దండం పెడతా..
- సక్రమంగా పనిచేయండి.. సీఎం రుణం తీర్చుకోండి
- ఉద్యోగులకు శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ పిలుపు
సిద్దిపేట: ‘దండం పెడుతున్నా.. ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించండి. వివిధ పనుల కోసం వచ్చే వారికి సకాలంలో పనులు చేసి పంపండి. ప్రభుత్వానికి పేరు, ప్రతిష్టలు తీసుకురండి’ అని శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. సోమవారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేటలో ఎన్‌జీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు మిషన్ కాకతీయ పథకంపై నిర్వహించిన అవ గాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను గత ఐదు పీఆర్‌సీలలో ప్రత్యక్షంగా పాల్గొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ప్రస్తుత సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, రుణం తీర్చుకుందామని చెప్పారు. ఉద్యోగులను అవినీతిపరులుగా మార్చవద్దని రాజకీయ నాయకులను కోరారు.
రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే: హరీశ్
రైతుల ఆత్మహత్యలను ఆపి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే మిషన్ కాకతీయ లక్ష్యమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని తెలిపారు. ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి అవలంబిస్తున్న విధానాల వల్లే దేశానికి కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.
ప్రతి ఉద్యోగి శ్రమించాలి: దేవీప్రసాద్
మిషన్ కాకతీయను విజయవంతం చేసేందుకు ప్రతి ఉద్యోగి శ్రమించాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు అన్నారు. మిషన్ కాకతీయ ప్రజాసంక్షేమ కార్యక్రమమని ఇందులో ప్రజలనూ భాగస్వామ్యం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, జేసీ శరత్‌లు తదితరులు మాట్లాడారు. అనంతరం టీఎన్జీవో కేలెండర్‌ను ఆవిష్కరించారు.