పంట చేల మీదకు మళ్లుతున్నాయి. విత్తనం వేసిన నాటి నుంచి మొదలుపెట్టి పంట చేతికొచ్చే వరకు రైతు కళ్లలో ఒత్తులేసుకొని కాపు కాసినా... అర్ధరాత్రి వేళ ఆపదొచ్చినట్టు వచ్చి పంట విధ్వంసం చేసి పోతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి సంవత్సరం 1.50 లక్షల ఎకరాలపై అడవి పందుల ప్రభావం ఉన్నట్లు తేలింది.
అడవి పందులు రెండేళ్ల కాలంలో ఇద్దరు రైతులపై దాడి చేసి చంపివేయగా.. 12 మందికి గాయపరిచాయి. అయితే.. ఇవేవి అటవీ రికార్డులకెక్కకపోవడం గమనార్హం. పంట చేలపై దాడి చేసే అడవి పందులను చంపవచ్చని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చినా.. అటవీ శాఖ అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని నిబంధనలను ముందు పెట్టి రైతుల చేతులు కట్టేస్తున్నారు.
పంట కంటే ముందే పందులు..
మహబూబ్‌బాద్ జిల్లాలో 16 మండలాలు ఉండగా.. దాదాపు అన్ని ప్రాంతాల్లో అడవి పందుల గుంపులు ఉన్నట్లు ఫారెస్టు అధికారులు నిర్ధారిం చారు. మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్‌లోని గూడూరు, బయ్యారం, గార్ల, కొత్తగూడెం, గంగారం మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఈ ఐదు మండలాలల్లో సుమారు 80 వేల ఎకరాల్లో భూమి సాగు అవుతుండగా.. 45 వేల ఎకరాల సాగుపై అడవి పందుల ప్రభావం ఉంటోంది. తొర్రూరు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్లలోని 16 మండలాల్లో కలిపి 5 వేలకు పై గానే అడవి పందుల సంచారం ఉన్నట్లు అంచనా.
జయశంకర్ జిల్లాలో..
గత ఏడాది భూపాలపల్లి జిల్లా మహాముత్తారం స్తంభంపల్లిలో రైతు జాడి రాజయ్య (45) పత్తి చేలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా.. అడవి పంది దాడి చేసి చంపేసింది. ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, గోవిందరావుపేట, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడ, గూడూ రు, వాజేడు, కన్నాయిగూడెం, కాటారం, మహదేవ్‌పూర్, మహాముత్తారం, పలిమెల తదితర మండలాల్లో 1.75లక్షల ఎకరాల్లో పంట సాగవుతోంది.
పత్తి, మిరప, మొక్కజొన్న, పసుపు పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. ఈ ప్రాంతంలో అడవి పందుల సమస్యతో రైతులు పం టలు వేయడానికే భయపడుతున్నారు. ఇక్కడ దాదాపు 75 వేల ఎకరాలపై అడవి పందుల ప్రభావం ఉంటుం దని రైతు సంఘాలు చేసిన ఒక సర్వేలో తేలింది.
జనగామ, రూరల్ జిల్లాలో..
జనగామ జిల్లాలో బచ్చన్నపేట, నర్మెట, జనగామ, రఘునాథపల్లి, లింగాలఘనపురం 25వేల ఎకరాల్లో, వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్, నల్లబెల్లిలో 5వేల ఎకరాలపై అడవి పందుల తీవ్ర ప్రభావం ఉంది.
ప్రత్యేక చట్టం తెచ్చినా..
అడవి పందుల పంట విధ్వంసం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. పంట లపై దాడి చేసే అడవి పందులను వేటాడి చంపవచ్చని అందులో పేర్కొంది. ఈ చట్టం రైతులకు కొంత ఊరట నిచ్చింది. అయితే.. ఎలా చంపాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. సాధారణంగా పంట చేలల్లోకి వచ్చే అడవి పందులను వేటాడటానికి రైతులు ఉచ్చులు వేయడం, విష ప్రయోగం, బాణాలు సంధించడం, వలలు పెట్ట డం, కరెంటు తీగలు అమర్చడం వంటి నాటు పద్ధతుల ను అవలంబించేవాళ్లు.
ఇందులో కరెంటు తీగలు పెట్టే విధానం అత్యంత ప్రమాదకరం కావడంతో ఇలాంటి రైతులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ మే ఆదేశించింది. ఈ క్రమంలో అటవీశాఖ తన తెలివి తే టలను ప్రదర్శించింది. రైతులు ఎట్టి పరిస్థితుల్లో అడవి పందులను చంపడానికి వీల్లేదని, గన్ ఫైరింగ్‌లో నిపుణులను ఎంపిక చేసి.. వారితోనే కాల్చివేయాలనే నిబంధన ను ప్రభుత్వం ముందు పెట్టింది. ఇలాంటి వాళ్లను తామే ఎంపిక చేస్తామని, రైతుకు రూపాయి ఖర్చు లేకుండా అడవి పందులను చంపిస్తామని ప్రభుత్వానికి చెప్పింది.
