ఆకాశవీధిలో ఆహా! | Wings India Aviation Show 2020 Hyderabad | Sakshi
Sakshi News home page

ఆకాశవీధిలో ఆహా!

Published Fri, Mar 13 2020 10:14 AM | Last Updated on Fri, Mar 13 2020 10:14 AM

Wings India Aviation Show 2020 Hyderabad - Sakshi

రాజహంస(ఎమిరేట్స్‌) రాజసం లేదు.. ఖతర్‌ మెరుపులు లేవు.. ఎతిహాడ్‌ హోయలు అసలే కనిపించలేదు.. ఎయిర్‌ ఏషియా(మలేషియా), థ్రస్ట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌కో(టీఎస్‌సీ–003), ఇండిగో (ఏ320–నియో)ల సోయగాలు లేనే లేవు.. ఔను గతంలో సందర్శకులను మైమరిపించిన విమానాలు ఈ ఏడాది కనిపించలేదు. చిన్నా చితకా విమానాలే తప్ప చెప్పుకోదగ్గ పెద్ద విమానాలు రాకపోవడంతో సందర్శకులను ఉసూరుమన్పించింది. ఇదీ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ప్రారంభమైన ‘వింగ్స్‌ ఇండియా–2020’లోని సీన్‌.. అయితే ఎయిరోబాటిక్‌(వైమానిక విన్యాసాలు) మాత్రం సందర్శకులను కనురెప్ప వాల్చనీయలేదు. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు కాస్తా ఊరటనిచ్చాయి. కరోనా ప్రభావం ‘వింగ్స్‌ ఇండియా’పై స్పష్టంగా కనిపించింది. గతంతో పోలిస్తే సందర్శకుల(బిజినెస్‌మెన్‌) సందడి తక్కువగా కనిపించింది. పట్టుమని 10 విమానాలు కూడా షోకు రాలేదు. అందులోనూ ప్రాఫిట్‌ హంటర్, ఎయిర్‌బస్‌ విమానం మినహాయిస్తే మిగతావాన్నీ బుల్లి విమానాలే. ఈ ఏడాది కొత్తగా ‘ప్రాఫిట్‌ హంటర్‌’ మాత్రమే వచ్చిచేరింది.

 సాక్షి, సిటీబ్యూరో/సనత్‌నగర్‌: ఈ షోకు ఆదివారం వరకు సమయం ఉండటంతో మరికొన్ని వచ్చి చేరే అవకాశం లేకపోలేదని నిర్వాహకులు చెబుతున్నారు. రెండేళ్లకోసారి కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఫిక్కీ) సంయుక్తంగా ‘వింగ్స్‌ ఇండియా’ను నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ సారి ఏవియేషన్‌ షో కేవలం బిజినెస్‌కే పరిమితమైంది. ఆదివారం వరకు జరిగే ఈ షోకు వివిధ విమానయాన సంస్థలతో పాటు తయారీ సంస్థలు, కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ భయం కారణంగా గురువారం షోకు హాజరైన కొంతమంది సందర్శకులతో పాటు అక్కడ ఉన్న భద్రత సిబ్బంది మాస్క్‌లు ధరించి కనిపించారు.

గగనంలో విన్యాసాలు..
గగనంలో గింగరాలు తిరిగే ఎయిర్‌క్రాఫ్ట్‌లు.. పొగలు చిమ్ముకుంటూ నింగిలో రకరకాల ఆకృతులను ఆవిష్కరించిన దృశ్యాలు కనువిందు చేశాయి. ఏవియేషన్‌ షో అంటే ముందుగా గుర్తొచ్చేది గగనంలో విన్యాసాలే. ఊపిరి బిగపట్టుకుని కళ్లార్పకుండా విన్యాసాలు వీక్షించేవారు. పొగలు కక్కుకుంటూ ఆకాశంలోకి దూసుకుపోతున్నట్లుగా అనిపించినంతలోనే.. అమాంతం కిందపడుతుందేమోనని భయంతో చూసేవారికి ముచ్చెమటలు పట్టాయి. అంతలోనే మళ్లీ వేరే డైరెక్షన్‌లో విమానం దూసుకుపోవడం.. దాని వ్యతిరేక దిశలో మరో విమానం దూసుకువచ్చి రెండూ క్రాష్‌ అయిపోయి కిందపడుతున్నాయోనని ఒళ్లంతా గగుర్పాటుకు గురిచేసే విన్యాసాలు అబ్బురపరిచాయి. సారంగ్‌ టీమ్‌ బృందం నాలుగు ‘ధ్రువ’ హెలికాప్టర్లతో, మార్క్‌జెఫ్రీ బృందం మూడు ఎయిర్‌క్రాఫ్ట్‌లతో వేర్వేరుగా చేసిన ఎయిరోబాటిక్స్‌ అలరించాయి. 

ప్రదర్శనకు ఉంచిన విమానాలు ఇవే..
మొత్తం తొమ్మిది విమానాలు ప్రదర్శనలో ఉంచారు. వీటిలో హోండా ఎన్‌271బీబీ, హెచ్‌ఏఎల్‌ ధ్రువ్‌ (ఏఎల్‌హెచ్‌) ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ యుద్ధ హెలికాప్టర్, హెచ్‌ఏఎల్‌ డీఓ–228, ప్రాఫిట్‌ హంటర్, ఎయిర్‌ ఇండియా, వీటీ–జీహెచ్‌ఎల్‌కు చెందిన జీబీఎల్‌ హెలికాప్టర్, వీటీ–వీబీబీ ఎయిర్‌క్రాప్ట్, డీఏ 42–వీ1 విమానం, ప్రాఫిట్‌ హంటర్‌ ఈ195–ఈ2 హెలికాప్టర్లు ప్రదర్శనలో ఉంచారు.

ప్రాఫిట్‌ హంటర్‌ అదుర్స్‌..
వింగ్స్‌ ఇండియా 2020లో ప్రదర్శనకు ఉంచిన విమానాల్లో ఆకట్టుకున్నది ప్రాఫిట్‌ హంటర్‌ ఈ 195 ఈ2.. 146 మంది వరకు సీటింగ్‌ కెపాసిటీ గల ఈ విమానంలో ప్రయాణికుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించారు. ఇతర విమానాల్లా కాకుండా కొంచెం అప్‌గ్రేడ్‌ చేస్తూ ‘ద కింగ్‌ ఆఫ్‌ ద స్కై’గా పిలిచే ఈ విమానంలో ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు సీట్లను 29 ఇంచుల నుంచి 35 ఇంచుల వరకు ఉండేలా చూశారు. సీటులో వెనుకకు ఒరిగి పడుకున్న ఇతరులకు ఇబ్బంది లేకుండా రూపకల్పన చేశారు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు పెట్టుకునేందుకు ప్రత్యేక ప్యాకెట్లను ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కువగా శబ్దం వినబడదు. ఇంధనం కూడా మిగతా వాటికంటే కాస్తా తక్కువగానే ఖర్చవుతుంది. బ్రెజిలియన్‌ కంపెనీ ఎంబ్రార్‌ తయారుచేసిన విమానం ప్రపంచంలోనే మూడో అతి పెద్దది కావడంతో బిజినెస్‌ విజిటర్స్‌ చూసేందుకు ఆసక్తి కనబరిచారు. గంటలకు 833 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విమానం 1,450 మీటర్ల నుంచి టేకాఫ్, 1,240 మీటర్ల నుంచి ల్యాండ్‌ అవుతుందని పైలట్‌ లూయిస్‌ సొగారో తెలిపారు.

విమాన యాక్సెసరీస్‌కే కంపెనీల పెద్దపీట..

ఏవియేషన్‌ షోలో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌లో ఎక్కువ శాతం విమాన ఉత్పత్తుల ప్రదర్శనకు ప్రాధాన్యం ఇచ్చేలా పలు సంస్థలు పోటీపడ్డాయి. ముఖ్యంగా ఇంజిన్‌ ఉత్పత్తుల నుంచి ప్రయాణికులు దిగేందుకు ఉపయోగించే మూవింగ్‌ స్టెప్స్‌ వెహికల్‌ వరకు అన్ని రకాల ఉత్పత్తుల తయారీ సంస్థలు ప్రచారానికి పెద్దపీటనే వేశాయి. విమానాల తయారీ, యంత్ర పరికరాలు, విమానయాన రంగంలో సేవలందించే కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించాయి. అలాగే ప్రముఖ హెలికాప్టర్‌ తయారీ సంస్థలు స్సైస్‌ జెట్, స్పైస్‌ ఎక్స్‌ప్రెస్, ఎయిర్‌బస్‌ హెలికాప్టర్స్‌తో పాటు స్పేర్‌పార్ట్స్‌ను ఎగ్జిబిషన్‌లో ఉంచారు.  ప్రముఖ ఇంజిన్‌ తయారీ సంస్థలు సీఎఫ్‌ఎం, యూటీసీ, జీఈ ఏవీయేషన్, రోల్స్‌ రాయ్‌సే, ప్రట్‌ అండ్‌ వైట్నీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. అలాగే జెట్‌ ఎయిర్‌వేస్, కార్పొరేట్స్‌ జెట్స్‌ వంటి స్టాళ్ల ద్వారా విమానాలు, హెలికాప్టర్‌ మోడళ్లపై ప్రచారం కల్పిస్తున్నారు. వీటితో పాటు తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఏరోస్పేస్‌ సైట్స్‌ ఇన్‌ తెలంగాణ, సీఎస్‌ఐఆర్‌ నేషనల్‌ ఏరో స్పేస్‌ లేబరేటరీస్, గుజరాత్‌ ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ, టర్బో ఎయిర్‌బస్‌ హెలికాప్టర్‌ వంటి సంస్థలు స్టాల్స్‌ను ఏర్పాటుచేసి తమ సేవలను వివరించాయి. 

