సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్(టీపీఎస్సీ)ను ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనికి సంబంధించిన ఫైలును సిద్ధం చేసిన ప్రభుత్వం.. దాన్ని రెండు, మూడు రోజుల్లో గవర్నర్ నరసింహన్‌కు పంపించాలని నిర్ణయించింది. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మొత్తంమీద ఈ ప్రక్రియంతా పూర్తయ్యేందుకు పది రోజుల వరకు పట్టే అవకాశముంది. అలాగే, కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకంపైనా సమాలోచనలు మొదలయ్యాయి. ఎంతమందిని సభ్యులుగా నియమించాలనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఏపీపీఎస్సీని మొదట చైర్మన్, ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేశారు. ఆ తరువాత క్రమంగా సభ్యుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం తమ అభీష్టం మేరకు పెంచుకుంటూ వచ్చింది. అలాగే ఇప్పుడు టీపీఎస్సీని కూడా చైర్మన్‌తో పాటు నలుగురు లేదా ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ తరువాత అవసరం అనుకుంటే సభ్యుల సంఖ్యను పెంచుకోవచ్చనే భావనలో ఉంది. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, టీపీఎస్సీ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం అవసరమా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోనే టీపీఎస్సీ ఏర్పాటుకు అవకాశం కల్పించినందువల్ల గవర్నర్ ఆమోదం సరిపోతుందని అధికారులు వాదిస్తున్నారు. కమలనాథన్ కమిటీతో చర్చించాక, ఉద్యోగుల కేటాయింపుపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చిన తరువాత.. నూతన నియామకాలపై నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. ఇంకా ఎంతమంది రాష్ట్రస్థాయి అధికారులు.. ఇతర సిబ్బంది అవసరమవుతారనే విషయంపై కూడా ప్రస్తుతమున్న ఉద్యోగుల కేటాయింపు అనంతరమే స్పష్టత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చని, వీలైతే ఆగస్టు నెలలోనే నూతన నియామకాలకు తెరలేపే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. జిల్లాల్లోని పోస్టులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండబోవని, వాటిని యథావిధిగా భర్తీ చేసుకునే వీలుంటుందన్నారు.
పది రోజుల్లోగా టీపీఎస్సీ!
Published Fri, Jul 25 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM
Advertisement