అందరి ప్రోత్సాహంతోనే..స్టేట్ ఫస్ట్ సాధించా
తల్లాడ, న్యూస్‌లైన్: తల్లిదండ్రులు ప్రోత్సాహం, ఉపాధ్యాయులు కృషితోనే తాను స్టేట్ ఫస్ట్ వచ్చానని సీనియర్ ఇంటర్ స్టేట్ టాపర్ కోటేరు ఆషా చెప్పింది. ఈ విజయాన్ని తాను ఎలా సాధించిన తీరును తల్లాడకు చెందిన ఆషా ఆదివారం ‘న్యూస్‌లైన్’కు ఇలా వివరించింది.
‘‘అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు క్రమశిక్షణాయుతంగా చదివినందునే నాకు ఇంటర్ సెకండియర్‌లో వెయ్యి మార్కులకుగాను ఎంపీసీ గ్రూపులో 994 మార్కులు వచ్చాయి. స్టేట్ టాపర్‌గా ఉంటానని ఊహించలేదు. నేను ఖమ్మంలోని కృష్ణవేణి కళాశాలలో చదివాను. చిన్నతనం నుంచి కూడా చదువుపై బాగా ఇంటరెస్ట్ చూపించాను. తరగతిలో లెక్చరర్స్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వినేదాన్ని. అర్థమవకపోతే అడిగి తెలుసుకునేదానిని. ఒకటి నుంచి పదోతరగతి వరకు తల్లాడ యూనివర్సల్ విద్యాలయంలో చదివాను. టెన్త్‌లో 9.5 గ్రేడ్ సాధించాను. మాది వ్యవసాయ కుటుంబం. మా చెల్లి హరితకు కూడా సీనియర్ ఇంటర్‌లో 973 మార్కులు వచ్చాయి. ఇద్దరం ఒకేచోట చదువుకున్నాం. మా అక్క అనూష ప్రస్తుతం హైదరాబాద్ జేఎన్‌టీయూ కళాశాలలో ఎంసీఏ చదువుతోంది. నేను భవిష్యత్తులో బీటెక్ చదివి జాబ్ చేస్తాను. ప్రభుత్వ ఉద్యోగానికే మొదటి ప్రాధాన్యమిస్తాను. మా తల్లిదండ్రుల ఆశలను నెరవేరుస్తాను’’.
సంతోషంగా ఉంది
ఆషా విజయం తనకెంతో సంతోషాన్నిచ్చిందని ఆమె తండ్రి కోటేరు వెంకట్‌రెడ్డి చెప్పారు. ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. ‘‘నాకు ముగ్గురు అమ్మాయిలు. వారు చదువులో ముందుంటున్నారు. ఆషా స్టేట్ టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. నాకు ఆరు ఎకరాల పొలం ఉండేది. ముగ్గురు పిల్లల చదువుల కోసం మూడు ఎకరాలు అమ్మాను. ప్రస్తుతం మూడెకారాలు మాత్రమే ఉంది. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా’’ అన్నారు.