మురిపిస్తోన్న బుల్లి విమాన నమూనాలు..
బుల్లి విమాన నమూనాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ఎగ్జిబిషన్‌లో వివిధ స్టాల్స్‌లో ఈ విమాన నమూనాల ప్రదర్శనతో పాటు అమ్మకానికి ఉంచారు. వివిధ పరిమాణాల్లో చూడముచ్చటగా వీటిని తీర్చిదిద్దారు. ఏ–380 ఎయిర్‌బస్‌ విమాన నమూనా రూ.4,040కు విక్రయిస్తున్నారు. అలాగే బోయింగ్‌ విమానం రూ.23,955, ఎక్స్‌ప్రెస్‌ విమానం రూ.3 వేలకు లభ్యమవుతున్నాయి. మరోవైపు ఆయా విమాన, హెలికాప్టర్‌ కంపెనీలకు చెందిన ఎయిర్‌ హోస్టెస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎగ్జిబిషన్‌లో కొలువుదీరిన విమాన నమూనాలతో పాటు సందర్శకులతో ఫొటోలకు ఫోజులివ్వడం కనిపించింది.

విమాన పైలెట్లను అప్రమత్తం చేస్తుంది
విమానాశ్రయాల్లో సురక్షితంగా ల్యాండ్‌ అవడం, టేక్‌ ఆఫ్‌ సేవల కోసం ఏవియేషన్‌ వెదర్‌ మానిటర్‌ సిస్టమ్‌ పనిచేస్తోంది. పొగమంచు బాగా కురిసిన సమయంలో, వర్షం బాగా కురిసిన సమయంలో విమాన సేవలు కొనసాగించాలా, వద్దా అన్న దానిపై అక్కడి వాతావరణాన్ని బాగా అధ్యయనం చేసి ఏటీసీకి చేరవేస్తోంది. మనమిచ్చే సమాచారాన్ని ఆయా విమాన పైలెట్లకు పంపించి అప్రమత్తం చేస్తారు. అలాగే మైన్‌లను గుర్తించేందుకు మాగ్నెటోను కూడా ఈ ఏడాది మరింత అప్‌డేట్‌ చేశాం. ఐదు కిలోమీటర్ల కమ్యూనికేషన్‌ రేంజ్‌లో ఇది పనిచేసేలా అభివృద్ధి చేశాం. – కులకర్ణి, సీఎస్‌ఐఆర్‌ ప్రతినిధి

విమానరంగంలో మహిళలకు బాసట
ఇండియన్‌ ఉమెన్‌ పైలెట్స్‌ అసోసియేషన్‌(ఐడబ్ల్యూపీఏ)లో 300 మంది వరకు సభ్యులుగా ఉన్నారు. విమాన రంగంలోకి వివిధ హోదాల్లో అడుగిడే మహిళా ఉద్యోగులకు మెళకువలు నేర్పుతున్నాం. ఈ రంగంలో వచ్చే ఆధునిక సమాచారం, అభివృద్ధిని కూడా విశదీకరిస్తాం. అలాగే పాఠశాలు, కాలేజీల్లో విమానరంగంపై అవగాహన కలిగిస్తాం. అలాగే ఉపకార వేతనాలు అందిస్తున్నాం. ఇలా ముఖ్యంగా మహిళలు ఈ రంగంలోకి వచ్చేలా ప్రోత్సాహం అందిస్తున్నాం.– డింపుల్‌ వాలీ, ఐబ్ల్యూపీఏ కమిటీ మెంబర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement