Commission chairman
-
విద్యాసంస్థల తీరు మారడం లేదు: జస్టిస్ కాంతారావు
సాక్షి, అమరావతి: విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్రంలోని విద్యాసంస్థల హెచ్చరించినప్పటికీ తమ తీరు మార్చుకోవడం లేదని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థుల ఫీజు, ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో కమిషన్, ప్రభుత్వాలు ఇది వరకే ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని మండిపడ్డారు. కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన కొన్ని విద్యాసంస్థలు అధిక ఫీజు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆన్లైన్ క్లాసులకు అనుమతి ఇచ్చినంత మాత్రాన ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేసుకోమని చెప్పినట్లు కాదని ఆసహనం వ్యక్తం చేశారు. (చదవండి: విద్యార్థుల అభీష్టమే ఫైనల్) ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తప్పనిసరిగా గత సంవత్సరం ట్యూషన్ ఫీజు మాత్రమే కట్టించుకోవాలని తెలిపారు. అది కూడా వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. దీనికి అదనంగా ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని విద్యాసంస్థలను హెచ్చరించారు. మరోవైపు మార్చి నెల నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని మౌఖిక ఆదేశాలతో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు, జీతాలు ఇవ్వట్లేదని ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. తక్షణమే సిబ్బందికి జీతాలు అందించాలని, తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. దీన్ని బేఖాతరు చేసే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులతో, ప్రైవేట్ ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలను, ఉద్యోగులకు జీతాలు ఇవ్వని విద్యాసంస్థలను గుర్తించాలని డీఈఓలు, ఆర్జేడీలు, ఆర్ఐవోలు ఆయన సూచించారు. (చదవండి: నిబంధనలు పాటించని స్కూళ్లు, కాలేజీల రద్దు!) తమ స్థాయిలో సమస్యల పరిష్కారానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉల్లంఘనలకు పాల్పడిన విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేటు ఉపాధ్యాయులు తమ సమస్యలను నేరుగా రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు ఫిర్యాదుల చేయోచ్చని చెప్పారు. 9150381111 కు ఫోన్ ద్వారా (ఫోన్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రభుత్వ పని దినాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది), apsermc2020@gmail.com కు ఈ - మెయిల్ ద్వారా, www.apsermc.ap.gov.in పోర్టల్ లో గ్రీవెన్స్ అనే లింక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆయన వెల్లడించారు. -
‘కమిషన్ కోరిన సమాచారాన్ని కళాశాలలు ఇవ్వాలి’
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 21వ తేదీలోగా రాష్ట్రంలోని అన్ని కాలేజీలు అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని ఉన్నత విద్యా కమిషన్ సెక్రటరీ ఎన్. రాజశేఖర్ విద్యాసంస్థలను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా కళాశాలల్లోని ఫీజులను సమీక్షిస్తున్న నేపథ్యంలో ఇంజనీరింగ్, ఫార్మా, ఏంసీఏ, ఎంబీఏ కాలేజీలన్నింటికీ నోటీసులు పంపించామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ప్రతి కాలేజీ యాజమాన్యం కమిషన్ కోరిన సమాచారాన్ని ఇవ్వాలని, గతంలో ఫీజుల నిర్థారణపై ఆరోపణులు వచ్చాయని పేర్కొన్నారు. కొన్ని కాలేజీలకు భారీగా ఫీజుల పెంచారని, మరికొన్ని కాలేజీలకు తక్కువ ఫీజుల పేట్టారని అన్నారు. కాలేజీల్లో సదుపాయాల తనిఖీకి కోసం ప్రత్యేక బృందాలను నియమిస్తున్నామని, టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. డిసెంబర్ నాటికి కొత్త ఫీజులను నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. -
జిల్లాలో పర్యటించిన ఎస్టీ కమిషన్ చైర్మన్
♦ బోయ, వాల్మీకులను ఎస్టీలో చేర్చాలని పలువురి వినతి ♦ త్వరలో ప్రభుత్వానికి నివేదిక : డాక్టర్ చెల్లప్ప వికారాబాద్/ధారూరు : బోయ, వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించే విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం నియమించిన ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులు సోమవారం జిల్లాలోని వికారాబాద్, ధారూరు మండలాల్లో పర్యటించారు. వికారాబాద్ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సబ్‌కలెక్టర్ శ్రుతిఓజా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బోయ, వాల్మీకులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాలో తక్కువ శాతం ఉన్నందుకే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తమ పట్ల చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో వాల్మీకి, బోయలను ఎస్టీలుగా ఉన్నారన్నారు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ తమకు గుర్తింపు లేకపోవడంతోనే ఆర్థిక, విద్యా పరంగా వెనుకబడి ఉన్నామని తెలిపారు. కేవలం ఏజెన్సీ ప్రాంతంలో ఉండే వాల్మీకి, బోయలను మాత్రమే ఎస్టీ జాబితాలో ఉంచారని తెలిపారు. తమను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని కమిషన్ చైర్మన్, సభ్యులు ఎదుట విన్నవించారు. ధారూరు మండలం కుక్కింద పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎస్ చెల్లప్ప గ్రామంలోని బోయలతో మాట్లాడారు. ప్రభుత్వం అందించే వివిధ పథకాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. వాల్మీకి, బోయల్లో సామాజిక స్వాతంత్య్రం రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ చెల్లప్ప మాట్లాడుతూ ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాలో పర్యటించి బోయ, వాల్మీకుల స్థితిగతులు, విద్య, ఆర్థిక అంశాలపై అధ్యయనం చేశామన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో పర్యటించి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఇదిలా ఉండగా.. బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చ వద్దను ఎస్టీ కుల సంఘం నాయకులు కమీషన్ బృందం ఎదుట అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్టీ కమీషన్ కార్యదర్శి కే వీరమల్లు, సభ్యుడు జగన్నాథరావు, బీసీ వెల్ఫేర్ డీడీ విద్యారెడ్డి, జెడ్పీటీసీ పట్లోళ్ల రాములు, డీటీడబ్ల్యూఓ అశోక్‌కుమార్, ఏటీడబ్ల్యూఓ రామేశ్వరీదేవి, ఏఎస్డబ్ల్యూఓ శ్యామెల్, తహసీల్దార్ బీ శ్రీనివాస్, వాల్మీకి,బోయ ఐక్యపోరాట సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి వెంకటేశ్, వికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు నాగయ్య, సభ్యులు రాజారత్నం, బాలయ్యలు, వీఆర్ఓ భూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
పది రోజుల్లోగా టీపీఎస్సీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్(టీపీఎస్సీ)ను ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనికి సంబంధించిన ఫైలును సిద్ధం చేసిన ప్రభుత్వం.. దాన్ని రెండు, మూడు రోజుల్లో గవర్నర్ నరసింహన్‌కు పంపించాలని నిర్ణయించింది. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మొత్తంమీద ఈ ప్రక్రియంతా పూర్తయ్యేందుకు పది రోజుల వరకు పట్టే అవకాశముంది. అలాగే, కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకంపైనా సమాలోచనలు మొదలయ్యాయి. ఎంతమందిని సభ్యులుగా నియమించాలనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏపీపీఎస్సీని మొదట చైర్మన్, ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేశారు. ఆ తరువాత క్రమంగా సభ్యుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం తమ అభీష్టం మేరకు పెంచుకుంటూ వచ్చింది. అలాగే ఇప్పుడు టీపీఎస్సీని కూడా చైర్మన్‌తో పాటు నలుగురు లేదా ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ తరువాత అవసరం అనుకుంటే సభ్యుల సంఖ్యను పెంచుకోవచ్చనే భావనలో ఉంది. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, టీపీఎస్సీ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం అవసరమా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే టీపీఎస్సీ ఏర్పాటుకు అవకాశం కల్పించినందువల్ల గవర్నర్ ఆమోదం సరిపోతుందని అధికారులు వాదిస్తున్నారు. కమలనాథన్ కమిటీతో చర్చించాక, ఉద్యోగుల కేటాయింపుపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చిన తరువాత.. నూతన నియామకాలపై నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. ఇంకా ఎంతమంది రాష్ట్రస్థాయి అధికారులు.. ఇతర సిబ్బంది అవసరమవుతారనే విషయంపై కూడా ప్రస్తుతమున్న ఉద్యోగుల కేటాయింపు అనంతరమే స్పష్టత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చని, వీలైతే ఆగస్టు నెలలోనే నూతన నియామకాలకు తెరలేపే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. జిల్లాల్లోని పోస్టులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండబోవని, వాటిని యథావిధిగా భర్తీ చేసుకునే వీలుంటుందన్నారు.