ఆ ఇద్దరు వస్తేనే..
గన్ ఫైరింగ్ చేయగలిగే ఔత్సాహికులు ఉంటే ఫారెస్టు శాఖలో పేరు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించగా.. తెలంగాణ వ్యాప్తంగా కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే వాటిని చంపేందుకు ముందుకు వచ్చారు. వరంగల్ జిల్లా నుంచి మాజీ డీజీపీ పేర్వారం రాములు కొడుకు సంతాజీ, హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ సఫత్ అలీఖాన్ అనే ఇద్దరు ఫైరింగ్ నిపుణులు మాత్రమే ఇందుకు ఒప్పుకున్నారు.
పంట చేల మీదపడి పందులు విధ్వంసం చేస్తున్నా.. వాటిని ఏమి అనకుండా రైతులు ముందుగా డీఎఫ్‌ఓకు సమాచారం ఇవ్వాలి. సదరు అధికారి నిజనిర్ధారణ చేసిన తర్వాత ఫైరింగ్ నిపుణులను సంప్రదిస్తారు. వారు సమయం కేటాయిస్తే.. అదే వేళలో పందులు ఎక్కడ ఉన్నాయో రైతులు పసిగట్టి చూపించాలి. వాటిని నిపుణులు ఫైరింగ్ చేసి కాల్చి చంపుతారు. అంతేకాని రైతులు నేరుగా అడవి పందులను వేటాడకూడదనే నిబంధన కఠినతరం చేశారు. దీంతో రాష్ట్రంలో ప్రత్యేక చట్టం అమలవుతున్నా... రైతన్నలు అడవిపందుల నుంచి తమ పంటను కాపాడుకోలేక పోతున్నారు.
ఇక్కడో దబాయింపు సెక్షన్..
న్యప్రాణులతో పంట నష్టం జరిగితే వరి, చెరుకు పంటలకు ఎకరాకు రూ.6 వేల చొప్పున , పత్తి, సోయ, పెసర తదితర పప్పు రకాల పంటలకు ఎకరాకు రూ.2 వేల నుంచి రూ.3 వేల చొప్పున పంట నష్టపరిహారం అందిస్తారు. అడవి పందుల దాడిలో మరణిస్తే రూ.5 లక్షలు, గాయపడితే రూ.70 వేల చొప్పున పంట నష్టపరిహారం చెల్లిస్తారు. అయితే.. జిల్లాలో అడవి పందుల దాడులు జరుగుతున్నా.. ఫారెస్టు రికార్డుల్లో రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి.
ఈ క్రమంలో వాస్తవ పరిస్థితులపై ఆరా తీస్తే ఏజెన్సీ ప్రాంతంలోని 50 శాతం భూముల పట్టా హక్కులపై ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య వివాదం కొనసాగుతున్నట్లు తేలింది. ఇటువంటి భూముల్లో పంటలు సాగు చేస్తున్న రైతాంగంపై అడవి పందులు దాడి చేస్తే.. ఫారెస్టు అధికారులు కేసులు నమోదు చేయడం లేదు. పైగా వన్య ప్రాణుల ఆవాసంలోకి అక్రమంగా చొరబడి వాటి సహజ జీవనానికి విఘాతం కలిగిస్తున్నారని ఉల్టా కేసు పెడుతున్నారు. దీంతో రైతులు పంట నష్టం జరిగినా.. ప్రాణాపాయం వచ్చినా ఫారెస్టు అధికారులకు మాత్రం చెప్పడం లేదు.పంటలు సాగుచేస్తే పందులపాలైతాంది.
అష్టకష్టాలు పడి పంటలను సాగు చేస్తే అడవి పందుల పాలైతాంది. రాత్రి వేళల్లో చేలు, పొలాల్లో కలియతిరుగుతూ పంటను పనికి రాకుండా చేస్తున్నాయి. గ్రామస్తులంతా ఏకమై తరమాల్సిన పరి స్థితి వచ్చింది. వాటికి హాని కలిగిస్తే అటవీ అధికారులు కేసులు పెడుతున్నారు. పంటలు కోల్పోయినందుకు మాత్రం అటవీశాఖ అధికారులు పరిహారం ఇవ్వరు.
– కోరం నర్సయ్య, గిరిజన రైతు,సర్వాయి(ఏటూరునాగారం)
అడవి పందులతో నష్టపోతున్నాం..
గుంపులు గుంపులుగా అడవి పందులే సేండ్ల మీదకొస్తున్నయి. 30 ఏండ్ల నుంచి ఇదే తంతు. మక్క, పత్తి, వరి, కూరగాయలను సర్వనాశనం చేస్తున్నాయి. వ్యవసాయ బావి వద్దకు వెళ్లాలంటేనే వణికిపోతున్నాం. చాలా మంది రైతులు వ్యవసా యం మానుకునే పరిస్థితి నెలకొంది. అడవి పం దుల నుంచి రక్షించాలి. – గీస సందీప్, మన్‌సాన్‌పల్లి, బచ్చన్నపేట, జనగామ
Comments
Please login to add a commentAdd a comment