బుధవారం ఉదయం 8 గంటలకు ఆదిలాబాద్ జిల్లా అర్లి (టి)ని కమ్ముకొన్న పొగమంచు
సాక్షి, నెట్‌వర్క్: కోడి కూయకముందే నిద్ర లేచే ఊర్లు.. ఎండపొడ మొదలైనా మబ్బు వీడటం లేదు. ఉదయం తొమ్మిదైనా కమ్ముకునే ఉంటున్న పొగమంచుతో.. ఇంట్లో ఉన్నా వణికిస్తున్న చలితో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయమేకాదు పగటివేళ కూడా చలిగా ఉం టోంది. ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటే భయపడుతున్న పరిస్థితి. రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయిన నేపథ్యంలో ఊర్లలో పరిస్థితి, జనం ఇబ్బందులపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం దాకా పలు జిల్లాల్లో పరిస్థితిని గమనించింది.
ఆ వివరాలతో ప్రత్యేక కథనం..
పశువులకు ‘గోనె సంచుల’ రక్షణ
ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతుండటంతో మనుషులతోపాటు పశువులు కూడా ఇబ్బందిపడుతున్నాయి. చలి నుంచి వాటిని రక్షించేందుకు యజమానులు ప్రయత్నిస్తున్నారు. అలా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టి) గ్రామంలో ఓ రైతు తన పశువులకు ఇలా గోనె సంచులు, వస్త్రాలు కప్పాడు.
మంచు దుప్పటిలో అర్లి (టి)
ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాలు మంచు దుప్పటిలో మునిగిపోయాయి. ఉదయం పది గంటల వరకూ పొగ మంచు కమ్ముకునే ఉంటోంది. బుధవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఇక్కడి భీంపూర్ మండలం అర్లి(టి) గ్రామంలో కమ్ముకున్న పొగమంచు ఇది. దీనితోపాటు బోథ్ మండలం సొనాల, బేల మండల కేంద్రంలోనూ ఇలాగే పొగమంచు కమ్ముకుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
నడి ఇంట్లో చలి మంటలు
గజగజా వణికిస్తున్న చలి నుంచి ఉపశమనం పొందేందుకు నడి ఇంట్లోనే చలి మంటలు వేసుకున్న వృద్ధులు వీరు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టి)లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. 2018లో ఈ గ్రామంలో 2.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా.. గత ఏడాది 4 డిగ్రీలు నమోదైంది. ఈసారి మంగళవారం 3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత వచ్చింది. మరికొద్దిరోజులు ఇదే పరిస్థితి ఉండనుండటంతో.. ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని అంచనా వేస్తున్నారు. – తాంసి, బేల
30 ఏళ్లకింద ఇలా చూశా..
ఈ చిత్రంలోని వృద్ధురాలు జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం కొల్వాయికి చెందిన శాకపురం గంగమ్మ. రెండు, మూడు రోజులుగా చలి భయపెడుతోందన్న ఆమె.. ఎప్పుడో 30 ఏళ్ల కింద ఇంత చలిని చూశానని చెప్పింది. పగలు రాత్రి తేడా లేకుండా చెద్దరి కప్పుకుని ఉండాల్సి వస్తోందంది. – సారంగపూర్ (జగిత్యాల)
సాక్షి, కామారెడ్డి/గాంధారి:
ఈ చిత్రంలోని రైతు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణ్‌పల్లికి చెందిన చాకలి సాయిలు. రోజూ తెల్లవారుజామునే పొలం వద్దకు వెళ్లేవాడు. ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో ఎనిమిది గంటలు దాటాకే ఇంట్లోంచి బయటికి వెళ్తున్నానని చెప్పాడు. మళ్లీ సాయంత్రం చీకటిపడేలోపే ఇంటికి వచ్చేస్తున్నామని తెలిపాడు.‘‘పొద్దటిపూట పొలం కాడికి పోవాలంటెనే భయమవుతోంది. చేతులు తిమ్మిరి ఎక్కుతున్నయి. ఎండ పొడ వచ్చినా చలి వదుల్తలేదు. ప్రతీ ఏడాది చలి ఉంటుందిగానీ ఈసారి చాలా ఎక్కువ అనిపిస్తోంది. చాలా ఇబ్బంది అవుతోంది..’’ అని సాయిలు పేర్కొన్నాడు.
దారి వెంట చలిమంటలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో చెరుకు కోతల సీజన్ నడుస్తోంది. రైతులు చెరుకును ఎడ్ల బండ్లపై ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. చలికి తట్టుకోలేక.. దారి మధ్యలో రెండు, మూడు కిలోమీటర్లకోసారి ఆగి చలిమంటలు వేసుకుంటూ ప్రయాణిస్తున్నారు. 15 ఏళ్లుగా చెరుకు తరలిస్తున్నామని, కానీ ఎన్నడూ ఇంతగా చలిని చూడలేదని చెరుకు కొట్టే కూలీ రాజునాయక్ వాపోయారు.
వణుకుతూ.. రోడ్లూడుస్తూ..
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాలలో బుధవారం ఉదయం చలికి గజగజా వణుకుతూ రోడ్లు ఊడుస్తున్న పారిశుధ్య కార్మికులు వీరు. రోజూ తెల్లవారకముందే విధుల్లోకి రావాల్సిన పరిస్థితిలో చలికి తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. సోనాలలో రెండు మూడు రోజులుగా సగటున 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. – బోథ్
చలి దరువు.. బతుకు బరువు
బుధవారం ఉదయం ఎనిమిది దాటుతున్నా వణికిస్తున్న చలిలో నడుచుకుంటూ వెళుతున్న చిరు వ్యాపారులు ఓ వైపు.. చలికి తట్టుకోలేక చలి మం టలు వేసుకుని ఉపశమనం పొందు తున్న పశువుల కాపరులు మరోవైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగవరంలో కనిపించిన దృశ్యాలివి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల జిల్లా
మరిన్ని రోజులు వణుకుడే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. చాలాచోట్ల సాధారణం కంటే ఐదారు డిగ్రీల మేర తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడంతో చలి పెరుగుతోందని పేర్కొంది. రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 4.6 డిగ్రీల అతితక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 5.8, బేల, అర్లి(టి)లో 5.9, సిర్పూర్‌లో 6, కోహీర్‌లో 7.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ప్రకటించింది. మరో మూడు రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment