సాక్షి, హైదరాబాద్: ఉత్తర భారతం నుంచి చలిగాలులు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గత నెలలో ప్రవేశించాల్సిన చలి గాలులు ఆలస్యంగా రావడంతో పలు చోట్ల ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. ఇప్పటివరకు తూర్పు దిశ నుంచి తేమ గాలులు వచ్చాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదైన సంగతి తెలిసిందే. చలి గాలులు ప్రవేశించడంతో రాష్ట్రంలో పలుచోట్ల ఒక్కసారిగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా భీమ్‌పూర్ మండలం అర్లిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 5.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా తంసిలో 6.2 డిగ్రీలు, కొమురం భీం జిల్లా సిర్పూరులో 6.6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బరంపూర్‌లో 7 డిగ్రీలు, జైనాడ్, బేలాలలో 7.1 డిగ్రీల చొప్పున, భోరాజ్‌లో 7.2 డిగ్రీలు, ఆదిలాబాద్ పట్టణం, రాంనగర్‌లలో 7.3 డిగ్రీల చొప్పున, తలమడుగులో 7.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. వచ్చే నెలలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. వాతావరణ మార్పుల కారణంగానే ఈసారి గతం కంటే చలి తీవ్రత తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
నేడు పలు జిల్లాల్లో చలిగాలులు..
పొడి వాతావరణం కారణంగా సోమవారం ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని రాజారావు వెల్లడించారు. సోమ, మంగళవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment