జిల్లాలో పర్యటించిన ఎస్టీ కమిషన్ చైర్మన్
♦ బోయ, వాల్మీకులను ఎస్టీలో చేర్చాలని పలువురి వినతి
♦ త్వరలో ప్రభుత్వానికి నివేదిక : డాక్టర్ చెల్లప్ప
వికారాబాద్/ధారూరు : బోయ, వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించే విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం నియమించిన ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులు సోమవారం జిల్లాలోని వికారాబాద్, ధారూరు మండలాల్లో పర్యటించారు. వికారాబాద్ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సబ్‌కలెక్టర్ శ్రుతిఓజా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బోయ, వాల్మీకులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాలో తక్కువ శాతం ఉన్నందుకే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తమ పట్ల చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో వాల్మీకి, బోయలను ఎస్టీలుగా ఉన్నారన్నారు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ తమకు గుర్తింపు లేకపోవడంతోనే ఆర్థిక, విద్యా పరంగా వెనుకబడి ఉన్నామని తెలిపారు. కేవలం ఏజెన్సీ ప్రాంతంలో ఉండే వాల్మీకి, బోయలను మాత్రమే ఎస్టీ జాబితాలో ఉంచారని తెలిపారు. తమను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని కమిషన్ చైర్మన్, సభ్యులు ఎదుట విన్నవించారు. ధారూరు మండలం కుక్కింద పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎస్ చెల్లప్ప గ్రామంలోని బోయలతో మాట్లాడారు. ప్రభుత్వం అందించే వివిధ పథకాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. వాల్మీకి, బోయల్లో సామాజిక స్వాతంత్య్రం రావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ చెల్లప్ప మాట్లాడుతూ ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాలో పర్యటించి బోయ, వాల్మీకుల స్థితిగతులు, విద్య, ఆర్థిక అంశాలపై అధ్యయనం చేశామన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో పర్యటించి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఇదిలా ఉండగా.. బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చ వద్దను ఎస్టీ కుల సంఘం నాయకులు కమీషన్ బృందం ఎదుట అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్టీ కమీషన్ కార్యదర్శి కే వీరమల్లు, సభ్యుడు జగన్నాథరావు, బీసీ వెల్ఫేర్ డీడీ విద్యారెడ్డి, జెడ్పీటీసీ పట్లోళ్ల రాములు, డీటీడబ్ల్యూఓ అశోక్‌కుమార్, ఏటీడబ్ల్యూఓ రామేశ్వరీదేవి, ఏఎస్‌డబ్ల్యూఓ శ్యామెల్, తహసీల్దార్ బీ శ్రీనివాస్, వాల్మీకి,బోయ ఐక్యపోరాట సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి వెంకటేశ్, వికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు నాగయ్య, సభ్యులు రాజారత్నం, బాలయ్యలు, వీఆర్‌ఓ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.